బ్యాలెన్సెడ్ ఫండ్లు ఎలా ప‌నిచేస్తాయి?

బ్యాలెన్సెడ్ మ్యూచువ‌ల్ ఫండ్లు అంటే ఏంటి? వాటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు, న‌ష్ట‌భ‌యం, రాబ‌డి , ప‌న్ను విధానం త‌దిత‌ర విష‌యాల‌ను చూద్దాం.​​​​​​...​

Published : 19 Dec 2020 16:20 IST

బ్యాలెన్సెడ్ మ్యూచువ‌ల్ ఫండ్లు అంటే ఏంటి? వాటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు, న‌ష్ట‌భ‌యం, రాబ‌డి , ప‌న్ను విధానం త‌దిత‌ర విష‌యాల‌ను చూద్దాం.​​​​​​​

మ్యూచువ‌ల్ ఫండ్ల కేట‌గిరీలో ఈక్విటీ ఫండ్లు అంటే వీటిలో పెట్టుబ‌డి అధిక శాతం ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డుల్లో పెడ‌తారు. డెట్ ఫండ్లు అయితే అధిక శాతం పెట్టుబ‌డిని స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాల్లో పెడ‌తారు. ఈక్విటీ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫండ్లు వివిధ కంపెనీల షేర్లలో పెట్టుబ‌డి పెడుతుంటాయి వీటిపై వ‌చ్చే రాబ‌డి ఆయా కంపెనీల ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. కాబ‌ట్టి ఇక్క‌డ త‌ప్ప‌నిస‌రి రాబ‌డి ఏమీ ఉండ‌దు. కాబ‌ట్టి కొంత అనిశ్చితి ఉంటుంది. డెట్ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌. ఎందుకంటే ఈ ఫండ్లు చేసే పెట్టుబ‌డులు స్థిర‌మైన రాబ‌డిని అందించే బాండ్లు, ట్రెజ‌రీ బిల్లు వంటి వాటిలో పెట్టుబ‌డి చేస్తారు కాబ‌ట్టి వీటి రాబ‌డి ముందుగా నిర్ణ‌యిత‌మై ఉంటుంది. వీటిలో అస్థిత‌ర త‌క్కువ‌గా ఉంటుంది. కాక‌పోతే ఈ ఫండ్లు చేసే పెట్టుబ‌డుల‌కు సంబంధించి క్రెడిట్ రేటింగ్ చాలా కీల‌కం. ఇటీవ‌లె కాలంలో చాలా సంద‌ర్భాల్లో కంపెనీల క్రెడిట్ రేటింగ్ మార‌డం వంటి ప‌రిణామాలు జ‌రిగాయి.

బ్యాలెన్సెడ్ ఫండ్లు:

ఈక్విటీ, డెట్ పెట్టుబ‌డులు రెండింటిలోనూ పెట్టుబ‌డి చేస్తూ మార్కెట్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పెట్టుబ‌డుల‌ను బ్యాలెన్స్ చేసే ఫండ్ల‌ను బ్యాలెన్సెడ్ ఫండ్లు అంటారు. పెట్టుబ‌డిలో కొంత శాతం ఈక్విటీ (షేర్లు), కొంత శాతం డెట్ (బాండ్లు, డిబెంచ‌ర్లు) సెక్యురిటీల్లో పెట్టుబ‌డిచేసే ఫండ్ల‌ను బ్యాలెన్స్‌డ్ ఫండ్లు అంటాం. ఈక్విటీ లో పెట్టుబ‌డితో వృద్ధిని డెట్ లో పెట్టుబ‌డితో స్థిర‌త్వాన్నిబ్యాల‌న్స్‌డ్ ఫండ్లతో పొంద‌వ‌చ్చు.

సాధార‌ణంగా బ్యాల‌న్స్‌డ్ ఫండ్లలో ఈక్విటీలో 65 శాతం డెట్‌లో 35 శాతం పెట్డుబ‌డి చేస్తారు. ఈక్విటీ ఫండ్ల‌తో పోలిస్తే వీటిలో రిస్క్ త‌క్కువ‌. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల‌ను త‌ట్టుకునే విధంగా ఫండ్ మేనేజ‌రు పోర్టుఫోలియో ను బ్యాలెన్స్ చేస్తుంటారు. స్టాక్ మార్కెట్ అనుకూలంగా లేన‌పుడు పెట్టుబ‌డుల‌ను డెట్ లోకి మార్చి బ్యాలెన్స్ చేస్తారు. అదే విధంగా వ‌డ్డీ రేట్లు అనుకూలంగా లేన‌పుడు పెట్టుబ‌డిని ఈక్విటీలోకి మార్చి బ్యాలెన్స్ చేస్తారు. పెట్టుబ‌డిలో కొంత వృద్ధిని కొంత స్థిర‌త్వాన్ని కోరుకునే వారికి ఇవి స‌రిపోతాయి. బ్యాలెన్సెడ్ ఫండ్లలో రెండు ర‌కాలుంటాయి.

ఈక్విటీ ఓరియెంటెడ్ బ్యాలెన్సెడ్ ఫండ్లు:

  • ఈ ఫండ్ల‌లో పెట్ట‌బడి ఎక్కువ శాతం ఈక్విటీలో త‌క్కువ శాతం డెట్ లో చేస్తుంటారు. ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఈక్విటీలో 80 శాతం మిగిలిన‌ది డెట్ లో పెట్టుబ‌డి చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. కొత్త మ్యూచువ‌ల్ ఫండ్ వ‌ర్గీక‌ర‌ణ ప్ర‌కారం హైబ్రిడ్ ఫండ్లు ఎక్కువ‌గా ఈక్విటీలో పెట్టుబ‌డి పెట్టే వ్యూహాన్ని క‌లిగి ఉండేవిగా పేర్కొన్నారు.

  • ఎక్కువ శాతం ఈక్విటీలో , కొంత శాతం డెట్ లోనూ మ‌దుపు చేయాల‌నుకునే వారికి అనువుగా ఉంటాయి. ప‌న్ను ప‌రంగా వీటిని ఈక్విటీ ఫండ్ల కింద ప‌రిగ‌ణిస్తారు.

  • ఈక్విటీ ఫండ్లలో ఒక సంవ‌త్స‌రం కంటే ఎక్కువ కాలం ఉన్నాక పెట్టుబడి వెనక్కి తీసుకుంటే దానిని దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న రాబ‌డిగా ప‌రిగ‌ణిస్తారు. రాబ‌డి రూ. 1ల‌క్ష కు మించితే, దీనిపై ప‌న్ను 10 శాతం చెల్లించాలి.

డెట్ ఓరియెంటెడ్ బ్యాలెన్సెడ్ ఫండ్లు:

  • ఎక్కువ శాతం డెట్ లోను త‌క్కువ శాతం ఈక్విటీలోనూ పెట్టుబ‌డి పెడ‌తారు. త‌క్కువ రిస్క్ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు స్థిరాదాయ పెట్టుబ‌డి సాధానాల్లో 90 శాతం , మిగిలింది ఈక్విటీలో పెట్టుబ‌డి చేసేందుకు వీటుంటుంది.

  • ఎక్కువశాతం డెట్ లో, కొంత శాతం ఈక్విటీ లోనూ మ‌దుపుచేయాల‌నుకునే వారికి అనువుగా ఉంటాయి ప‌న్ను ప‌రంగా వీటిని డెట్ ఫండ్ల కింద ప‌రిగ‌ణిస్తారు.
    కొత్త మ్యూచువ‌ల్ ఫండ్ వ‌ర్గీక‌ర‌ణ ప్ర‌కారం హైబ్రిడ్ ఫండ్లు ఎక్కువ‌గా డెట్ లో పెట్టుబ‌డి పెట్టే వ్యూహాన్ని క‌లిగి ఉండేవిగా పేర్కొన్నారు.

  • డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే వాటిని దీర్ఘకాలిక మూలధన రాబ‌డిగా ప‌రిగ‌ణిస్తారు. వీటిపై 20% ఇండెక్సేష‌న్ ప్రయోజనంతో పన్ను చెల్లించాలి. ఇండెక్సేష‌న్ అంటే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవ‌డం.

మార్కెట్లు అనుకూలంగా ఉండే స‌మ‌యంలో బ్యాలెన్సెడ్ ఫండ్లు ఈక్విటీ ఫండ్ల కంటే త‌క్కువ లాభ‌ప‌డేంద‌కు అవ‌కాశం ఉండొచ్చు. ఎందుకంటే బ్యాలెన్సెడ్ ఫండ్లలో పెట్ట‌బ‌డి ఈక్విటీతో పాటు డెట్ లో కూడా పెడ‌తారు. దీంతో కొంత ఈక్విటీ ద్వారా క‌లిగే ప్రయోజ‌నం త‌గ్గ‌వ‌చ్చు. ప్ర‌తికూల స‌మ‌యాల్లో పూర్తి స్థాయి ఈక్విటీ ఫండ్ల కంటే బ్యాలెన్సెడ్ ఫండ్లు త‌క్కువ న‌ష్ట‌పోతాయి. ఎందుకంటే ఇందులో ఉండే డెట్ భాగంపై మార్కెట్ ప్ర‌భావం ఉండ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని