Credit Cards: క్రెడిట్ కార్డు క్లోజ్‌ చేస్తున్నారా? క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందని తెలుసా?

క్రెడిట్ కార్డు రద్దు చేయడం వల్ల క్రెడిట్ స్కోరు మెరుగవుతుందని అపోహ పడుతుంటారు. కానీ నిజానికి క్రెడిట్ కార్డు రద్దు చేసుకుంటే.. క్రెడిట్ స్కోరుపై చెడు ప్రభావం పడుతుంది.

Updated : 02 Aug 2022 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అకౌంట్‌లో డబ్బు లేకపోయినా క్రెడిట్ కార్డు (Credit Card) ఉంటే చాలు.. ఆర్థిక అత్యవసరాలను సులభంగా అధిగమించొచ్చు. వడ్డీ రహిత కాలవ్యవధి అందుబాటులో ఉంటుంది. కాబట్టి గడువు లోపు చెల్లింపులు చేస్తే.. ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరమూ ఉండదు. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయనో, ఎక్కువ ఖర్చు చేస్తామనే భయంతోనో, మరొక బ్యాంకు ఇచ్చే కొత్త క్రెడిట్ ఆఫర్లు బాగున్నాయనో, ఇలా అనేక కారణాలతో పాత కార్డును రద్దు చేస్తుంటారు కొందరు. పైగా క్రెడిట్ కార్డు రద్దు చేయడం వల్ల క్రెడిట్ స్కోరు మెరుగవుతుందని అపోహ పడుతుంటారు. కానీ నిజానికి క్రెడిట్ కార్డు రద్దు చేసుకుంటే.. క్రెడిట్ స్కోరుపై చెడు ప్రభావం పడుతుంది. అందువల్ల కార్డు రద్దు చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

క్రెడిట్ మిక్స్‌: క్రెడిట్ కార్డు ఒక వ్యక్తి  క్రెడిట్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి రద్దు చేయడం అంటే ఖర్చు చేసేందుకు అందుబాటులో ఉన్న మొత్తం కొనుగోలు శక్తిని తగ్గించుకోవడమే. ఒకే క్రెడిట్ కార్డు ఉన్నవారు.. తమ వద్ద కార్డును రద్దు చేయాలనుకుంటే.. పోర్ట్‌ఫోలియోలో తగిన క్రెడిట్ మిక్స్ (తనఖా రుణాలు, ఇతర రుణాలు)ను నిర్వహించాలి. సిబిల్ స్కోరు లెక్కించేటప్పుడు పరిగణనలోకి తీసుకునే అంశాల్లో ఇదీ ఒకటి. తగిన క్రెడిట్ మిక్స్‌ నిర్వహించడం వల్ల క్రెడిట్ కార్డు రద్దు చేసినప్పుడు క్రెడిట్ స్కోరులో మార్పులు రాకపోవచ్చు. 

సీయూఆర్ పెర‌గ‌కుండా: స్థిరమైన చెల్లింపు చరిత్ర కలిగి ఉన్నవారు క్రెడిట్ కార్డు మనుగడలో ఉంచడం వల్ల.. క్రెడిట్ స్కోరు తగ్గకుండా చూసుకోవచ్చు. అలాగే, మరింత మెరుగుపర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. క్రెడిట్ కార్డు రద్దు చేసుకుంటే.. వారి ఖాతాలో అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి తగ్గిపోతుంది. దీంతో పాటు క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) పెరిగిపోతుంది. ఇది ప్రమాదకరం. క్రెడిట్ కార్డుదారులకు అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్‌లో వారు ఎంత మొత్తం వినియోగించుకుంటున్నారని తెలియజేసేదే సీయూఆర్. గరిష్ఠ పరిమితి వరకు క్రెడిట్‌ని ఉపయోగిస్తుంటే.. అటువంటి వారు ఖర్చులను అదుపు చేయడం లేదని అర్థం. అందువల్ల సీయూఆర్ ఎల్లప్పుడూ 30 శాతం మించకుండా చూసుకోవాలి. క్రెడిట్ కార్డును రద్దు చేయటం వల్ల ఆ నిర్దిష్ట కార్డులో అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గుతుంది. కాబట్టి క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరిగిపోతుంది.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి రూ.50 వేలు ప‌రిమితితో రెండు క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు అనుకుందాం. ప్ర‌తి నెలా దాదాపు రూ.25 వేలు క్రెడిట్ కార్డుతో ఖ‌ర్చు చేస్తున్నాడు అంటే.. దీని అర్థం అత‌డికి అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్‌ రూ.1 ల‌క్ష అయితే అత‌డు ఉప‌యోగించుకున్న‌ది మాత్రం రూ.25 వేలు మాత్ర‌మే. అంటే, అత‌డి సీయూర్ 25 శాతం మాత్ర‌మే ఉంది. ఇది మంచిదే. కానీ అత‌డు ఒక కార్డును ర‌ద్దు చేసుకుంటే.. అత‌డికి ల‌భించే క్రెడిట్ లిమిట్ రూ.50 వేలు మాత్ర‌మే. రూ.25 వేలు వినియోగించ‌కుంటే అత‌డి సీయూఆర్ 50 శాతానికి పెరిగిపోతుంది. సీయూఆర్ 30 శాతానికి మించ‌కుండా చూసుకోవాలి. కాబ‌ట్టి ఈ సంద‌ర్భంలో కార్డు ర‌ద్దు చేయ‌డం క‌రెక్ట్ కాదు. అందుకే క్రెడిట్ కార్డును మూసివేసే సమయం కూడా చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతుంటారు. ఎలాంటి బ‌కాయిలూ లేన‌ప్పుడు లేదా అన్ని బ‌కాయిలూ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాక ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల‌ క్రెడిట్ యుటిలైజేష‌న్ రేషియో పెర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డొచ్చు.

పాత కార్డుల ర‌ద్దు వ‌ద్దు: క్రెడిట్ కార్డును ర‌ద్దు చేయాల‌నుకున్న‌ప్పుడు చాలా కాలంగా వాడుతున్న కార్డుల‌ను మూసివేయ‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోరుపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపొచ్చు. పాత కార్డులను ఉప‌యోగించి గ‌తంలో స‌మ‌యానుకూల చెల్లింపులు చేసి ఉండ‌వ‌చ్చు. ఇవి మీ క్రెడిట్ స్కోరులో ప్ర‌తిబింబిస్తాయి. ఈ కార్డులను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల ఈ చ‌రిత్ర మీ క్రెడిట్ స్కోరు నుంచి తొలిగిస్తారు. దీంతో క్రెడిట్ స్కోరు త‌గ్గే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల ర‌ద్దు అవసరం అయితే సాధ్య‌మైనంత వ‌ర‌కు కొత్త కార్డుల‌ను ర‌ద్దు చేసుకోవ‌డం మంచిది. 

బ‌కాయిలు, ఇత‌ర ఫీజులు, ఛార్జీలు: కార్డు ర‌ద్దు చేసుకునే ముందు ఆ కార్డుపై ఉన్న ఆటో-చెల్లింపులు సంబంధిత రుణాల‌ను పూర్తిగా చెల్లించాలి లేదా మ‌రొక కార్డుకు బ‌దిలీ చేసుకోవచ్చు. త‌ర్వాత‌ త‌క్కువ వ‌డ్డీ రేటుతో రుణం చెల్లించేందుకు అవ‌కాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు సంస్థ స‌భ్య‌త్వ రుసుములు, బౌన్స్ ఫీజులు, ఆల‌స్య‌పు రుసుములు వంటి కొన్ని ఫీజుల‌ను వ‌సూలు చేస్తుంటుంది. వీటి గురించి చాలా మందికి తెలియ‌దు. కార్డుపై వ‌ర్తించే హిడెన్ ఛార్జీల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కార్డు ర‌ద్దు చేసే ముందు ఇలాంటివి ఏమైనా ఉంటే క్లియ‌ర్ చేసుకోవ‌డం మంచిది. లేదంటే క్రెడిట్ స్కోరు దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది. 

రివార్డు పాయింట్లు: క్రెడిట్ కార్డును ఉప‌యోగించి చెల్లింపులు చేసిన‌ప్పుడు జారీ సంస్థ‌లు రివార్డు పాయిట్లను ఇస్తుంటాయి. కొంత మంది వీటి గురించి పూర్తిగా మర్చిపోతుంటారు. క్రెడిట్ కార్డు ర‌ద్దు చేసుకునే వారు ముందుగానే రివార్డు పాయింట్లను పూర్తిగా రిడీమ్ చేసుకోవాలి. 

చివ‌రిగా: క్రెడిట్ కార్డుతో అనుసంధాన‌మైన ఆల‌స్య‌పు చెల్లింపులు క్రెడిట్ నివేదికలో క‌నిపించ‌కుండా ఉండేందుకు దాదాపు 7 ఏళ్లు స‌మ‌యం ప‌ట్ట‌వచ్చు. క్రెడిట్ కార్డు రిపోర్టులో మంచి క్రెడిట్ చరిత్ర ఎక్కువ కాలం (దాదాపు 10 ఏళ్లు) ఉంటుంది. ఇది క్రెడిట్ చ‌రిత్ర‌ను సానుకూలంగా మార్చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఒక‌టి కంటే ఎక్కువ కార్డులు ఉన్న‌ప్పుడు.. ఎక్కువ‌గా ఉప‌యోగించ‌ని కార్డును ర‌ద్దు చేసుకోవ‌చ్చు. కానీ ఒకే కార్డు ఉన్న‌వారు, కార్డుల‌ను స‌మర్థ‌ంగా నిర్వ‌హించ‌గ‌లిగితే క్రెడిట్ కార్డును ర‌ద్దు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని