PPF: పీపీఎఫ్ ఖాతాలో క‌నీస మొత్తం డిపాజిట్ చేయ‌క‌పోతే.. ఏమౌతుంది?

ఒక‌వేళ ఏదైనా ఆర్థిక సంవ‌త్స‌రం పీపీఎఫ్ ఖాతాలో డ‌బ్బు డిపాజిట్ చేయడం మ‌ర్చిపోతే.. నిలిచిపోయిన‌ ఖాతాను తిరిగి పున‌రుద్ధ‌రించుకోవచ్చు

Updated : 06 Jun 2022 16:52 IST

అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పీపీఎఫ్ ఒకటి. పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి అందిస్తున్న పథకం. ఇందులో అసలు, వడ్డీ రెండింటిపై పన్ను ఆదా చేసుకోవచ్చు. వార్షికంగా 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో  గరిష్టంగా సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాకు 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉంటుంది. కాబ‌ట్టి దీర్ఘ‌కాల ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డులు పెట్టే వారు.. ఇందులో పెట్టుబ‌డులు పెట్టి కాంపౌండింగ్ వ‌డ్డీతో మంచి రాబ‌డి పొంద‌వ‌చ్చు. 

అయితే, నిబంధనల ప్రకారం పీపీఎఫ్ ఖాతాదారులు.. ఖాతా నిర్వహణ కోసం వార్షికంగా కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోపు కనీస మొత్తాన్ని జమ చేయడంలో విఫలమైతే ఖాతా నిలిచిపోతుంది. ఒక‌వేళ ఏదైనా ఆర్థిక సంవ‌త్స‌రం పీపీఎఫ్ ఖాతాలో డ‌బ్బు డిపాజిట్ చేయడం మరచిపోతే..నిలిచిపోయిన‌ ఖాతాను తిరిగి పున‌రుద్ధ‌రించుకోవచ్చు. 

నిలిచి పోయిన పీపీఎఫ్ ఖాతా ఎలా పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చో తెలుసుకుందాం.. 

* ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో కనీస మొత్తాన్ని ఖాతాలో డిపాజిట్ చేయ‌డంలో విఫ‌ల‌మైతే పీపీఎఫ్ ఖాతా 'ఇన్‌యాక్టీవ్‌'గా మారుతుంది. ఖాతాను యాక్టీవ్‌గా ఉంచేందుకు ప్ర‌తీ ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసే లోపు, అంటే మార్చి 31 లోపుగా ఖాతాలో క‌నీసం రూ. 500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 

* నిలిచిపోయిన లేదా నిద్రాణ‌మైయున్న ఖాతాకు విత్‌డ్రా, రుణ స‌దుపాయాలు అందుబాటులో ఉండ‌వు. అలాగే, మెచ్యూరిటీ పిరియ‌డ్ త‌ర్వాత ఖాతాను కొన‌సాగించే వీలుండ‌దు. 

* పీఫీఎఫ్ ఖాతాదారుడు మెచ్యూరిటీ పిరియ‌డ్‌లోపు తిరిగి ఖాతాను పున‌రుద్ధ‌రించ‌వ‌చ్చు. పీపీఎఫ్ ఖాతా తిరిగి ఉప‌యోగంలోకి తీసుకొచ్చేందుకు ఖాతాదారుడు.. ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వ్రాత‌పూర్వ‌క అభ్య‌ర్ధ‌న‌ను ఇవ్వాల్సి ఉంటుంది. పీపీఎఫ్‌కు ఉన్న 15 ఏళ్ల కాల‌ప‌రిమితిలో ఎప్పుడైనా ఖాతాను యాక్టీవ్‌గా మార్చుకోవ‌చ్చు. 

* ఖాతాదారుడు ఎన్ని సంవ‌త్స‌రాలు క‌నీస మొత్తాన్ని డిపాజిట్ చేయ‌లేదో.. అన్ని ఏళ్ల‌కు ఏడాదికి రూ. 500 చొప్పున లెక్కించి ఖాతాలో డిపాజిట్ చేయాలి. దీనికి సంబంధించిన చెక్కును ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు అందించాలి. 

* క‌నీస మొత్తంతో పాటు కొంత పెనాల్టీ కూడా చెల్లించాలి. బ్యాంకు/పోస్టాఫీసు వారు క‌నీస డిపాజిట్ చేయ‌ని ఒక్కో ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 50 చొప్పున పెనాల్టీ ఛార్జ్ చేస్తారు. ఈ మొత్తాన్ని పైన తెలిపిన మొత్తంతో క‌లిపి చెక్‌ను ఇవ్వాలి. ఉదాహ‌ర‌ణ‌కి మీరు రెండు సంవ‌త్స‌రాల నుంచి పీపీఎఫ్ ఖాతాలో ఎంటువంటి డిపాజిట్ చేయ‌లేదు అనుకుంటే, ఖాతాను తిరిగి యాక్టీవేట్ చేసుకునేందుకు (2*500 = రూ. 1000 + 2*50 = రూ. 100) = రూ. 1100 చెల్లించి ఖాతాను పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. 

* మీరు ద‌ర‌ఖాస్తు ఫారం స‌బ్మిట్ చేసిన త‌ర్వాత బ్యాంకు లేదా పోస్టాఫీసు అధికారులు మెచ్యూరిటీకి ఉన్న వ్య‌వ‌ధిని చెక్ చేస్తారు. మెచ్యూరిటీకి స‌మ‌యం ఉంటే.. క‌నీస డిపాజిట్‌తో పాటు పెనాల్టీ చెల్లించి ఖాతాను క్రియాశీలంకంగా మార్చుకోవ‌చ్చు. ఒక‌వేళ అప్ప‌టికే మెచ్యూరిటీ వ్య‌వ‌ధి పూర్త‌య్యి ఉంటే ఖాతాను పున‌రుద్ధ‌రించే వీలుండ‌దు. పెనాల్టీని చెల్లించి మెచ్యూరిటీ మొత్తాన్ని పొంద‌వ‌చ్చు. 

గ‌మ‌నిక.. పీపీఎఫ్ ఖాతా క్రియాశీల‌కంగా లేక‌పోయినా ఖాతాలో ఉన్న మొత్తంపై వ‌డ్డీ వ‌స్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు