Tokenization: మీ డెబిట్‌/క్రెడిట్ కార్డుకు టోకెన్ నంబ‌రు జన‌రేట్ చేయ‌డం ఎలా?

టోకేనైజేష‌న్‌ను అమ‌లు చేసేందుకు సెప్టెంబ‌రు 30,2022 వ‌ర‌కు గ‌డువు పొడిగించారు

Updated : 28 Jul 2022 19:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌లో క్రెడిట్‌/డెబిట్ కార్డు చెల్లింపుల‌కు సంబంధించి వినియోగ‌దారుల స‌మాచారం సైబ‌ర్ నేర‌స్థుల‌కు చిక్క‌కుండా ఉండేందుకు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన విధాన‌మే టోక‌నైజేష‌న్‌. ఆన్‌లైన్‌లో డెబిట్‌/క్రెడిట్ కార్డు డేటా ఎంట‌ర్ చేసే పాయింట్-ఆఫ్‌-సేల్‌, యాప్ లావాదేవీల వ‌ద్ద కార్డు వివ‌రాల‌కు బ‌దులు, యునిక్ టోకెన్‌తో రీప్లేస్ చేయాల‌ని ఆర్‌బీఐ సూచించింది. సంస్థ‌లు టోకేనైజేష‌న్‌ను అమ‌లు చేసేందుకు 2022 సెప్టెంబ‌రు 30 వ‌ర‌కు గ‌డువు పొడిగించారు. కార్డు వాస్త‌వ వివ‌రాల‌ను టోకెన్ రూపంలో భద్ర‌ప‌రుస్తారు. మీరు ఏ ఈ-కామ‌ర్స్ సైట్ నుంచి మీ కార్డుకి టోకెన్ జ‌న‌రేట్ చేస్తారో అది అక్క‌డి నుంచి చేసే చెల్లింపుల‌కు మాత్ర‌మే ప‌నిచేస్తుంది.

టోక‌నైజేష‌న్ ఎలా పూర్తి చేయాలి?
స్టెప్ 1: ప్రారంభం
ఏదైనా ఈ-కామర్స్ వైబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేష‌న్‌లో కొనుగోలు చేసిన త‌ర్వాత చెక్ అవుట్ సెక్ష‌న్‌లో చెల్లింపుల లావాదేవీల‌ను ప్రారంభించాలి. 

స్టెప్‌2: కార్డు ఎంచుకోవ‌డం
చెక్ అవుట్ సమయంలో చెల్లింపుల కోసం ఇంత‌కు ముందు మాదిరిగానే మీ డెబిట్/క్రెడిట్ కార్డు వివ‌రాలు, ఇత‌ర వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

స్టెప్ 3: కార్డును సుర‌క్షితం చేయ‌డం 
ఇప్పుడు ‘ఆర్‌బీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం మీ కార్డుని సుర‌క్షితం చేసుకోండి’ లేదా ‘ఆర్‌బీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం మీ కార్డును టోక‌నైజ్ చేయండి’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి.

స్టెప్ 4: టోకెన్ క్రియేట్ చేసేందుకు స‌మ్మ‌తి..
మీ బ్యాంకు మీ మొబైల్ నంబ‌రు లేదా ఈ-మెయిల్‌కి పంపిన ఓటీపీని ఎంట‌ర్ చేసి టోక‌నైజేష‌న్ కోసం మీ స‌మ్మ‌తిని తెలియ‌జేయండి.

స్టెప్ 5: టోకెన్ జ‌న‌రేష‌న్‌..
ఇప్పుడు మీ టోకెన్ జన‌రేట్ అవుతుంది. ఈ-కామ‌ర్స్ సైట్‌/అప్లికేష‌న్‌లో మీ కార్డు వాస్త‌వ వివ‌రాల‌కు బ‌దులు ఈ టోకెన్ సేవ్ అవుతుంది.

స్టెప్‌ 6: టోకనైజ్ పూర్తి..
మీరు అదే వెబ్‌సైట్ లేదా అప్లికేషన్‌ను మళ్లీ సందర్శించినప్పుడు, చెల్లింపుల‌ కోసం మీ కార్డ్‌ని గుర్తించేందుకు కార్డు చివ‌రిలోని నాలుగు అంకెలు స్క్రీన్‌పై క‌నిపిస్తాయి. వీటి ఆధారంగా కార్డును గుర్తించ‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని