Elon Musk: భారతీయ వంటకాలపై ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారంటే?

Elon Musk: భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా చేరారు. భారత వంటలపై ట్విటర్‌లో తన ఫాలోవర్‌ చేసిన ఓ పోస్ట్‌పై ఆయన స్పందించారు.

Updated : 16 May 2023 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. లండన్‌లో ఉన్న ఓ భారత రెస్టరెంట్‌ తనకు ఇష్టమైన వాటిలో ఒకటని కింగ్‌ ఛార్లెస్‌ III ఓ సందర్భంలో తెలిపారు. అలాగే ప్రఖ్యాత గాయని లేడీ గాగా సైతం భారత రుచులంటే తనకు చాలా ఇష్టమని ఓసారి తన మనసులో మాటను బయటపెట్టారు. తాజాగా ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  (Elon Musk) కూడా చేరారు.

ట్విటర్‌లో మస్క్‌ ఫాలోవర్‌ ఒకరు భారతీయ వంటలను ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేశారు. తనకు భారత వంటకాలంటే చాలా ఇష్టమని.. అవి చాలా బాగుంటాయంటూ మన రుచులపై మనసు పారేసుకున్నాడు. దీనికి స్పందించిన మస్క్‌ (Elon Musk) మీరు చెప్పేది ‘‘వాస్తవం’’ అని అన్నారు. సదరు యూజర్‌ తన పోస్ట్‌కు బటర్‌ చికెన్‌, నాన్‌, అన్నం ఉన్న ఫొటోను జత చేశారు.

ఈ పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్‌ (Elon Musk) చేసిన ట్వీట్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. నాలుగున్నర గంటల్లో 20 లక్షల మందికి పైగా వీక్షించారు. చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్‌ బాక్స్‌ను నింపేస్తున్నారు. మస్క్‌కు మంచి టేస్ట్‌ ఉందంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు భారత్‌కు వచ్చి ఇక్కడి వంటకాలను రుచి చూడాలని చాలా మంది ఆహ్వానించారు. త్వరలోనే భారత పర్యటనకు ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు.

భారత్‌ విభిన్న వంటకాలకు నెలవైన విషయం తెలిసిందే. ఇటీవలే భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన ఎరిక్‌ గార్సెట్టీ సైతం మహారాష్ట్ర సంప్రదాయ వంటకాలను రుచి చూశారు. కోకుమ్‌ కా షెర్బత్‌, వడా పావ్‌, సాగో, భార్లీ వంగీ, సోజీ మటన్‌ వంటి వాటిని టేస్ట్‌ చేసి ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని