Credit Suisse Crisis: క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభానికి బీజం పడింది అక్కడే..!

What happened to Credit Suisse: ప్రపంచంలోనే టాప్‌ బ్యాంక్‌ అయిన క్రెడిట్‌ సూయిజ్‌ ఎలా పతనం అయ్యింది? ఈ స్థితి ఎందుకు ఏర్పడింది?

Updated : 20 Mar 2023 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా బ్యాంకింగ్‌ రంగంలో వరుస పతనాలను మరిచిపోక ముందే స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) అంశం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ బ్యాంక్‌.. ఇటీవల కాలంలో పతనావస్థకు చేరింది. 2008 నాటి సంక్షోభ పరిస్థితులు మరోసారి తలెత్తకూడదన్న ఉద్దేశంతో స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్విస్‌ కేంద్రంగా పనిచేసే యూబీఎస్‌ గ్రూప్‌తో  (UBS group) చర్చలు జరిపింది. దీంతో యూబీఎస్‌ గ్రూప్‌ 3.25 బిలియన్‌ డాలర్లకు క్రెడిట్‌ సూయిజ్‌ను దక్కించుకుంది. అసలు ఇంతకీ క్రెడిట్‌ సూయిజ్‌ ఎలా పతనావస్థకు చేరింది?

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ కేంద్రంగా 1856లో క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌ ఏర్పాటైంది. తొలుత రైల్‌ నెట్‌వర్క్‌కు నిధులు సమకూర్చడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ బ్యాంక్‌ కాలక్రమంలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌గా అవతరించింది. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుల్లో ఎనిమిదో స్థానానికి చేరింది. స్విట్జర్లాండ్‌లో యూబీఎస్‌ తర్వాత రెండో అతి పెద్ద బ్యాంక్‌గా నిలిచింది. దాదాపు 166 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్యాంక్‌ దాదాపు పతనావస్థకు చేరుకోవడంతో స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం అప్రమత్తమై యూబీఎస్‌తో కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది.
Also Read: క్రెడిట్‌ సూయిజ్‌ పతనానికి ‘యూబీఎస్‌’తో విరుగుడు!

నష్టాలు.. జరిమానాలు.. మేనేజ్‌మెంట్‌ మార్పులు

క్రెడిట్‌ సూయిజ్‌ పతనానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న కంపెనీలు బోర్డులు తిప్పేయడం.. బ్యాంకుకు అవినీతి మరకలు.. డిపాజిటర్లలో విశ్వాసం నింపాల్సిన టాప్‌ మేనేజ్‌మెంట్‌ కొద్ది రోజుల వ్యవధిలోనే కుర్చీ దిగిపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పాలి. వీటన్నింటికీ కొన్నేళ్ల క్రితమే బీజం పడింది.

  • అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అయిన ఆర్కిగోస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి క్రెడిట్‌ సూయిజ్‌ విరివిగా రుణాలు ఇచ్చింది. భారీగా రుణాలు తీసుకున్న ఆ కంపెనీ 2021లో కుప్పకూలింది. దీంతో క్రెడిట్‌ సూయిజ్‌కు 5.5 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. గ్రీన్‌సిల్‌ క్యాపిటల్‌ అనే సప్లయ్‌ చైన్‌ నెట్‌వర్క్‌కు సైతం క్రెడిట్‌ సూయిజ్‌ భారీగా రుణాలు ఇచ్చింది. ఆ కంపెనీ సైతం దివాలా తీయడంతో మరోసారి భారీగా నష్టం వాటిల్లింది. ఈ రెండు ఎదురు దెబ్బల కారణంగా క్రెడిట్‌ సూయిజ్‌ ఏకంగా 10 బిలియన్‌ డాలర్లు నష్టపోయింది.
  • 2004-08 మధ్యలో బల్గేరియాలోని మాదకద్రవ్యాల డీలర్లకు మనీలాండరింగ్‌లో సాయం చేసినట్లు ఈ బ్యాంక్‌పై క్రిమినల్‌ ఆరోపణలు 2022 జూన్‌లో న్యాయస్థానంలో నిర్ధారణ అయ్యాయి. దీంతో న్యాయస్థానం 2.1 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. మొజాంబిక్‌లో అవినీతి ఆరోపణలు, మాజీ ఉద్యోగులపై గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్‌లలో కేసుల వల్ల భారీగా పరిహారాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
  • బ్యాంక్‌ను గాడిన పెట్టాల్సిన టాప్‌ మేనేజ్‌మెంట్ ఎప్పటికప్పుడు మారడం కూడా బ్యాంక్‌కు గట్టి దెబ్బగా మారింది. 2020లో బ్యాంక్‌ సీఈఓ తిడ్‌జానే థైమ్‌ గూఢచర్యం ఆరోపణలతో వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సీఈవో అంటానియో హోర్టా ఒసారియో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పదవిని వీడారు. 8 నెలలే ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత సీఈఓగా ఉల్‌రిచ్‌ కోర్నర్‌ను నియమించినప్పటికీ ఈ చర్యలేవీ డిపాజిటర్లలో విశ్వాసాన్ని నింపలేకపోయాయి.

డిపాజిట్లకు రెక్కలు..

క్రెడిట్‌ సూయిజ్‌లో చోటుచేసుకున్న వరుస పరిణామాలు బ్యాంకింగ్‌ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు పెంచాయి. డిపాజిటర్లలో విశ్వాసం నింపాల్సిన టాప్‌ మేనేజ్‌మెంట్‌ నెలల వ్యవధిలో మారడం వంటి కారణాలతో డిపాజిటర్లు తమ నిల్వలను వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టారు. ఒక్క 2022లోనే 7.8 బిలియన్‌ ఫ్రాంక్ల నష్టాన్ని చవిచూసింది. దీనికి తోడు క్రెడిట్‌ సూయిజ్‌లో పెద్ద వాటాదారైనా సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ తాము మరిన్ని నిధులను ఇవ్వలేమని తేల్చిచెప్పడం భయాలను మరింత పెంచింది. దీంతో ఒక్కరోజే క్రెడిట్‌ సూయిజ్‌ షేర్లు 67 శాతం పతనం అయ్యి మరోసారి బ్యాంకింగ్‌ సంక్షోభానికి ఆజ్యం పోశాయి. దీంతో స్విస్‌ ప్రభుత్వం రంగంలోకి దిగింది. 
Also Read: నివురుగప్పిన ముప్పు..మరో పెను సంక్షోభాన్ని పొదుగుతున్న అమెరికా..!

యూబీఎస్‌ ఎందుకు?

స్విట్జర్లాండ్‌ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూబీఎస్‌ గ్రూప్‌  దేశంలోనే అన్నికంటే పెద్ద బ్యాంక్‌. క్రెడిట్‌ సూయిజ్‌ తరహాలోనే వివిధ దేశాల్లో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లోనూ ఈ బ్యాంక్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ క్రెడిట్‌ సూయిజ్‌ దివాలా తీస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అదే జరిగితే యూబీఎస్‌పైనా ఆ ప్రభావం ఉంటుంది. మరోవైపు క్రెడిట్‌ సూయిజ్‌ షేర్లు పతనం మొదలవ్వగానే స్విస్‌ అధికారులు బుధవారం చర్యలు ప్రారంభించారు. ఆసియా మార్కెట్లు ప్రారంభం కాకముందే (సోమవారం) మార్కెట్లపై ఈ ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో యూబీఎస్‌తో కొనుగోలు చర్చలు ఓ కొలిక్కి తెచ్చి నిర్ణయాన్ని వెలువరించారు. 

9000 ఉద్యోగాలకు ముప్పు

స్విస్‌ గ్రూప్‌ కొనుగోలు ఒప్పందం వల్ల 9 వేల మంది క్రెడిట్‌ సూయిజ్‌ ఉద్యోగులపై ప్రభావం పడనుంది. కొనుగోలు అనంతరం బ్యాంక్‌ను కాపాడడం కోసం దాదాపు 9వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని  యూబీఎస్‌ నిర్ణయించింది. రెండు బ్యాంకులకు కలిపి ప్రస్తుతం లక్షా 25 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. క్రెడిట్‌ సూయిజ్‌ను లాభదాయకతలోకి తీసుకురావాలంటే ఉద్యోగుల కోత తప్పదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు బ్యాంకింగ్‌ రంగంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు రేట్ల పెంపు విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని