మ‌దుప‌ర్ల ఆస‌క్తిని తెలిపే పీఈ నిష్ప‌త్తి

మ‌దుప‌ర్లు షేర్ల‌ను ఎంపిక చేసుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే కొన్ని ముఖ్య‌మైన నిష్ప‌త్తుల్లో పీఈ నిష్ప‌త్తిని ఒక‌టిగా చెప్ప‌వ‌చ్చు. ఏదైనా కంపెనీ ద్వారా ఒక రూపాయి రాబ‌డిని ఆర్జించేందుకు మ‌దుప‌రి ఎంత పెట్టుబ‌డి చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌నే విష‌యం తెలుసుకోవాలంటే అవ‌స‌రమయ్యే... 

Updated : 10 Jan 2022 15:18 IST

మ‌దుప‌ర్లు షేర్ల‌ను ఎంపిక చేసుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే కొన్ని ముఖ్య‌మైన నిష్ప‌త్తుల్లో పీఈ నిష్ప‌త్తిని ఒక‌టిగా చెప్ప‌వ‌చ్చు. ఏదైనా కంపెనీ ద్వారా ఒక రూపాయి రాబ‌డిని ఆర్జించేందుకు మ‌దుప‌రి ఎంత పెట్టుబ‌డి చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌నే విష‌యం తెలుసుకోవాలంటే అవ‌స‌రమయ్యే ది పీఈ నిష్ప‌త్తి (Price to earnings ratio) - ఉదాహ‌ర‌ణ‌కు కంపెనీ ‘x’ పీఈ విలువ 26 అనుకుంటే ఆ సంస్థ‌లో మ‌దుప‌రి ఒక రూపాయి ఆదాయం కోసం రూ.26 మ‌దుపుచేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు అర్థం. కంపెనీ ‘Y’ పీఈ విలువ 36 అనుకుంటే ఆ సంస్థ‌లో మ‌దుప‌రి ఒక రూపాయి ఆదాయం కోసం రూ.36 మ‌దుపు చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు అర్థం.

పీఈ నిష్ప‌త్తి ఎక్కువుంటే మంచిదా త‌క్కువుంటే మంచిదా? ఉదాహ‌ర‌ణ‌: ఒక కంపెనీ పీఈ 30 ,వేరొక కంపెనీ పీఈ 90 ఇందులో ఏ కంపెనీ షేర్లు ఆక‌ర్ష‌ణీయం? కంపెనీ ‘A’ పీఈ విలువ 30 అంటే ఆ కంపెనీలో ప్ర‌తీ రూపాయి ఆదాయం వ‌చ్చేందుకు రూ. 30 పెట్టుబ‌డి చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుపుతుంది. కంపెనీ ‘B’ పీఈ విలువ 90 అంటే ఆ కంపెనీలో ప్ర‌తీ రూపాయి ఆదాయం వ‌చ్చేందుకు రూ. 90 పెట్టుబ‌డి చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుపుతుంది. ఈ రెండింటిలో కంపెనీ 'A’ఆక‌ర్ష‌ణీయం. ఎందుకంటే రూ.30 పెట్టుబ‌డికి రూ.1 ఆదాయం ల‌భిస్తుంది. కంపెనీ 'B’లో రూ.90 చేస్తే రూ.1 వ‌స్తోంది. అంటే కంపెనీ ‘B’ లో చేసే రూ.90 ని కంపెనీ ‘A’ లో పెట్టుబ‌డి చేస్తే మ‌దుప‌రికి రూ.3 ఆదాయం ల‌భిస్తుంది. పీఈ నిష్ప‌త్తి ద్వారా ఒక కంపెనీ మ‌రో కంపెనీతో ఎలా పోల్చి చూస్తారో చూద్దాం. పీఈ నిష్ప‌త్తిని పోల్చిచూసేట‌పుడు ఒకే రంగానికి చెందిన కంపెనీలను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. వేర్వేరు రంగాల్లో వ్యాపారం చేస్తున్న కంపెనీల‌ను పోల్చ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం ఉండ‌దని చెప్ప‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు టెలికం రంగానికి చెందిన కంపెనీల‌ను పోల్చి చూడాలి అంటే భార‌తీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యూల‌ర్ కంపెనీల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవచ్చు. అదే ఒక ఐటీ రంగానికి చెందిన కంపెనీని మ‌రొక‌టి చ‌మురు రంగానికి చెందిన కంపెనీని పోల్చి చూడ‌టం ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ప‌రిశ్ర‌మ (ఇండ‌స్ట్రీ) పీఈ నిష్ప‌త్తితో కంపెనీ పీఈ నిష్ప‌త్తిని పోల్చి చూడ‌టం ద్వారా కంపెనీ షేరు మార్కెట్ విలువ‌ను విశ్లేష‌ణ చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు టెక్నాల‌జీ ఇండ‌స్ట్రీ పీఈ విలువ15 అనుకుందాం. అదే రంగానికి చెందిన కంపెనీ ‘G’ పీఈ నిష్ప‌త్తి 10 అనుకుందాం. అప్పుడు ప‌రిశ్ర‌మ పీఈ తో చూసుకుంటే ఆ కంపెనీ పీఈ విలువ బావున్న‌ట్లు అర్థం. అదే కంపెనీ పీఈ 20 ఉంద‌నుకుందాం. అప్పుడు ఆ కంపెనీ పీఈ కంటే ప‌రిశ్ర‌మ పీఈ బావున్న‌ట్లు అర్థం.

పీఈ నిష్ప‌త్తి గురించి దానిని వేరొక‌ కంపెనీతో పోల్చి చూడ‌టం త‌దిత‌ర వివ‌రాలు తెలుసుకున్నాం క‌దా. మ‌రి పీఈ నిష్ప‌త్తిని ఎలా లెక్కించాలి అనే విష‌యం తెలుసుకుందాం.

పీఈ నిష్ప‌త్తి తెలుకోవ‌డం ఇలా:

కంపెనీ ‘z’ లో ఒక షేరు ధ‌ర రూ. 90 అనుకుందాం.

ఆ ఏడాది ఆ కంపెనీ ఆర్జించిన లాభం రూ. 60 కోట్లు

మొత్తం షేర్ల సంఖ్య‌ = 10కోట్లు

ఈపీఎస్(Earnings per share) = 60/10= రూ.6

పీఈ నిష్ప‌త్తి = రూ. 90 / 6

పీఈ నిష్ప‌త్తి = 15

పై ఉదాహ‌ర‌ణ‌లో మ‌దుప‌ర్లు ఒక రూపాయి ఆర్జించేందుకు ‘z’ అనే కంపెనీలో రూ.15 పెట్టుబ‌డి చేసేందుకు సుముఖంగా ఉన్నార‌ని పీఈ నిష్ప‌త్తి తెలుపుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని