Trade Deal: యూకే పరిణామాలపై వేచిచూసే ధోరణిలో భారత్‌..

బ్రిటన్‌లో రాజకీయ  పరిణామాలపై భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. త్వరలోనే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకొంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Published : 21 Oct 2022 11:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ట్రస్‌ రాజీనామా తర్వాత చోటుచేసుకునే పరిణామాలపై భారత్‌ వేచి చూసే ధోరణి అవలంబిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సరైన మార్గంలోనే కొనసాగుతున్నాయని వెల్లడించారు. గురువారం సీఐఐ జాతీయ ఎగుమతుల సదస్సు సందర్భంగా గోయల్‌ మాట్లాడుతూ.. ‘‘ బ్రిటన్‌లో ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. వారు వేగంగా మరో నాయకుడిని ఎన్నుకొంటారా..? లేదా మొత్తం ప్రక్రియను మొదటి నుంచి మొదలుపెడతారా అనేది తేలాలి. ఎవరు అధికారంలోకి వస్తారు..? వారి దృక్కోణం ఏమిటో తెలియాలి. అప్పుడే మనం యూకేతో చర్చలకు వ్యూహం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని  గోయల్‌ వివరించారు. 

భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చాలా కీలకమన్న విషయం అక్కడి రాజకీయ నాయకులు, వాణిజ్య సంస్థలు గుర్తించాయని గోయల్‌ పేర్కొన్నారు. ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా.. మనతో మంచి సంబంధాలు కొనసాగించాలని మాత్రం కోరుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య ఒప్పందం పాదర్శకంగా, సమతౌల్యంగా, ఉభయులకు ప్రయోజనకరంగా ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. అందుకే వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే యూకే, కెనడా, ఐరోపా సమాఖ్య సహా మరో ఒకట్రెండు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ప్రకటిస్తామని నమ్ముతున్నట్లు గోయల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నట్లు ఆయన వివరించారు. మనం 2027 నాటికి ఈ వాణిజ్య ఒప్పందాలు చేసుకోగలిగితే తాను సంతోషిస్తానని గోయల్‌ పేర్కొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని