LIC IPO Listing: ఎల్‌ఐసీ షేర్లు అలా మొదలై.. ఇలా ముగిసి.. నష్టాలకు కారణాలివే..!

ఎల్‌ఐసీ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో బలహీనంగా నమోదుకావడంపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.....

Updated : 17 May 2022 17:16 IST

ముంబయి: నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన ఎల్‌ఐసీ షేర్లు మదుపర్ల ఆశలపై నీళ్లు చల్లాయి. అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూపై ఆశలతో పెట్టుబడి పెట్టినవారికి చివరకు భంగపాటు తప్పలేదు. ముఖ్యంగా లిస్టింగ్‌ గెయిన్స్‌ కోసం మదుపు చేసినవారికి తీవ్ర నిరాశే ఎదురైంది. లిస్టింగ్‌లోనే తడబడిన షేరు ఇంట్రాడేలో ఏ దశలోనూ ఇష్యూ ధరను అందుకోలేకపోయింది.

ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు 8.62 శాతం నష్టంతో రూ.867.20 వద్ద నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలో 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టయింది. చివరకు ఇష్యూ ధర కంటే 7.75 శాతం నష్టపోయి 875.45 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.860.10-920 మధ్య చలించింది. దీంతో సాధారణ మదుపర్లు ఒక్కో షేరుపై రూ.77 లిస్టింగ్‌ నష్టం చవిచూశారు. అయితే, రూ.60 రాయితీతో రూ.889 వద్దే షేర్లను దక్కించుకున్న పాలసీదారులు, రూ.45 డిస్కౌంట్‌తో రూ.904 వద్ద షేర్లను పొందిన ఉద్యోగులు, రిటైలర్లకు మాత్రం నష్టం కొంత తగ్గింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ ఐపీఓ ద్వారా రూ.20,557 కోట్లను సమీకరించగలిగింది.

ఇష్యూ ధర అయిన రూ.949 వద్ద ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.6 లక్షల కోట్లుగా నమోదైంది. నష్టాలతో లిస్ట్‌ కావడంతో ఆ విలువ రూ.5.57 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఈ ఐపీఓలో మదుపు చేసిన మదుపర్ల సంపదలో ఈ ఒక్కరోజే రూ.42,500 కోట్లు ఆవిరయ్యాయి. గతవారపు భారీ నష్టాల నుంచి కోలుకొని మార్కెట్లు ఈరోజు భారీగా లాభపడినప్పటికీ.. ఎల్‌ఐసీ లిస్టింగ్‌ మాత్రం నిరాశపర్చడం గమనార్హం. సబ్‌స్క్రిప్షన్‌లో దాదాపు మూడు రెట్ల స్పందన లభించింది. అయినా ట్రేడింగ్‌లో మాత్రం నష్టాలు తప్పలేదు.

ఐదో అతిపెద్ద కంపెనీగా..

ఐపీఓ లిస్టింగ్‌తో ఎల్‌ఐసీ దేశంలోనే ఐదో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఇప్పుడు ఈ కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు రూ.5.54లక్షల కోట్లు. మార్కెట్‌ విలువ పరంగా.. హెచ్‌యూఎల్‌ (రూ.5.27లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.4.94 లక్షల కోట్లు), ఎస్‌బీఐ (రూ.4.17లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ.3.97లక్షల కోట్లు) కంటే ఎల్‌ఐసీ పెద్ద కంపెనీ అని బీఎస్‌ఈ డేటా వెల్లడించింది. రూ.17.12లక్షల కోట్లతో రిలయన్స్‌ దేశంలోనే అతిపెద్ద కంపెనీగా అగ్ర స్థానంలో ఉండగా.. ఆ తర్వాత టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ ఉన్నాయి.

నష్టాలకు కారణాలివేనట..!

ఎల్‌ఐసీ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో బలహీనంగా నమోదుకావడంపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. స్టాక్‌ మార్కెట్‌లో నెలకొన్న ఊహించని పరిస్థితుల కారణంగానే షేర్లు తక్కువ ధర వద్ద లిస్టయ్యాయని ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (DIPAM)’ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు. అయితే, మంచి లాభాల కోసం షేర్లను దీర్ఘకాలం అట్టిపెట్టుకోవాలని సూచించారు.

‘‘మార్కెట్‌ పరిస్థితుల్ని ఎవరూ అంచనా వేయలేరు. ఒకరోజు కోసం కాకుండా దీర్ఘకాలం కోసం షేర్లను ఉంచుకోవాలని మేం ముందు నుంచీ చెబుతూ వస్తున్నాం. అయితే, రాయితీ ధర వద్ద షేర్లను దక్కించుకున్న పాలసీదారులు, ఉద్యోగులు, రిటైల్‌ మదుపర్లకు మాత్రం కొంత రక్షణ లభించింది’’ అని పాండే తెలిపారు. ఈరోజు తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన ఎల్‌ఐసీ షేర్లు మదుపర్లను నిరాశపర్చిన విషయం తెలిసిందే.

మరోవైపు ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఎం.ఆర్‌.కుమార్‌ మాట్లాడుతూ.. ఎల్‌ఐసీ షేర్లకు రానున్న రోజుల్లో డిమాండ్‌ పెరగనుందన్నారు. కేటాయింపులో షేర్లు దక్కనివారు సెకండరీ మార్కెట్‌లో కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారని తెలిపారు. ఫలితంగా షేరు ధర పుంజుకుంటుందని అంచనా వేశారు. దీర్ఘకాలం ఈ స్టాక్‌ మందకొడిగా ఉండడానికి ఎలాంటి కారణాలు లేవని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని