Vraj Iron and Steel IPO: వ్రజ్‌ ఐరన్‌ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి సహా పూర్తి వివరాలివే..

Vraj Iron and Steel IPO: వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఐపీఓ జూన్‌ 26-28 మధ్య జరగనుంది. ధరల శ్రేణి రూ.195- 207.

Published : 26 Jun 2024 11:42 IST

Vraj Iron and Steel IPO | ముంబయి: వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఐపీఓ (IPO) బుధవారం ప్రారంభమైంది. 28వ తేదీ వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని కంపెనీ రూ.195- 207గా నిర్ణయించింది. రూ.171 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మదుపర్లు గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.14,904తో 72 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఐపీఓ (Vraj Iron and Steel IPO) ద్వారా సమీకరించిన నిధులను బిలాస్‌పూర్‌లోని తయారీ కేంద్రాన్ని విస్తరించేందుకు వినియోగించనున్నట్లు వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వెల్లడించింది. మరికొన్నింటిని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వాడుకోనున్నట్లు సెబీకి సమర్పించిన ప్రాథమిక పత్రాల్లో తెలిపింది. ఐపీఓలో పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద షేర్లు అందుబాటులో లేవు.

ఇప్పటికే వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.51 కోట్లు సమీకరించింది. మొత్తం ఆరుగురు యాంకర్‌ ఇన్వెస్టర్లకు రూ.207 వద్ద 24,78,259 షేర్లను కేటాయించింది. కంపెనీ ఆఫర్‌ చేస్తున్న షేర్లలో 50 శాతం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు (QIBs), 35 శాతం రిటైల్‌ మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) రిజర్వ్‌ చేశారు. ఈ కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి. 2023లో కంపెనీ ఆదాయం 517.42 కోట్లు, లాభం రూ.54 కోట్లు, ఆస్తులు రూ.191 కోట్లుగా నమోదయ్యాయి. 

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • తేదీలు : జూన్‌ 26 - 28
  • ధరల శ్రేణి : రూ.195 - 207
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు : 72
  • కనీస పెట్టుబడి : రూ.14,904
  • షేర్ల అలాట్‌మెంట్‌ : జులై 1
  • రిఫండ్లు : జులై 2
  • డీమ్యాట్‌ ఖాతాలకు షేర్ల బదిలీ : జులై 2
  • లిస్టింగ్ తేదీ : జులై 3
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని