Budget 2023: బడ్జెట్‌ ప్రసంగంలో బ్యాంకులపై కీలక ప్రకటనల్లేవ్‌..!

గత కొన్నేళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఉత్సాహంగా ఉరకలు వేసిన ప్రభుత్వం.. ఈ సారి బడ్జెట్‌లో మాత్రం దాని జోలికి వెళ్లలేదు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొందనే ప్రచారం జరుగుతోంది.  

Published : 01 Feb 2023 19:47 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఈ సారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ (union budget 2023)లో కొన్ని కీలక రంగాలపై పెద్ద ప్రకటనలేవీ లేవు. ముఖ్యంగా బ్యాకింగ్‌ ప్రస్తావనను ఆమె తీసుకురాలేదు. గతేడాది బడ్జెట్‌ ప్రసంగంలో ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, క్రిప్టో నిబంధనలపై ప్రధానంగా చర్చ జరిగింది. వీటికి సంబంధించిన కీలక ప్రకటనలు కూడా వెలవడ్డాయి. ఆశ్చర్యకరంగా ఈ సారి బడ్జెట్‌ (union budget 2023)లో వీటి ఊసే లేదు.

2021-222 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ‘‘ఐడీబీఐ బ్యాంక్‌ కాకుండా మరో రెండు ప్రభుత్వ బ్యాంకులను, ఒక జనరల్‌ ఇన్సురెన్స్‌ కంపెనీని ప్రైవేటీకరిస్తాం. దీనికి అవసరమైన చట్ట సవరణలను ఈ సెషన్‌లోనే ప్రవేశపెడతాం’’ అని పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత కీలక సవరణలను పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. అంతేకాదు.. బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం మాత్రం కొనసాగించింది. ఇప్పటికీ ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ అసంపూర్తిగానే ఉంది. ముఖ్యంగా బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రైవేటీకరణతో ఉద్యోగాల్లో కోతపడుతందనే ఆందోళనతో ఉద్యోగ సంఘాలు జాతీయ స్థాయిలో సమ్మెకు సిద్ధమయ్యాయి కూడా. అసలే 2024 ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వం రాజకీయంగా తేనెతుట్టె వంటి ఈ అంశాన్ని కదపడానికి ఇష్టపడలేదు. 

క్రిప్టోలపై మౌనం..?

క్రిప్టోల వినియోగంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ గవర్నర్‌ క్రిప్టోను జూదంతో పోల్చారు. ఆర్థిక సర్వేలో కూడా క్రిప్టోల నియంత్రణపై ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఈ సారి బడ్జెట్‌లో వీటి నియంత్రణపై దృష్టిపెడతారని భావించారు. కానీ, బడ్జెట్‌ ప్రసంగంలో వాటి నియంత్రణపై ఆర్థిక మంత్రి ఎటువంటి ప్రకటనా చేయలేదు. అంతేకాదు క్రిప్టో నిబంధనలపై స్పష్టత రాకపోవడం కూడా ప్రమాదకరంగా మారింది. వీటిల్లో పెట్టుబడులు చట్టబద్ధమే అని క్రిప్టో ఎక్స్ఛేంజీలు ప్రచారం చేసుకొంటే.. సామాన్య మదుపరి తేలిగ్గా మోసపోయే అవకాశం ఉంది. గతేడాది క్రిప్టో ఆస్తుల విక్రయంపై 30 శాతం పన్ను విధించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు