‘ఎవరు తక్కువ ధరకు ఇస్తే వారి దగ్గరే కొంటాం’

ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్‌ ముడి చమురును కొనుగోలు చేస్తుందని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు........

Updated : 17 Oct 2022 14:29 IST

చమురు కొనుగోలుపై ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు

దిల్లీ: ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్‌ ముడి చమురును కొనుగోలు చేస్తుందని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. ఉత్పత్తి, సరఫరాల విషయంలో ఎలాంటి నియంత్రణలు విధించకుండా తక్కువ ధరకు చమురు విక్రయించాలన్న భారత విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా స్పందించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ‘టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా ఎకనమిక్‌’ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

అంతర్జాతీయంగా గిరాకీ పుంజుకునేంత వరకు చమురు ఉత్పత్తిని తగ్గించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముడి చమురు రేట్లు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు 14 నెలల గరిష్ఠానికి చేరాయి. దీంతో చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని భారత్‌ ఒపెక్‌ దేశాలను విజ్ఞప్తి చేసింది. ఉత్పత్తి, సరఫరాలపై  నియంత్రణలను తొలగించాలని కోరింది. 
  
►భారత విజ్ఞప్తిని ఒపెక్‌ దేశాలు తోసిపుచ్చాయి. పైగా ‘కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోండి’ అంటూ సౌదీ అరేబియా మంత్రి ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై తాజాగా ధర్మేంద్ర ప్రధాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ సమాచారం దౌత్యపరంగా ఆమోదనీయమైంది కాదని వ్యాఖ్యానించారు. ఇక ►ఒపెక్‌ చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. చమురు ధరలు పెరగడం.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో డిమాండ్‌ పడిపోయి, ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్‌ కూటమి నిర్ణయించుకున్నప్పుడు తాము అండగా నిలిచామని గుర్తుచేశారు. పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్‌ అప్పట్లో హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థితికి రావడం లేదని ప్రధాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

►ప్రపంచంలో భారత్‌ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు. ఒపెక్‌ నుంచి సరఫరా తగ్గడంతో భారత్‌ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో భారత్‌లో చమురు శుద్ధి కేంద్రాలు తమ చమురు అవసరాలకు గల్ఫ దేశాలే కాక ఇతర దేశాల వైపూ దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న సౌదీ స్థానాన్ని ఫిబ్రవరిలో అమెరికా ఆక్రమించింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ అమెరికాకు దగ్గరవుతోందన్న చర్చ జరుగుతోంది. దీనిపై ప్రధాన్‌ స్పందిస్తూ...‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్నది ఇక్కడ అంశం కాదు. భారత్‌ ప్రయోజనాల పరిరక్షణే ముఖ్యం. మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్‌. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతి చేసుకునే అవకాశం మా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ప్రైవేటు రంగ చమురు ద్గిగజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది పరిగణనలోకి తీసుకోం’’ అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని