Fuel Prices: పెరగనున్న ఇంధన ధరలు..పెట్రోలియం మంత్రి ఏం చెప్పారంటే..?

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Published : 08 Mar 2022 20:45 IST

దిల్లీ: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే భారత్‌లో ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలోనే చమురు సంస్థలు ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. 

‘అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలను బట్టే దేశీయంగా చమురు ధరలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఒక దేశంలో యుద్ధం నడుస్తోంది. చమురు సంస్థలు ఆ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అన్నీ పరిశీలించిన మీదట ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాం’ అని మంత్రి వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, కేంద్రం చివరిసారిగా నవంబర్‌లో ధరలు సవరించింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుంచి ధరల్లో మార్పులేదు. అందుకు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలే కారణమని వాదనలు వినిపించాయి. నిన్నటితో అవి ముగియగా.. మార్చి 10న ఫలితాలు రానున్నాయి. అయితే ఈ విశ్లేషణను మంత్రి తోసిపుచ్చారు. ఎన్నికల వల్ల కేంద్రం చమురు ధరల్ని నియంత్రించిందనే వాదనలు సరికాదన్నారు. 

‘దేశంలో ముడి చమురు కొరత ఉండదని మీకు హామీ ఇస్తున్నాను. 85 శాతం ముడి చమురు, 50-55 శాతం గ్యాస్ దిగుమతులపై ఆధాపడుతున్నప్పటికీ..మన ఇంధన అవసరాలు నెరవేరేలా చూస్తాం’ అని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ముడి చమురు ఒక్కో బ్యారెల్ ధర 130 డాలర్లకు చేరువైంది. నాలుగు నెలల క్రితం అది 81.5 డాలర్లుగా ఉంది. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.15 వరకు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకేసారి ఈ భారాన్ని ప్రజలపై మోపకపోవచ్చని, దశల వారీగా ఈ పెంపు ఉంటుందని భావిస్తున్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని