5G auction: 5Gపై అపోహలు.. అనుమానాలు.. వీటిలో వాస్తవమెంత?

Fears on 5G: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో 5జీ నెట్‌వర్క్‌లు వాణిజ్య ప్రాతిపదికపై ప్రారంభమయ్యాయి. భారత్‌లోనూ..

Updated : 17 Sep 2022 14:19 IST

5G roll out: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో 5జీ నెట్‌వర్క్‌లు (5G) వాణిజ్య ప్రాతిపదికపై ప్రారంభమయ్యాయి. భారత్‌లోనూ రిలయన్స్‌, జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా 5జీ ప్రయోగాలను ప్రారంభించాయి. వాణిజ్యపరంగానూ ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నెల 26న 5జీ స్పెక్ట్రమ్‌ వేలం (5G auction) నిర్వహించబోతోంది. అయితే, 5జీ సాంకేతికతకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా దీనివల్ల వెలువడే రేడియో ధార్మికత మానవులు, పశుపక్ష్యాదుల ఆరోగ్యానికి హానికరమన్నది ప్రధానమైన సందేహం. అయితే, ఈ భావన ఇంతవరకూ శాస్త్రీయంగా రుజువు కాకపోవడం గమనార్హం. ఇలాంటి భయాలకుతోడు అనేక విడ్డూరపు వార్తలూ ప్రజల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చదవండి: 2G, 3G, 4G, 5G.. ఏమిటివి? స్పెక్ట్రమ్‌కి వేలం ఎందుకు?

  • ప్రముఖ సినీ నటి, పర్యావరణ ఉద్యమకారిణి జూహీ చావ్లా భారత్‌లో 5జీ సాంకేతికతపై ఆందోళనపై వ్యక్తం చేస్తూ ఆ మధ్య దిల్లీ హైకోర్టులో దావా వేశారు. అసలు 5జీ వల్ల వెలువడే రేడియేషన్‌ ప్రమాదకరమా? కాదా? అన్నది తేల్చే పరిశోధనకు ఆదేశించాలని కోరారు. కోర్టు ఆమె వ్యాజ్యాన్ని కొట్టిపారేసినప్పటికీ.. ఇంకా కొన్ని వర్గాల్లో ఆమె వెలిబుచ్చిన సందేహాలు మాత్రం తొలగిపోలేదు.
  • 4జీ, 3జీలకన్నా ఎంతో వేగంగా, సమర్థంగా సందేశాలు, సమాచారాలను పంపడానికి 5జీలో అధిక శక్తిమంతమైన విద్యుదయస్కాంత క్షేత్ర తరంగాలను (EMF- Electromagnetic field) వాడతారు. డ్రైవర్‌లేని కార్లు, వర్చువల్‌ రియాలిటీ సాధనాలు, సీసీటీవీలకు 5జీ పరిజ్ఞానం ఎంతో కీలకమైంది. దీనికోసం గతంలోకన్నా ఎంతో ఎక్కువగా 5జీ సెల్‌ టవర్లను, భూతల ట్రాన్స్‌మిటర్లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. నగరాలు పట్టణాలు వీటితో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: అసలు 2G స్పెక్ట్రమ్‌ రగడ ఏంటి? ఆరోజు కాగ్‌ ఏం చెప్పింది?

  • అవన్నీ కలిసి వెలువరించే రేడియేషన్‌ ఆరోగ్యానికి హానికరమని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇందులో నిజమెంతో నిగ్గుతేల్చడానికి గతంలో పరిశోధనలు ప్రధానంగా ఎలుకలపై జరిగాయే తప్ప మనుషులపై కాదని గుర్తించాలి. 5జీతో సహా అన్ని మొబైల్‌ నెట్‌వర్కుల ద్వారా వెలువడే రేడియేషన్‌.. సూర్యకాంతితో ఏర్పడే రేడియేషన్‌ కన్నా తక్కువ శక్తిమంతమైనది. ఈ నెట్‌వర్కులతో పోలిస్తే ఎక్స్‌రే యంత్రాలు, స్కానర్లు ఎక్కువ శక్తిమంతమైన రేడియేషన్‌ను వెలువరిస్తాయి. 
  • నిజానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు, కంప్యూటర్లు, విద్యుత్‌ సరఫరా లైన్ల్లతోపాటు కరెంటును ఉపయోగించే ఏ పరికరమైనా సరే విద్యుదయస్కాంత క్షేత్ర తరంగాలను (ఈఎంఎఫ్‌) వెలువరిస్తుంది. 5జీ టవర్లకన్నా ఇలాంటి పరికరాల సంఖ్యే ఎల్లప్పుడూ ఎంతో అధికంగా ఉంటుంది. 5జీ నెట్‌వర్కులు వాడే నిర్దిష్ట విద్యుదయస్కాంత క్షేత్ర తరంగాల కన్నా మొత్తం విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావం మీదే ఎక్కువ పరిశోధనలు జరిగాయి. ఈఎంఎఫ్‌ వల్ల మానవ కణజాలం కాస్త వేడెక్కుతుందని, వయసు మీరిన వారిలో ఇది కొంత ఎక్కువగా సంభవిస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. అయితే, ఇది తాత్కాలిక పరిణామం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ప్రతిరోజూ ఎంతో కొంత ఈఎంఎఫ్‌ ప్రభావానికి లోనవుతూనే ఉంటారని వివరించారు.
  • మొబైల్‌ ఫోన్ల వాడకం వల్ల గ్రహణ శక్తిపై పడే ప్రభావాన్ని పలు అధ్యయనాలలో పరిశీలించారు. ఈఎంఎఫ్‌లకూ గ్రహణ శక్తికీ మధ్య ఎలాంటి సంబంధమూ లేదని వీటిలో తేలింది. అయితే, శరీరానికి, మొబైల్‌ సాధనాలకు మధ్య కొంతదూరం పాటించడం మంచిదని మాత్రం సూచించాయి. 5జీ వల్ల మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏ పరిశోధనలోనూ తిరుగులేకుండా నిర్ధారణ కాలేదు. 

ఇదీ చదవండి: 5జీ దేశవ్యాప్తంగా ఎప్పుడు..?రేట్లు ఎంత ఉండబోతున్నాయ్‌?

  • ఈఎంఎఫ్‌ ప్రభావం మీద మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అమెరికా జాతీయ టాక్సికాలజీ పరిశోధన కార్యక్రమం కింద రెండేళ్లపాటు ఎలుకల మీద రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ ప్రభావాన్ని పరిశీలించారు. చివరకు మగ ఎలుకల్లో క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించినా, ఆడ ఎలుకల్లో అది కనిపించలేదు. ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే, జంతువులపై ప్రయోగాల్లో ఉపయోగించే రేడియేషన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువసేపు సెల్‌ఫోన్లు ఉపయోగించే మనుషులు కూడా అంతటి రేడియేషన్‌కు గురయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ప్రయోగశాల ఫలితాలను యథాతథంగా మనుషులకు వర్తింపజేయలేమని నిపుణులు చెబుతున్నారు. 
  • మొబైల్‌, డిజిటల్‌ నెట్‌వర్కుల వల్ల దీర్ఘకాలంలో పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి విస్తృత అధ్యయనాలు జరుగుతున్నాయి. వీటిలో ప్రముఖమైనది- కాస్మోస్‌. 2007 సంవత్సరం నుంచి ఆరు ఐరోపా దేశాల్లో జరుగుతున్న ఈ అధ్యయనంలో 2,90,000 మంది పాల్గొంటున్నారు. 20 నుంచి 30 ఏళ్లపాటు సెల్‌ఫోన్ల వాడకం వల్ల మానవ ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా  కాస్మోస్‌ సాగుతోంది. ఈ దీర్ఘకాల ప్రయోగం కచ్చితమైన ఫలితాలను అందిస్తుందని ఆశించవచ్చు.
  • అంతర్జాతీయ క్యాన్సర్‌ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌సీ) 2011లో వెలువరించిన ఒక నివేదిక 5జీ సాంకేతికత పట్ల భయానికి బీజం వేసింది. మొబైల్‌ ఫోన్లు వాడే విద్యుదయస్కాంత క్షేత్ర తరంగాలు (ఈఎంఎఫ్‌) మానవుల్లో ‘బహుశా’ క్యాన్సర్‌ కారకం కావచ్చునని ఆ నివేదిక అభిప్రాయపడింది. దాన్ని 14 దేశాలకు చెందిన 30 మంది శాస్త్రజ్ఞులు సమర్పించారు. 2017లో వెలువడిన మరో పరిశోధనా నివేదిక ఈఎంఎఫ్‌ వల్ల మెదడు క్యాన్సర్‌ రావచ్చునంటే, 2018లో వచ్చిన మరొక నివేదిక అలాంటిదేమీ నిర్ధారణ కాలేదని పేర్కొన్నది.
  • ఇవన్నీ ఒక ఎత్తైతే.. 5జీ సాంకేతికత అమలులో ఉపయోగించే పరికరాలపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పెద్ద ఎత్తున 5జీ నెట్‌వర్క్‌ పరికరాలను అందజేస్తున్న కంపెనీలు ఐదు మాత్రమే ఉన్నాయి. వాటిలో హువావే, జెడ్‌టీఈ.. చైనాకు చెందినవి. ఇప్పటికే వీటి నుంచి పరికరాల కొనుగోలుపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. వీటి వల్ల భవిష్యత్తుల్లో గూఢచర్యం జరిగే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశాయి. కీలక సమాచారం చైనా చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తపరిచాయి. ఈ క్రమంలో అత్యాధునిక 5జీ సాంకేతికత కోసం విదేశీ కంపెనీలపై ఆధారపడడంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన సమాచారాన్ని పరాయిదేశాలు తస్కరించే అవకాశం ఉందన్నది ప్రధాన సందేహం.
  • మరోవైపు 5జీ సాంకేతికత తీసుకురాబోయే మార్పులూ ఓ వర్గాన్ని ఆందోళపరుస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న అనేక ఉద్యోగాల నిర్వహణ, సేవల అందజేత అత్యాధునికంగా మారిపోయే అవకాశం ఉంది. దీనికి ఎంతో నైపుణ్యం అవసరమవుతుంది. అది అందిపుచ్చుకోలేని వారంతా ఉద్యోగాలు కోల్పోయి నిరాశ్రయులవుతారన్నది ప్రధానమైన వాదన. కానీ, ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యలూ ఉండవు. ఉత్తరాల నుంచి మెసేజింగ్‌ యాప్‌ల వరకు వచ్చినట్లుగానే ఇది కూడా ప్రజలను కొత్త జీవనశైలికి అలవాటుపడేలా సంసిద్ధుల్ని చేస్తుంది. వాటిని అందిపుచ్చుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని