Published : 27 Mar 2022 12:46 IST

Car: కారు కావాలంటే నెలలు ఆగాల్సిందే

చిప్‌ల కొరతతో కొన్ని మోడళ్లకు కనీసం 4 నెలల సమయం
గరిష్ఠంగా 19 నెలలు ఎదురుచూడాల్సిందే
యుద్ధం కొనసాగితే ధరలూ పెరగొచ్చు
ఈనాడు వాణిజ్య విభాగం

కారు కొనడమనేది మధ్యతరగతి కల. దాన్ని తీర్చుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుని ఉత్సాహంగా డీలరు వద్దకు వెళ్లినా.. ఉసూరుమనక తప్పట్లేదు. మోడల్‌ను బట్టి కనీసం 4 నెలలు, గరిష్ఠంగా 19 నెలల వరకు కొత్త కారు రాక కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఉండటమే దానికి కారణం. అంతే కాదు.. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఇలాగే కొనసాగితే ముడిపదార్థాల ధరలు పెరిగి కార్ల ధరలూ ప్రియమయ్యే అవకాశం లేకపోలేదని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని కార్లు ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థలతో వస్తున్నవే. ఇవన్నీ ఎలక్ట్రానిక్స్‌ ఆధారంగా తయారయ్యేవి. వీటి తయారీలో సెమీకండక్టర్లు లేదా చిప్‌లు అత్యంత కీలకం. వేలి గోరంత ఉండే ఈ భాగాలే ఇప్పుడు అంత పెద్ద కార్ల డెలివరీ ఆలస్యానికి కారణమవుతున్నాయి. కరోనాతో లాక్‌డౌన్‌ వల్ల ఉత్పత్తి పడిపోయింది. ఆ తర్వాత దశల వారీగా ఆంక్షలు ఎత్తివేసినా ఆ కొరత ప్రభావం కొనసాగుతూనే ఉంది. కొవిడ్‌ సమయంలోనే అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కూడా చిప్‌ల కొరతకు కారణమయ్యాయి. ముఖ్యంగా చిప్‌ తయారీదారులకు వివిధ ముడిపదార్థాలను సరఫరా చేసే హువావేను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఇవన్నీ కలిసి కార్ల తయారీని మరింత ఆలస్యం చేశాయి. 2020, 2021తో పోలిస్తే చిప్‌ల కొరత మెరుగైనప్పటికీ.. తక్కువ ఉత్పత్తి, అధిక గిరాకీ వల్ల చాలా వరకు కంపెనీలు వెనకబడ్డాయి.  

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో మొదటికి

పరిస్థితి కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో మొదటికొచ్చింది. మళ్లీ చిప్‌ల కొరత ప్రారంభమైంది. సెమీకండక్టర్ల తయారీలో ఉపయోగించే పల్లాడియం, రోడియం, ప్లాటినం వంటి లోహాలను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాల్లో రష్యా ఒకటి. నియోన్‌ గ్యాస్‌ తయారీ, ఎగుమతి దేశాల్లో ఉక్రెయిన్‌ ముఖ్యమైంది. వీటి ధరలు 30-36 వారాల గరిష్ఠాలకు చేరాయి.యుద్ధంతో సెమీకండక్టర్ల కొరతపై అదనపు భయాలు ఏర్పడుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. వాహన తయారీలో కీలకమైన అల్యూమినియం ధరలు కూడా రికార్డు గరిష్ఠ స్థాయిలకు(లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజీలో టన్నుకు 3,449 డాలర్లు) చేరాయి. దేశీయంగానూ ఈ త్రైమాసికంలో 20% పెరిగి రికార్డు గరిష్ఠాలకు చేరింది. ముడిచమురు ధరల వల్ల రవాణా వ్యయాలపైనా ప్రభావం పడుతోంది. వాహన కంపెనీలు తమ ఆదాయాల్లో 78-84% మేర ముడి పదార్థాలపైనే ఖర్చుపెడుతున్నాయి. ఈ ధరలను తట్టుకోవడం కోసం పలు దఫాల్లో కంపెనీలు కార్ల రేట్లను పెంచాయి. వచ్చే నెల నుంచి పలు కంపెనీలు మళ్లీ కార్ల ధరలను పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఇంకో 6 నెలల వరకూ ఇంతే!

సాధారణంగా ఉద్యోగం వచ్చాక తొలుత ద్విచక్ర వాహనం.. ఆ తర్వాత సొంత ఇళ్లు.. తదుపరి కొత్త కారు కొనాలని భావిస్తుంటారు. కరోనా వల్ల ఈ ధోరణి మారింది. చాలా మంది కార్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. హ్యుందాయ్‌లో క్రెటా, వెన్యూలకు ఏడాది కాలంగా గిరాకీ ఎక్కువగా ఉంది. 6 -10 నెలల వరకు కొనుగోలుదారులు వేచిచూడాల్సి వస్తోంది. క్రెటా బేస్‌ మోడల్‌కు 7-8 నెలలు వేచిచూడాల్సి వస్తోంది. వచ్చే 6 నెలల తర్వాత కానీ సరఫరా సమస్యలు తీరకపోవచ్చని అంచనా వేస్తున్నాం.  

- భీమవరపు వెంకటరెడ్డి, డైరెక్టర్‌(మార్కెటింగ్‌), కుశలవ మోటార్స్‌


ఆటోమేటిక్‌ వెర్షన్లకు ఎక్కువ సమయం

దాదాపు అన్ని కార్ల కంపెనీలకు చెందిన మోడళ్లకు వేచిచూసే సమయం పెరిగిపోయింది. వేరియంట్‌ను బట్టి, ప్రాంతాన్ని బట్టి వేచిచూసే సమయాలు మారుతుంటాయి. టాటా నెక్సాన్‌ ఏఎమ్‌టీ(ఆటోమేటిక్‌ వెర్షన్‌) కోసం కొనుగోలుదార్లు 21-23 వారాల పాటు; పంచ్‌ బేసిక్‌ కోసం అయితే 30-36 వారాలు ఎదురుచూడక తప్పట్లేదు. అప్పుడు కరోనా, ఇపుడు ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల సెమీకండక్టర్ల కొరతతో పాటు తాజాగా చైనాలో లాక్‌డౌన్‌ పెట్టడం వల్ల కార్ల తయారీపై ప్రభావం మరింత పెరగవచ్చు.  

- టాటా మోటార్స్‌కు చెందిన డీలరు

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని