Updated : 09 Apr 2022 15:22 IST

Investments: పెట్టుబడుల ప్రారంభానికి ముందు ఇవి పూర్తిచేయండి!

డ‌బ్బు సంపాదించాలంటే రెండే మార్గాలు ఉన్నాయి. ఒక‌టి  ప‌నిచేసి (ఉద్యోగం, వ్యాపారం, వృత్తి..ఇలా) సంపాదించ‌డం, మ‌రొక‌టి మ‌నం పొదుపు చేసిన డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టి దానిపై రాబ‌డి పొంద‌డం. ఉద్యోగం లేదా మ‌రేదైనా ప‌నిచేసి డ‌బ్బు సంపాదించినా మ‌న ఆర్థిక ల‌క్ష్యాల‌కు కావాల్సిన సంప‌ద‌ను.. త‌గిన స‌మ‌యానికి సృష్టించుకునేందుకు, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌కు ఆర్థికంగా సిద్ధంగా ఉండేందుకు, ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగమించి రాబ‌డి పొందేందుకు.. పెట్టుబ‌డులు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే పెట్టుబ‌డులు చేసే ముందు ఈ కింది ప‌నుల‌ను ముందుగా పూర్తిచేయాలి. 

1. బ‌డ్జెట్‌..
చాలామంది బడ్జెట్ ప్రాముఖ్యతను విస్మరిస్తారు. పెట్టుబ‌డులు పెట్టే ముందే.. మీ మొత్తం ఆదాయం, ఖర్చులతో కూడిన బ‌డ్జెట్ త‌యారు చేయాలి. దీంతో ప్ర‌తీ నెల మీరు ఎంత ఖ‌ర్చు చేస్తున్నారు.. ఎంత పొదుపు చేస్తున్నారు.. వంటి విష‌యాల ప‌ట్ల ఒక స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ప్ర‌తీ నెల స‌గ‌టున ఎంత మొత్తం మిగులుతుందో దాని ప్ర‌కారం మిగులు నిధుల‌ను పెట్టుబ‌డికి కేటాయించాలి.  నెలవారీ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు, భార్యభర్తల జీతం, అదనంగా వచ్చేఅద్దె, డివిడెండ్, వడ్డీ ఆదాయం, ఏదైనా ఉంటే లెక్కించాలి. వ్యయాల వైపు, కిరాణా, పాఠశాల ఫీజు, రవాణా వ్యయం, ఈఎమ్ఐ లు వంటి ఖర్చులను లెక్కించుకోవాలి. ఔటింగ్లు, ప్రయాణం, ఇతరాలు మొదలైన వాటిని కూడా కలుపుకోవాలి. మరింత స్పష్టత కోసం, నెలవారీ, త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక ప్రాతిపదికన వాటిని వేరుచేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల, మీ ఖర్చు అలవాట్లను గమనించవచ్చు. ఎక్క‌డ అద‌న‌పు ఖ‌ర్చు చేస్తున్నామో తెలిస్తే.. అనవసర‌పు ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.  ఒక నెల ఖర్చులను ఇతర నెలలతో పోల్చితే ఎందుకు హెచ్చుతగ్గులు వస్తున్నాయనేది గమనించవచ్చు. స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమయ్యే ప్రణాళిక సిద్ధం చేయడం సులభం అవుతుంది.

2. రుణ చెల్లింపులు..
రుణాలు ఉండే వారు ముందుగా వాటిని బేరీజు వేసుకోవాలి. గృహ రుణం ఉన్నా ప‌ర్వాలేదు. ఎందుకంటే ఇది దీర్ఘ‌కాల రుణం పైగా ప్ర‌స్తుతం వ‌డ్డీ రేట్లు కూడా త‌క్కువ‌గానే ఉన్నాయి. కాబ‌ట్టి గృహ రుణం.. సంబంధిత ఈఎమ్ఐ చెల్లింపుల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. వాహన, వ్యక్తిగత రుణాలు (13-18 శాతం మధ్య) లేదా మీ క్రెడిట్ కార్డుపై చెల్లించని మొత్తంపై వడ్డీ సంవత్సరానికి సుమారు 36- 48 శాతం ఉండొచ్చు. ఇలాంటి అధిక వడ్డీ రేటు ఉండే రుణాల‌ను వీలైనంత త్వరగా చెల్లించేయాలి. పెట్టుబడులపై 12 శాతం ఆర్జించి రుణాలకు అంతకంటే ఎక్కువ వడ్డీ చెల్లించడం ద్వారా ప్రయోజనం ఉండదు. 

తీసుకున్న రుణాల‌ను స‌క్ర‌మంగా చెల్లించ‌క‌పోతే క్రెడిట్ స్కోరు కూడా దెబ్బ‌తింటుంది. దీంతో భ‌విష్య‌త్తులో రుణాలు త్వ‌ర‌గా లభించ‌వు. వ‌డ్డీ రేట్లు కూడా ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల మీ వ‌ద్ద మిగులు నిధులు ఉంటే ముందుగా అధిక వ‌డ్డీ రేట్ల‌తో కూడిన రుణాల‌ను చెల్లించాలి. ఆ తర్వాతే పెట్టుబ‌డులు చేయాలి. 

3. స్వీయ, కుటుంబ కవరేజ్ పొందండి..
మీరు పెట్టుబడి పెట్టడానికి ముందే, స్వీయ, కుటుంబ సభ్యుల కోసం ఒక ఆరోగ్యబీమా పథకం లేదా కుటుంబం ఫ్లోటర్ ఆరోగ్య పథకం ద్వారా తగిన కవరేజీని పొందాలి. లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులకు మొత్తం పెట్టుబడులు ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఇది దీర్ఘ కాల పొదుపు ప్రణాళికపై ప్రభావం చూపుతుంది. మీపై ఆర్థికంగా ఆధారపడిన వారు ఉంటే, తగిన హామీ మొత్తానికి టర్మ్ బీమా పాల‌సీని తీసుకోవాలి. వ్యక్తులు తమ ఆదాయానికి కనీసం 10 - 15 రెట్లు హామీ మొత్తం ఉండేలా టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలి. 60 సంవత్సరాల వరకు లేదా మీ ఆర్థిక బాధ్యతలు ఉన్నంత వరకు బీమా పాలసీని కొనసాగించాలి.

4. లక్ష్యాన్ని తెలుసుకోండి..
పెట్టుబడి పెట్టడానికి ముందే, స్వల్ప,మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను గుర్తించాలి. ఉదాహరణకు, మీ లక్ష్యం పిల్లల ఉన్నత విద్య కోసం పొదుపు అనుకుంటే, దానికయ్యే ప్రస్తుత వ్యయాన్ని, 12 లేదా 15 సంవత్సరాల తర్వాత అవసరమైన వాస్తవ మొత్తాన్ని అంచనా వేసేందుకు ప్రస్తుత ఖర్చుకు ద్రవ్యోల్బణాన్ని కలిపి లెక్కించాలి. తద్వారా మీ ఆర్థిక లక్ష్యానికి అవసరమయ్యే మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. దీనికి అనుగుణంగా స‌రైన ప‌థ‌కాన్ని ఎంచుకుని పెట్టుబ‌డులు ప్రారంభించ‌వ‌చ్చు. 

 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని