Consumer durable loan: క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్ లోన్ అంటే ఏంటి.. ఎందుకు?

ఇంటికి అవ‌స‌ర‌మైన వ‌స్తువును కొనుగోలు చేసేందుకు.. చేతిలో స‌రిప‌డినంత‌ డ‌బ్బు లేక ఆలోచిస్తున్న వారికి ఈ రుణాలు మంచి ఆప్ష‌న్‌.   

Updated : 02 Sep 2021 17:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహోప‌క‌ర‌ణాల‌కు ఉన్న డిమాండ్ ఎప్ప‌టికీ త‌గ్గ‌దు. వాషింగ్ మెషిన్‌, ఎల్ఈడీ టీవీ, ఏసీ వంటివి ఇప్పుడు ప్రతి ఇంట్లో త‌ప్ప‌నిస‌రిగా మారాయి. అయితే అవన్నీ ఒకేసారి కొనుగోలు చేసేందుకు అంద‌రి వ‌ద్దా స‌రిప‌డా డ‌బ్బు ఉండ‌క‌పోవ‌చ్చు. ఇందుకోస‌మే వినియోగ వ‌స్తువుల‌పై రుణాల‌ను ప‌రిచ‌యం చేశాయి ఆర్థిక‌ సంస్థ‌లు. ఈ రుణాల‌తో ఈఎమ్ఐల‌ను చెల్లించుకుంటూ మీకు కావాల్సిన వ‌స్తువును వెంట‌నే కొనుగోలు చేయొచ్చు. మీ ఇంటిని గృహోప‌క‌ర‌ణాల‌తో అలంక‌రించాల‌నుకుంటే లేదా కొత్త గ్యాడ్జెట్లు కొనాల‌నుకంటే ఈ రుణాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మ‌న్నిక‌ గ‌ల వ‌స్తువుల‌పై రుణం (క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్ లోన్)
వాషింగ్ మెషిన్‌, రిఫ్రిజిరేట‌ర్‌, ఎయిర్-కండీష‌న‌ర్, ఎల్ఈడీ టీవీ, మైక్రోవేవ్స్, ఫ‌ర్నీచ‌ర్, దుస్తులు, గ్రాస‌రీ కొనుగోలు చేసేందుకు ఈ రుణాన్ని తీసుకోవ‌చ్చు. బ్యాంకులు, బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ వంటి ఆర్థిక సంస్థ‌ల నుంచి ఈ రుణాల‌ను పొందొచ్చు. మీకు త‌గిన కాల‌ప‌రిమితిని ఎంచుకొని సౌక‌ర్య‌వంతంగా చెల్లింపులు చేసుకోవ‌చ్చు. వీటిపై సున్నా లేదా త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఉంటాయి.

వ‌డ్డీ రేట్లు.. ఇత‌ర ఛార్జీలు..
ఈ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు వ్య‌క్తిగ‌త రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కంటే త‌క్కువ‌గా ఉంటాయి. బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ ఎంపిక చేసిన వ‌స్తువుల‌పై వ‌డ్డీ లేని ఈఎమ్ఐల‌ను కూడా అందిస్తోంది. వ‌డ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉండొచ్చు. వీటిని పోల్చి చూసుకొని త‌క్కువ‌గా ఉన్న సంస్థ‌ల రుణాల‌ను ఎంచుకోవాలి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు కూడా తీసుకుంటాయి.

కాల‌ప‌రిమితి..
ఈ రుణాల‌ను తిరిగి చెల్లించేందుకు కాల‌ప‌రిమితి సాధార‌ణంగా 3 నుంచి 24 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. అయితే వ‌స్తువుల‌ను బ‌ట్టి ఒక్కో రుణ‌దాత ఒక్కో విధంగా కాల‌ప‌రిమితిని నిర్ణ‌యించే అవ‌కాశం ఉంది. వ‌డ్డీని త‌గ్గించుకోవాలంటే త‌క్కువ కాల‌ప‌రిమితిని ఎంచుకోవ‌డం మేలు. అయితే వ‌డ్డీ లేని ఈఎమ్ఐ అయితే ఎక్కువ కాల‌ప‌రిమితి ఉన్నా ఫ‌ర్వాలేదు.

ఎంత రుణం ల‌భిస్తుంది..
వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు డౌన్‌పేమెంట్, వినియోగ‌దారులు సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. సాధార‌ణంగా ఆర్థిక సంస్థలు కొనుగోలు చేసే వ‌స్తువు విలువ‌లో 80-90 శాతం రుణాల‌ను అందిస్తాయి. అంటే డౌన్‌పేమెంట్ 10-20 శాతం చేయాల్సి ఉంటుంది. కొన్ని సంస్థ‌లు 100 శాతం కూడా ఇస్తున్నాయి. ఇంటిలో వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్న‌వారికి చేతిలో డ‌బ్బు లేక‌పోతే ఇది మంచి ఆప్ష‌న్‌గా మారుతుంది. వ‌చ్చే ఆదాయంలో అంద‌రూ వ‌స్తువును పూర్తి ధ‌ర‌తో ఒకేసారి కొనుగోలు చేసే అవ‌కాశం లేకపోవ‌చ్చు. అటువంటి వారికి ఈ రుణాలు తోడ్ప‌డ‌తాయి. రుణం ఆమోదించేందుకు ఎక్కువ కాలం కూడా ప‌ట్ట‌దు. కొన్ని డాక్యుమెంట్ల‌ను అందిస్తే చాలు. 

ఈ రుణం తీసుకోవ‌చ్చా..
రుణం అనేది ఎప్ప‌టికైనా భార‌మే అని చెప్తారు ఆర్థిక నిపుణులు. వ‌స్తువుల‌ను కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు దాని ధ‌రకు త‌గిన‌ట్లుగా నెల‌కు కొంత పొదుపు చేసుకొని తీసుకోవ‌డం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని