PF Balance: మీ ఫీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలా..ఈ మార్గాల‌ను అనుస‌రించండి!

ఈపీఎఫ్ ఖాతాదారులు వివిధ మార్గాల ద్వారా ఖాతా బ్యాలెన్స్‌ను తెలుసుకోవ‌చ్చు

Updated : 07 Jun 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల భ‌విష్య నిధి (EPF) డిపాజిట్ల‌పై 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ 8.10 శాతం వడ్డీ రేటు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించింది. ఇది 40 ఏళ్ల కనిష్ఠం కావడం గమనార్హం. 2020-21, 2019-20 ఆర్థిక సంవత్సరాల‌లో 8.50 శాతం వ‌డ్డీ ల‌భించ‌గా, అంతకుముందు ఏడాది (2018-19)లో 8.65 శాతం వ‌డ్డీ జ‌మ అయ్యింది. అయితే, ఇత‌ర స్థిర ఆదాయం ప‌థ‌కాల‌తో పోలిస్తే మాత్రం పీఎఫ్‌పై ఇప్ప‌టికీ మెరుగైన వ‌డ్డీ రేటే ల‌భిస్తోంది.

ఈపీఎఫ్ఓలో భాగ‌మైన ఉద్యోగులు ప్ర‌తీ నెల‌ త‌మ మూల‌వేత‌నంలో 12 శాతం మొత్తాన్ని  పీఎఫ్‌లో జమ చేయాలి. సంస్థ కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో వేస్తుంది. ఉద్యోగులు కావాలంటే ‘వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (VPF)’ ద్వారా 100 శాతం వరకు కూడా డిపాజిట్‌ చేసే వెసులుబాటు ఉంది. వీపీఎఫ్‌ డిపాజిట్లకు కూడా ఈపీఎఫ్‌ వడ్డీరేటే వర్తిస్తుంది. పైగా పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు వివిధ మార్గాల ద్వారా ఖాతా బ్యాలెన్స్‌ను తెలుసుకోవ‌చ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌..

ఈపీఎఫ్‌ఓ సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న స‌భ్యులు www.epfindia.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో ‘సర్వీసెస్‌’ ట్యాబ్ డ్రాప్‌డౌన్ మెనూలో అందుబాటులో ఉండే ‘ఫ‌ర్ ఎంప్లాయిస్’ ఆప్ష‌న్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మ‌రో పేజీ ఓపెన్ అవుతుంది. కింది భాగంలో ఉన్న‌ ‘సర్వీసెస్‌’ లో ‘మెంబర్‌ పాస్‌బుక్‌’ పై క్లిక్ చేస్తే మ‌రో పేజీ వ‌స్తుంది. ఇక్క‌డ‌ యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి కింద ఇచ్చిన ఓ గణిత సమస్యను పరిష్కరించి దాని స‌మాధానం ప్ర‌క్క‌న ఉన్న బాక్సులో టైప్ చేసి లాగిన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.

2. యూనిఫైడ్ పోర్టల్ ద్వారా..

యూనిఫైడ్ పోర్ట్‌ల్‌కి నేరుగా లాగిన్ అయ్యి కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవ‌చ్చు. యూనిఫైడ్ పోర్ట‌ల్ పేజీలో మీ యూఏఎన్ నంబ‌రు, పాస్‌వ‌ర్డ్‌, కింద ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి సైనిన్ చేయాలి. పాస్‌బుక్‌ను ఓపెన్ చేసి వేరు వేరు ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు మీరు చేసిన పీఎఫ్ కాంట్రిబ్యూష‌న్ వివ‌రాల‌ను విపులంగా తెలుసుకోవ‌చ్చు. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

3. ఉమంగ్‌ యాప్‌..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమంగ్‌ యాప్‌ ద్వారా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకునే వీలుంది. అందుకోసం ఉమంగ్‌ యాప్‌లో 'ఈపీఎఫ్‌ఓ' ను ఎంచుకోవాలి. అందులో ‘ఎంప్లాయీ సెంట్రిక్‌ సర్వీసెస్‌’ విభాగంలోకి వెళ్లి ‘వ్యూ పాస్‌బుక్‌’ను క్లిక్‌ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్‌ నంబర్‌తో పాటు మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కనిపించే మెంబర్‌ ఐడీని క్లిక్‌ చేయడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను పొందొచ్చు. అయితే, మీ పీఎఫ్‌ ఖాతాతో మొబైల్‌ నంబర్‌ ముందే జత చేసి ఉండాలి.

4. మిస్డ్ కాల్ స‌ర్వీస్‌..

ఈపీఎఫ్‌ఓతో రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్‌కాల్‌ ఇచ్చిన తర్వాత రెండు సార్లు రింగ్‌ అయిన‌ వెంటనే కాల్‌ కట్‌ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్‌ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్‌కి వ‌స్తాయి. ఈ స‌ర్వీసుల‌ను పూర్తి ఉచితంగా పొంద‌వ‌చ్చు. స్మార్ట్ వినియోగ‌దారులే కాకుండా సాధార‌ణ మొబైల్ వినియోగ‌దారులు బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌చ్చు.

5. ఎస్ఎంఎస్ ద్వారా..

యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకున్న చందాదారులు ఈపీఎఫ్‌ ఖాతాకు జత చేసిన మొబైల్‌ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 77382 99899 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. ప్రస్తుతం ఈ సదుపాయం పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని ఎస్ఎంఎస్ పంపించాలి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని