Term plan: ఆన్‌లైన్‌ Vs ఆఫ్‌లైన్.. ట‌ర్మ్ ప్లాన్ ఎక్కడ తీసుకుంటే మంచిది?

వ్యక్తులు ఏజెంట్ ద్వారా ఆఫ్‌లైన్‌లోనూ, బీమా అగ్రిగేట‌ర్ల‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ట‌ర్మ్ ప్లాన్ తీసుకోవ‌చ్చు

Published : 18 Feb 2022 19:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడున్న జీవన విధానాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటే ఎవరికైనా జీవిత బీమా ఉండాలి. ముఖ్యంగా ట‌ర్మ్ బీమా. ఆకస్మికంగా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు, అలాగే ప‌న్ను ఆదాకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. కొవిడ్-19కి ముందు చాలా మంది సంప్రదాయ పాల‌సీల వైపు మొగ్గుచూపేవారు. కానీ, కొవిడ్ త‌ర్వాత ట‌ర్మ్ బీమా అమ్మకాలు పెద్దఎత్తున పెరిగాయి. ప్యూర్ ట‌ర్మ్ బీమా ఎంచుకుంటే త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ పొందొచ్చు. ఇది, పాలసీదారు లేని స‌మ‌యంలో వారి కుటుంబానికి ఆర్థికంగా అండ‌గా ఉంటుంది. ప్రస్తుతం ట‌ర్మ్ బీమా పాల‌సీలు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ రెండు విధానాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఏజెంట్ ద్వారా ఆఫ్‌లైన్‌లోనూ, బీమా అగ్రిగేట‌ర్ల ద్వారా ఆన్‌లైన్‌లోనూ ట‌ర్మ్ ప్లాన్ తీసుకోవ‌చ్చు. కొంతమంది బీమా బ్రోకర్లు రెండు మార్గాల ద్వారా పాలసీలను విక్రయిస్తారు. మ‌రి, ఏ మార్గంలో పాల‌సీ కొనుగోలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందో చూద్దాం..

  • పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో ఎక్కువగా చూసేది ప్రీమియం. ఆఫ్‌లైన్ పాల‌సీల‌తో పోలిస్తే 15 శాతం త‌క్కువ ధ‌ర‌కు ఆన్‌లైన్ పాల‌సీలు అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంది. ఆఫ్‌లైన్ విధానంలో బీమా సంస్థ ఏజెంట్‌కు క‌మీష‌న్ ఇస్తుంది. ఈ క‌మీష‌న్‌తో పాటు, నిర్వహణ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఛార్జీలు వంటి అన్ని ర‌కాల ఛార్జీల‌ను బీమాదారుడి పైనే వేస్తారు. అందువ‌ల్ల ఆఫ్‌లైన్‌లో ప్రీమియం పెరొగొచ్చు. కొన్నిసార్లు సంస్థలు ఆన్‌లైన్ ధ‌ర‌కే ఆఫ్‌లైన్‌లోనూ పాల‌సీల‌ను అందిస్తాయి. ఈ విధంగా వ‌స్తుంటే ఆఫ్‌లైన్‌లోనూ పాల‌సీ తీసుకోవ‌చ్చు.
  • ఆన్‌లైన్ ద్వారా మ‌రింత పార‌ద‌ర్శకత, స్పష్టతతో పాల‌సీ ల‌భిస్తుంది. వినియోగ‌దారులు ఒకేచోట వివిధ బీమా సంస్థలు అందించే పాల‌సీలను పోల్చి చూసి.. స‌రిపోయే పాల‌సీని ఎంచుకునే వీలుంటుంది. ఇక్కడ ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి. కానీ ఆఫ్‌లైన్ విధానంలో మీ ఏజెంట్ ఏ బీమా సంస్థకు ప‌నిచేస్తారో.. దానికి సంబంధించిన పాల‌సీల‌ను మాత్రమే చూపిస్తారు. ఇక్కడ ఏజెంటు చెప్పిన పాలసీలకే మనం పరిమితమవుతాం. అంటే, అవకాశాలను తక్కువ చేసుకున్నట్టే.
  • ఆన్‌లైన్‌లో పాల‌సీ కొనుగోలు చేసిన‌ప్పుడు పాలసీ తీసుకునే వ్యక్తి సవ్యంగా పాల‌సీ ఫారం పూర్తిచేస్తారు. కాబ‌ట్టి, పాల‌సీకి సంబంధించిన అన్ని వివ‌రాలూ పాల‌సీదారునికి తెలుస్తాయి. అలాగే, వాస్తవాలను వెల్లడించేందుకు అవకాశం ఉంటుంది. పాలసీదారుని స‌మాచారం ఫారంలో నింపేట‌ప్పుడు త‌ప్పులు జ‌రిగే అవ‌కాశాలు త‌క్కువగా ఉంటాయి. ఆఫ్‌లైన్ పాల‌సీ విష‌యంలో వ్యక్తులు ఏజెంట్లపై ఆధారపడతారు. కొన్ని ముఖ్య విష‌యాల‌ను ఏజెంట్ చెప్పడం మర్చిపోవ‌చ్చు. లేదా పాల‌సీలో కూడా అన్ని వాస్తవాలనూ తెలపకపోవచ్చు. ఒక‌వేళ మీరు ఆఫ్‌లైన్లో పాల‌సీ కొనుగోలు చేస్తుంటే సవ్యంగా మీరే ఫారం నింపేందుకు ప్రయత్నించండి. లేదా ఏజెంట్ నింపిన ఫారాన్ని పూర్తిగా చ‌దవండి. ఏమైనా త‌ప్పులు ఉంటే ముందే స‌రిచేసుకోవ‌చ్చు.
  • ఆన్‌లైన్‌ బీమాతో ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. బీమా కంపెనీకి వెళ్లక్కర్లేకుండా సులువుగా ఇంట్లో కంప్యూటర్‌ ముందు కూర్చొని పాలసీని పొందేందుకు వీలుంది. అదే ఏజెంటు ద్వారా పాలసీ తీసుకోవాలనుకుంటే అతడి కోసం వేచిచూడాల్సి ఉంటుంది. మారుతున్న జీవనశైలితో రోజువారీ పనులు చేసుకోవడమే కష్టమవుతోంది. అలాంటిది పాలసీ కొనేందుకు ఏజెంట్ల చుట్టూ తిర‌గడం ఇబ్బందిగా ఉంటుంది.
  • ఆఫ్‌లైన్ పాల‌సీల విష‌యంలో ఏజెంట్ సాయం ఉంటుంది. కానీ ఆన్‌లైన్ పాల‌సీల‌కు ఏజెంట్ సాయం ఉండ‌దు. ఫారం నింపే ద‌గ్గర నుంచి ప్రీమియం చెల్లింపుల వర‌కు అన్ని సవ్యంగా పాలసీదారుడే చూసుకోవాలి. కొంద‌రికి సాంకేతిక ప‌రిజ్ఞానం అంతంగా ఉండదు. అలాంటి వారు ఏజెంట్ సాయంతో ఆఫ్‌లైన్‌లో పాల‌సీ కొనుగోలు చేయ‌వ‌చ్చు.
  • ట‌ర్మ్ బీమా విష‌యంలో బీమా చేసిన వ్యక్తి మ‌ర‌ణిస్తే.. హామీ మొత్తం నామినీకి చేరుతుంది. ఆఫ్‌లైన్ పాల‌సీల విష‌యంలో నామినీ బీమా ఏజెంట్‌ను సంప్రదిస్తే.. ప్రాసెస్ మొత్తం ఏజెంట్ చేస్తారు. ఏదైనా కార‌ణం చేత నామినీ ఏజెంట్‌ను సంప్రదించలేకపోయినా.. బీమా ఏజెంట్‌కు విష‌యం తెలిస్తే ఏజెంటే స్వయంగా నామినీని సంప్రదించి పాల‌సీ క్లెయిమ్ ప్రాసెస్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో బీమా కొనుగోలు చేస్తే.. ఆ వివరాల‌ను నామినీకి త‌ప్పక తెలియజేయాలి. లేదంటే క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు.
  • క్లెయిమ్ పరంగా పాలసీ ఎక్కడ తీసుకున్నా పెద్దగా తేడా ఉండదు. కొందరు ఆన్‌లైన్‌ పాలసీలకు క్లెయిమ్ సెటిల్మెంట్ సరిగ్గా ఉండదని భావిస్తారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. కంపెనీని సంప్రదించి క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • పాల‌సీ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ఏ విధంగా కొనుగోలు చేసినా.. పాల‌సీ గురించి స్పష్టమైన, కచ్చితమైన సమాచారం మీ వ‌ద్ద ఉండాలి. కుటుంబానికి అవ‌స‌ర‌మైన పాల‌సీల‌ను మాత్రమే ఎంచుకోవాలి.
  • హామీ మొత్తం కుటుంబ అవ‌స‌రాల‌కు స‌రిప‌డా ఉండేలా చూసుకోవ‌డం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి వార్షిక ఆదాయానికి 15 నుంచి 20 రెట్లు ట‌ర్మ్ పాల‌సీ హామీ మొత్తం ఉండాలి. అలాగే, ఒక వ్యక్తి 60 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు పాల‌సీని కొన‌సాగించ‌డం మంచిది. ఆ పైన కూడా పాల‌సీ కొనసాగించాలా? వ‌ద్దా? అనేది ఆ వ్యక్తికి ఉన్న బాధ్యతలపై ఆధార‌ప‌డి ఉంటుంది.
  • భ‌విష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని అధిక క‌వ‌రేజ్‌తో కూడిన పాల‌సీని ఎంచుకోవాలి. ఒక‌వేళ ఇప్పటికే ఉన్న హామీ మొత్తం స‌రిపోదు అనుకుంటే కొత్త పాల‌సీని తీసుకోవ‌చ్చు. లేదా యాడ్‌-ఆన్‌ల సాయంతో ఇప్పటికే ఉన్న పాలసీని అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు.
  • ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌.. ట‌ర్మ్ బీమాను ఏవిధంగా కొనుగోలు చేసినా.. వైద్య చ‌రిత్ర, జీవ‌న శైలి అల‌వాట్లు స‌హా మొత్తం స‌మాచారాన్ని బ‌హిర్గతం చేయడం చాలా ముఖ్యం. ఇది క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో సాయపడుతుంది. మీ కుటుంబానికి ఎలాంటి స‌మ‌స్యలూ ఎదురవకుండా ఉంటాయి.
  • మీరు ఆన్‌లైన్/ఆఫ్‌లైనా ఏ విధానంలో పాల‌సీ తీసుకున్నా, పాల‌సీ గురించిన స‌మాచారాన్ని నామినీ లేదా కుటుంబ స‌భ్యులు లేదా న‌మ్మకస్తులైన ఒక‌రిద్దరు వ్యక్తులకు త‌ప్పకుండా తెలియ‌జేయాలని గుర్తుంచుకోండి. పాల‌సీ ప‌త్రాల‌ను ఎక్కడ ఉంచారో కూడా తెలపాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని