Anand Mahindra: అక్కడెక్కడో ఉక్రెయిన్‌లో పోరు జరుగుతుంటే.. మన పరిస్థితి ఇలా ఉంది..!

ఎక్కడా వెనక్కి తగ్గే యోచన లేకుండా.. ఉక్రెయిన్‌-రష్యా సైనిక పోరు కొనసాగుతోంది. రష్యా దాడుల్ని తీవ్రం చేస్తోంది.

Published : 07 Mar 2022 14:59 IST

21వ శతాబ్దపు ప్రపంచ యుద్ధానికి స్వాగతం: మహీంద్రా

ముంబయి: ఎక్కడా వెనక్కి తగ్గే యోచన లేకుండా.. ఉక్రెయిన్‌-రష్యా సైనిక పోరు కొనసాగుతోంది. రష్యా దాడుల్ని తీవ్రం చేస్తోంది. ఇది మదుపర్లను కలవరపెడుతోంది. దాంతో భారత్‌ సహా అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ పరిణామాలను ఉద్దేశించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా స్పందించారు. ఒక దేశంలో యుద్ధం జరుగుతుంటే.. ప్రపంచ దేశాల్లో దాని ప్రభావం కనిపిస్తోందన్నారు. చమురు ధరలు పెరగడం, స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలడాన్ని ఉద్దేశించి, ఈ సైనిక పోరును 21వ శతాబ్దపు ప్రపంచయుద్ధంగా అభివర్ణించారు. 

‘ప్రస్తుత యుద్ధ సమయంలో ఈ పరిణామాలేవీ ఆశ్చర్యపర్చడం లేదు. భౌతికంగా యుద్ధం ఒక దేశంలో ఉండొచ్చు. కానీ రాజకీయ, ఆర్థిక, సైబర్, సోషల్‌ మీడియా, కమోడిటీ రిసోర్సెస్‌కు సంబంధించిన యుద్ధం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంది. 21వ శతాబ్దపు ప్రపంచయుద్ధానికి స్వాగతం’ అంటూ మహీంద్రా వ్యాఖ్యానించారు.

ఈ ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఈ రోజు మన స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమై, అదే తీరును కొనసాగిస్తున్నాయి. చమురు బ్యారెల్ ధర 130 డాలర్లకు చేరుకుంది. రష్యాపై ఇప్పటికే ఉన్న ఆంక్షలు గాక, ఆ దేశ చమురు ఎగుమతులపైనా ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలు యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచ అవసరాల్లో 10 శాతం వాటా కలిగి ఉన్న రష్యా నుంచి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది తీవ్ర కొరతకు దారి తీసే అవకాశం ఉంది. దీంతో దేశీయంగానూ చమురు ధరలు పెరగనున్నాయి. ఇవన్నీ కలిసి ద్రవ్యోల్బణ భయాల్నిపెంచుతున్నాయి. మన రూపాయి జీవితకాల కనిష్టానికి పడిపోయింది. అక్కడెక్కడో ఉన్న ఉక్రెయిన్‌లో జరుగుతోన్న సైనిక చర్య ఈ పరిస్థితులకు ఆజ్యం పోస్తోంది. వీటిని ఉద్దేశించే మహీంద్రా ట్వీట్ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని