Home Loan: హోంలోన్‌ ఈఎంఐలు చెల్లించలేకపోతే?

Home Loan: వరుసగా మూడు హోమ్ లోన్ EMIలను చెల్లించలేకపోతే ఎలాంటి పరిణామాలుంటాయో చూద్దాం...

Published : 22 Sep 2022 12:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ రుణాన్ని ఎగవేస్తే మీ ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక వ్యవహారాలపై తీవ్ర పరిణామాలుంటాయి. మీ రుణ యోగ్యత దెబ్బతింటుంది. భవిష్యత్తులో అప్పు పుట్టడం కష్టతరంగా మారుతుంది. వరుసగా మూడు హోమ్ లోన్ EMIలను చెల్లించలేకపోతే ఎలాంటి పరిణామాలుంటాయో చూద్దాం..

తొలి వాయిదా చెల్లించకపోతే..

మొదటి EMI సకాలంలో చెల్లింకపోతే.. వెంటనే బ్యాంక్ మీకు ఎస్‌ఎంఎస్‌, ఇ-మెయిల్ ద్వారా గుర్తు చేస్తుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయడానికి కావాల్సిన లింక్‌ను కూడా పంపుతుంది. చెల్లించాల్సిన EMIతో పాటు బకాయి ఉన్న లోన్ మొత్తంపై 1-2% అపరాధ రుసుమును వసూలు చేయవచ్చు. ఒకసారి వాయిదాను చెల్లించేస్తే తిరిగి రుణ ఖాతాను పునరుద్ధరిస్తారు.

రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే..

రెండో EMI కూడా చెల్లించలేకపోతే.. బ్యాంకు ఈసారి మిమ్మల్ని హెచ్చరిస్తుంది.  ఆలస్య రుసుములతో సహా EMIల మొత్తాన్ని వెంటనే చెల్లించమని కోరుతుంది. మీ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ చెల్లింపు చేయడానికి కొంత సమయం ఇచ్చే అవకాశం ఉంది. అయితే, మూడో EMI కూడా డిఫాల్ట్ అయితే, చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తామని కఠిన హెచ్చరిక జారీచేస్తుంది. అక్కడి వరకు వెళ్లొద్దంటే అప్పటి వరకు ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించేసేయండి.

చివరకు మొండి బకాయిగా..

చివరకు మీరు మూడో ఈఎంఐ కూడా కట్టలేకపోతే.. మీ రుణాన్ని మేజర్‌ డీఫాల్ట్‌ కింద వర్గీకరిస్తారు. అప్పటికీ మీకు బ్యాంకు నుంచి హెచ్చరిక సందేశాలు వస్తూనే ఉంటాయి. బకాయిల చెల్లింపునకు ఇంకా 90 రోజుల గడువుంటుంది. అయినా, చెల్లించకపోతే రుణదాతలు మీ ఇంటిని వేలంలో విక్రయించి రుణ మొత్తాన్ని వసూలు చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ దశకు చేరిందంటే మీ లోన్‌ను మొండి బకాయిల జాబితాలో చేరుస్తారు. దీనికంటే ముందు నోటీసులు పంపుతారు. అదే సంస్థ వద్ద ఇతర రుణాలేమైనా ఉంటే వాటిని కూడా నిరర్థక ఆస్తుల (NPA) పరిధిలోకి తీసుకొస్తారు.

క్రెడిట్‌ స్కోర్‌పై..

మీ హోంలోన్‌ ఒకసారి మేజర్‌ డిఫాల్ట్‌ కిందకు వెళ్లిందంటే.. అది మీ క్రెడిట్‌ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లో ఎగవేతదారు అనే రిమార్క్‌ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో భవిష్యత్తులో రుణాలు తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మీ క్రెడిట్‌ స్కోర్‌ అమాంతం పడిపోతుంది. దీని ఆధారంగానే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలను మంజూరు చేస్తాయి. మీ స్కోర్‌ మెరుగ్గా లేకపోతే.. వడ్డీరేటు అధికంగా ఉంటుంది.

మరి ఏం చేయాలి?

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మీరు ఈఎంఐ చెల్లించలేకపోతే.. బ్యాంకుతో చర్చించి లోన్‌ కాలపరిమితి పెంచమని కోరండి. తద్వారా ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. తర్వాత నిధులు సమీకరించుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. బంధువులు, సన్నిహితుల దగ్గరి నుంచి చేబదులు తీసుకునే అవకాశం ఉంటే ఉపయోగించుకోవాలి. మీ పెట్టుబడులను ఉపసంహరించుకునే మార్గాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటికీ.. కష్టంగా ఉంటే మీ ఇతర ఆస్తులేమైనా ఉంటే లీజుకు ఇవ్వడమో లేక అమ్మడమో చేయాలి. ఆ ప్రత్యామ్నాయం లేకపోతే.. చివరగా ఇంటిని మీరే విక్రయించి లోన్‌ పూర్తిగా చెల్లించే మార్గాన్ని పరిశీలించాలి. అయితే, దీనికి ముందు కచ్చితంగా బ్యాంకును సంప్రదించాలి. వారితో మీ పరిస్థితిని చర్చించాలి. ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఎప్పుడైనా లోన్‌ తీసుకునేటప్పుడు అత్యవసర నిధి కింద ఒక ఆరు నెలల ఈఎంఐలకు సరిపడా డబ్బును జమ చేసి పెట్టుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు