Car Loan: లోన్‌పై కొత్త కారు కొనాల‌నుకుంటున్నారా..? వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి?

అనేక బ్యాంకులు కారు రుణాల‌పై త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి.

Updated : 04 Feb 2022 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త కారు కొనుగోలు కోసం నిధులు ఏర్పాటు చేసుకోవ‌డంలో బ్యాంకు రుణం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇప్పుడు బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీ రేటుకే కారు రుణాలు అందజేస్తున్నాయి. 750 ఇంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు 6.75% వ‌డ్డీ రేటు నుంచి మొద‌లుకొని కారు రుణాలు అంద‌చేస్తున్నాయి. ఎక్కువ కారు రుణాలు 5 సంవ‌త్సరాల కాలవ్యవధికి ఉంటాయి. మీ వ‌ద్ద మిగులు న‌గ‌దు ఉంటే ముంద‌స్తుగా కూడా రుణాన్ని తీర్చేయొచ్చు. అయితే, ఛార్జీలు వర్తిస్తాయి.

కారు లోన్ తీసుకుంటున్నప్పుడు వ‌డ్డీ రేట్లే కాకుండా తప్పనిసరిగా ఫ్లెక్సిబుల్ కాల‌వ్యవధి ఆప్షన్లు, ఫ్లెక్సిబుల్‌ నెలవారీ వాయిదాల ఎంపికలు, ఇతర ఫీచర్లను కూడా చెక్ చేసుకోవాలి. కారు రుణం కోసం దర‌ఖాస్తు చేసిన‌ప్పుడు డౌన్ పేమెంట్ 10-20% చేసిన త‌ర్వాత మిగిలిన మొత్తానికి బ్యాంకులు రుణం అందిస్తాయి. కారు డెలివ‌రీ అయిన త‌ర్వాత రుణాన్ని వ‌డ్డీతో స‌హా వాయిదాల రూపంలో చెల్లించాలి. మీ రుణ అవ‌స‌రాలు, నెల‌వారీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణ మొత్తాన్ని బ్యాంకులు నిర్ణయించొచ్చు.

రుణం కాల వ్యవధి విషయానికొస్తే ఎక్కువ‌గా వినియోగ‌దారులు 5 సంవత్సరాలకు వాయిదాలు కట్టేవిధంగా కాల వ్యవధిని ఎంచుకుంటారు. అయితే, కొద్దిమంది వినియోగ‌దారులు త‌క్కువ ఈఎమ్ఐ చెల్లించ‌డానికి లేదా ఎక్కువ మొత్తంలో కారు రుణం అవ‌స‌ర‌మైన‌పుడు 5 సంవ‌త్సరాలకు మించి కారు రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఈఎమ్ఐ చెల్లించేట‌పుడు మీ బ్యాంక్ ఖాతా నుంచి నెల‌వారీ చెల్లింపులు ఆటోమేటిక్ డెబిట్ అయ్యేలా చూసుకోవచ్చు. లేదా పోస్ట్ డేటెడ్ చెక్‌ల ద్వారా కూడా చెల్లించవచ్చు. కారు రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వ‌డ్డీ రేట్లను సరిపోల్చి చూసుకోవాలి. ఈఎమ్ఐలు, ఇత‌ర ఛార్జీలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. కారు రుణ ఈఎమ్ఐల‌ను, పెనాల్టీలను నివారించ‌డానికి ఆల‌స్యం లేకుండా కట్టాల్సి ఉంటుంది. బ‌కాయిల‌ను సరిగ్గా చెల్లించ‌ని పక్షంలో బ్యాంకులు కారును ప్రయాణం మధ్యలో రోడ్డుపై కూడా స్వాధీనం చేసుకోవడానికి హ‌క్కులు ఉంటాయి.

రూ.5 ల‌క్షల రుణానికి 5 సంవత్సరాల కాలవ్యవవధికి వడ్డీ రేట్లు ఇలా..

గమనిక: ఈ డేటా 2022 ఫిబ్రవరి 2 నాటిది. పైన పేర్కొన్న వడ్డీ రేటు ఆధారంగా ఈఎంఐ లెక్కించాం. ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర ఛార్జీలు కలపలేదు. వ్యక్తులను బట్టి వడ్డీరేట్లలో మార్పులు ఉండొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని