ఇలా ఇద్దాం అప్పులకు ముగింపు!
కొన్నింటిని తీసుకోవడం కష్టం… మరికొన్నింటిని వదిలించుకోవడం కష్టం. అయితే, ప్రతి అవసరానికీ మేమున్నాం అంటూ అప్పులిచ్చేందుకు ముందుకు వస్తాయి బ్యాంకులు. రుణం తీసుకోవడమే కాదు… దాన్ని సరిగా చెల్లించడమూ ముఖ్యమే. భవిష్యత్తులో ఏ ఇబ్బందీ రాకుండా ఆయా
కొన్నింటిని తీసుకోవడం కష్టం… మరికొన్నింటిని వదిలించుకోవడం కష్టం. అయితే, ప్రతి అవసరానికీ మేమున్నాం అంటూ అప్పులిచ్చేందుకు ముందుకు వస్తాయి బ్యాంకులు. రుణం తీసుకోవడమే కాదు… దాన్ని సరిగా చెల్లించడమూ ముఖ్యమే. భవిష్యత్తులో ఏ ఇబ్బందీ రాకుండా ఆయా రుణ ఖాతాలను ముగించుకోవడమూ అవసరమే. ‘చలన వడ్డీ రేట్లపై తీసుకున్న రుణాలను ముందుగానే చెల్లిస్తే… ఎలాంటి ముందస్తు చెల్లింపు రుసుములూ ఉండవు.’ చాలామంది రుణ చెల్లింపుదార్లకు వూరటనిచ్చే విషయమే ఇది. ఇంతకుముందే గృహరుణాలకు ఈ నిబంధన విధించింది ఆర్బీఐ. తాజాగా వ్యక్తిగత, వాహన, ఇతర రుణాలకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ముందస్తు చెల్లించినా, పూర్తిగా వ్యవధి తీరేంతవరకూ వాయిదాలు కట్టినా ఒక రుణ ఖాతాను ముగించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు రుణం తీసుకొని, దాన్ని సరిగా కట్టకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. బ్యాంకులు మహా అయితే, కొంత అపరాధ రుసుము విధించేవి. కానీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఒక్క వాయిదా సరిగా కట్టకపోయినా రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు దెబ్బతింటున్నాయి. భవిష్యత్తులో అప్పు దొరకడమే కష్టంగా మారిపోతుంది. కాబట్టి, రుణం తీసుకోవడమే కాదు… దాన్ని తీర్చిన తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలూ కొన్ని ఉన్నాయి.
సాధారణంగా ఒక అప్పును మూడు విధాలుగా తీర్చేందుకు అవకాశం ఉంటుంది. వ్యవధి ముగిసే వరకు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించి రుణ ఖాతాని రద్దు చేసుకోవచ్చు. చేతిలో సొమ్ము ఉన్నప్పుడు చెల్లింపులు జరిపి వ్యవధి కంటే ముందే ఖాతాను ముగించవచ్చు. మరేదైనా బ్యాంకు తక్కువ వడ్డీకి రుణం అందించడానికి ముందుకు వస్తే పాత రుణ ఖాతాని రద్దు చేసుకోవచ్చు.
గృహరుణం తీరుస్తుంటే…
గృహరుణాన్ని మంజూరు చేసేందుకు బ్యాంకు మీ ఆస్తి తాలూకు అన్ని పత్రాలను తాకట్టు పెట్టుకుంటుంది. రుణం చెల్లించడం పూర్తి కాగానే ఆ పత్రాలన్నింటినీ తిరిగి మనకు ఇచ్చేయాలి. ఆ ఆస్తిని తనఖా నుంచి విడుదల చేస్తున్నట్లు లేఖ ఇవ్వాలి. నిరభ్యంతర పత్రాన్ని, నో డ్యూస్ సర్టిఫికేట్ను జారీ చేయాలి. ఇవన్నీ ముగిస్తే తప్ప మీ రుణ ఖాతా రద్దయినట్లుగా భావించలేం.
పది పదిహేనేళ్ల క్రితం రుణం తీసుకున్న వారు చాలామంది ఇప్పటికే తమ రుణ వ్యవధి చివరి దశకు చేరుకొని ఉంటారు. ఇలాంటి వారు చివరి వాయిదా చెల్లించడానికి ఒక నెల ముందే మీరు అన్ని వివరాలు బ్యాంకు నుంచి సేకరించండి. రుణ ఖాతా వివరాలను తీసుకోండి. చివరి రుణ వాయిదా గురించి బ్యాంకు వినియోగదారుల కేంద్రానికి ఫోన్ చేసి వాకబు చేయండి.
కొన్నిసార్లు ఇంకా మీరు బాకీ ఉన్నట్లు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తాయి బ్యాంకులు. మధ్యలో ఒక వాయిదా కట్టలేదంటూ… దానికి వడ్డీలు వేస్తూ మరో రెండుమూడు నెలల వాయిదాలు చెల్లించాల్సిందిగా చెబుతాయి. ఇది చివరి నిమిషం వరకూ మనకు తెలియకపోవచ్చు. చిట్ట చివరి వాయిదా చెల్లించిన వెంటనే ఆ విషయాన్ని బ్యాంకుతో ధ్రువీకరించుకోండి. ఆ తర్వాత పైన చెప్పినట్లుగా అన్ని పత్రాలు, సర్టిఫికెట్లు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోండి.
వాహన రుణం విషయంలో…
వాహన రుణ చివరి వాయిదా జమ అయిన రెండు మూడు వారాల్లోగా బ్యాంకు మీకు కొన్ని పత్రాలు పంపిస్తుంది. మీ పేరు మీద బ్యాంకుకు ఎలాంటి బాకీ లేదని నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తుంది. దీన్ని ఆర్టీఏ, బీమా కంపెనీలకు అందజేయాలి. వాహన రిజిస్ట్రేషన్లో ఉన్న రుణదాత (హైపొథికేషన్) పేరు తొలగించి మీ పేరు మీదకు మార్పించుకునేందుకు ఆర్టీఏ కార్యాలయంలో సంప్రదించాలి. చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. వాహనాన్ని అమ్మేటప్పుడు ఆర్సీ మీద ‘హైపొథికేషన్’ అనే పదం ఉంటే సరైన ధర పలకదు. కాబట్టి, రుణ వాయిదాలు చెల్లించడం పూర్తి కాగానే సాధ్యమైనంత తొందరగా వాహనాన్ని మన పేరుమీదకు మార్పించుకోవాలి.
వ్యక్తిగత రుణం:
హామీ లేకుండానే జారీ చేసే రుణాలు కాబట్టి, చివరి వాయిదా చెల్లించగానే రుణం పూర్తిగా తీర్చేసినట్లుగా లేఖ అందజేస్తారు. కొంతమంది ఈ రుణాన్ని తీర్చకుండా, మొండిబాకీ కింద వదిలేస్తుంటారు. బ్యాంకులు ఏ రుణాన్నీ అంత తేలికగా వదిలిపెట్టవని గుర్తుంచుకోవాలి. మీ అప్పు వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్ల సహాయం తీసుకుంటాయి. వారు ఎలాగో అలా మీ దగ్గర్నుంచి అసలునైనా వసూలు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ బాకీ చెల్లించాల్సిందిగా రికవరీ ఏజెంట్లు వస్తే… వారికి చెల్లించే మొత్తాన్ని చెక్కు రూపంలో ఇవ్వండి. తగిన రశీదు తీసుకోండి. ఇక బాకీ లేదని బ్యాంకు నుంచి ధ్రువీకరణ పత్రం కోసం కోరండి.
వ్యవధి కంటే ముందే…
రుణం ఏదైనా సరే… నిర్ణీత గడువు కంటే ముందు బకాయి చెల్లించాలని నిర్ణయించుకున్నారా? ఈ విషయాన్ని ముందుగానే బ్యాంకుకు తెలియజేయండి. బ్యాంకు అధికారులకు కొంత సమయాన్ని ఇస్తే మీ పని తేలికవుతుంది. ఇంతవరకూ కట్టిన అప్పు పోనూ ఇంకెంత బాకీ పడ్డారు. ఎంత చెల్లిస్తే సరిపోతుంది అనే విషయాలు తెలుస్తాయి. ఇంతవరకూ చెల్లించిన బాకీని మినహాయించి… కట్టాల్సిన వడ్డీని తీసివేయగా ఇంకెంత మొత్తం కట్టాలో తెలుసుకోటానికి బ్యాంకు నుంచి ఓ పత్రం తీసుకోండి. ఆయా మొత్తానికి చెక్కు అందజేశాక. రశీదు తీసుకోటం మర్చిపోవద్దు. మీరందించిన చెక్కు నగదుగా మారాకే మీరు హామీగా ఉంచిన లేదా ఇతర పత్రాలు మీ చేతికొస్తాయి. దీనికోసం రెండు వారాలైనా పట్టొచ్చు. మీ చేతికొచ్చిన పత్రాల్ని సరిచూసుకోండి. పత్రాల్లో తేడాలుంటే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లండి.
రుణం తీసుకోవడమే కాదు… దానికి సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అవసరమైతే చెల్లింపులకు సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిందిగా కోరండి. గృహరుణానికి సంబంధించి ఏటా పన్ను ఆదా కోసం సర్టిఫికెట్ తీసుకుంటాం. దాన్ని జాగ్రత్తగా పరిశీలించి, అన్ని వాయిదాలూ సరిగా నమోదయ్యాయా లేదా చూసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్