Home Loan: హోంలోన్‌ ముందే చెల్లించేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

Home Loan: గృహ రుణాన్ని గడువుకు ముందు క్లోజ్‌ చేస్తే బ్యాంకు నుంచి ఏమేం పొందాలో ఇక్కడ తెలుసుకోండి.

Published : 27 Mar 2023 20:36 IST

Home Loan | ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది బ్యాంకు రుణంతోనే సొంత ఇంటి (Home Loan) కలను నిజం చేసుకుంటారు. రుణాన్ని తీసుకున్న తర్వాత దీర్ఘకాలం పాటు ఈఎంఐ (EMI) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆర్థికంగా పరిస్థితులు బాగా అనుకూలిస్తే రుణాన్ని ముందుగానే తీర్చేయొచ్చు. ఇలా ముందుగానే గృహ రుణాన్ని (Home loan) తీర్చేయడాన్ని ప్రీ-క్లోజర్‌ అంటారు. ఇలా రుణాన్ని తీర్చేస్తే  ఏం చేయాలో తెలుసుకుందాం..

ప్రీ-క్లోజర్‌

రుణం తిరిగి చెల్లించే వ్యవధి ఉన్నా కూడా మధ్యలోనే ఏక మొత్తంలో మిగిలిన రుణ మొత్తాన్నిచెల్లించి, రుణాన్ని సెటిల్‌చేసే ప్రక్రియ. ఇది రెండు విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు వడ్డీ చెల్లింపులపై ఆదా చేయొచ్చు. గృహ రుణ ఈఎంఐ పెద్ద మొత్తంలోనే ఉంటుంది కాబట్టి చేతిలో తగినంత నగదు కలిగి ఉండడానికి అవకాశముంటుంది. మీరు ప్రీ-క్లోజర్‌ కోసం ప్లాన్‌ చేస్తుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

రుసుములు

బ్యాంకులు ఫ్లోటింగ్‌ (చలన) వడ్డీ రేటు గృహ రుణాలపై ఎటువంటి ప్రీ-క్లోజర్‌ రుసుమును వసూలు చేయవు. అంటే, ఫిక్స్‌డ్‌ (స్థిర) వడ్డీతో ఈ రుణాన్ని తీసుకోకుండా ఉంటే, మీరు రుణాన్ని ముందస్తుగానే తీర్చేసినా ఎటువంటి రుసుములు, పెనాల్టీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే స్థిర వడ్డీ రేటును కలిగి ఉన్నట్లయితే బ్యాంకులు మీకు బకాయి ఉన్న రుణ మొత్తంపై 4- 5% క్లోజర్‌ రుసుముగా వసూలు చేయొచ్చు. అయితే ఈ రోజుల్లో చాలా గృహ రుణాలు ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లనే కలిగి ఉంటున్నాయి. అందువల్ల మీరు ముందస్తుగా రుణాన్ని క్లోజ్‌ చేయడం కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఏ సమయంలో?

రుణాన్ని ముందే తీర్చేయాలనుకుంటే, దానివల్ల ఎంత లబ్ధి పొందుతారో కూడా లెక్కలు వేసుకోవాలి. ప్రారంభంలో లేదా మధ్యలో ముందస్తు చెల్లింపులు చేయడం మంచిదే. అదే, రుణం చివర్లో ఉంటే, అప్పుడు ఈఎంఐలు అన్నీ (ప్రిన్సిపల్‌) అసలువే ఉంటాయి. ఈఎంఐల కాలవ్యవధి 1-2 సంవత్సరాలు మిగిలి ఉన్నట్లయితే, వడ్డీపై ఆదా చేయడం కుదరదు. అందువల్ల ప్రీ-క్లోజ్‌ అనేది రుణం చివర్లో అంత ప్రయోజనం చేకూర్చదు.

సమాచారం

మీ గృహ రుణాన్ని ప్రీ-క్లోజ్‌ చేయాలనే నిర్ణయం గురించి బ్యాంకుకు అధికారికంగా, కనీసం ఒక వారం లేదా పక్షం రోజుల ముందుగానే తెలియజేయడం మంచిది. బ్యాంకుకు ఆఫ్‌లైన్‌ దరఖాస్తు రాయవచ్చు. బ్యాంకు శాఖ అధికారిక ఇ-మెయిల్‌ ఐడీకి మెయిల్‌ పంపవచ్చు.

NOC/EC

రుణాన్ని ముందస్తుగా తీర్చివేసిన తర్వాత బ్యాంకు నుంచి నో-అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC) తీసుకోవాలి. బ్యాంకుకు ఏవిధమైన బకాయిలు లేవని ఈ పత్రం నిర్ధారిస్తుంది. ఇది మీకు ముఖ్యమైన పత్రం. రుణ చెల్లింపుల ప్రక్రియ ముగిసిన తర్వాత, మీ ఆస్తికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలను తెలిపే ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికేట్‌ (EC) కోసం అడగాలి. ఆస్తి (ఇంటి)కి ఎలాంటి ద్రవ్య, చట్టపరమైన బాధ్యతలు లేవని EC ధ్రువీకరిస్తుంది. ఇది, మీరు భవిష్యత్‌లో ఇంటిని విక్రయించాలనుకున్నప్పుడు ఉపయోగపడే ముఖ్యమైన పత్రం.

తాత్కాలిక హక్కు

రుణగ్రహీత రుణాన్ని పూర్తిగా బ్యాంకుకు చెల్లించేవరకు బ్యాంకుకు ఆ ఆస్తిపై తాత్కాలిక హక్కు ఉంటుంది. ఈ హక్కు కారణంగా మిమ్మల్ని ఇంటిని విక్రయించకుండా నిరోధిస్తుంది. ప్రీ-క్లోజర్‌ సమయంలో మీ ఇంటిపై తాత్కాలిక హక్కు ఉన్నట్లయితే బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తం రుణాన్ని తీర్చివేసినందుకు మీరు ఆ హక్కును రద్దు చేయించాలి. దీనికి నెల వరకు సమయం పట్టొచ్చు. తాత్కాలిక హక్కును బ్యాంకు రద్దు చేసుకోవడం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా మీ ఇంటిని విక్రయించే హక్కు మీకు ఉంటుంది.

డాక్యుమెంట్స్‌

ముందస్తుగా బకాయి రుణం తీర్చివేసిన తర్వాత.. బ్యాంకు వద్ద అప్పటికే ఉన్న మీ డాక్యుమెంట్‌లు అన్నీ తిరిగి తీసుకోవాలి. ఉదా: బ్యాంకు వద్ద ఉన్న అన్ని పోస్ట్‌-డేటెడ్‌ చెక్‌లు, రుణ దరఖాస్తు సమయంలో సమర్పించిన ఆస్తి పత్రాలు, ఇతర ఒరిజినల్‌ పత్రాలను సేకరించాలి. దీనివల్ల భవిష్యత్‌లో ఎటువంటి చట్టపరమైన, ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఉండొచ్చు.

చివరిగా: బకాయి మొత్తాన్ని సెటిల్‌ చేయడానికి తగినన్ని నిధులు ఉంటేనే ప్రీ-క్లోజర్‌ మంచిది. గృహ రుణానికి వడ్డీ రేటు తక్కువ కాబట్టి, చివరి వరకు రుణ ఈఎంఐలు చెల్లిస్తూనే.. అందుబాటులో ఉన్న అదనపు నిధులను అధిక ప్రతిఫలమిచ్చే మదుపు పథకాలకు తరలించడం కూడా మంచి ఆలోచనే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని