Doxxing: మస్క్‌ నోట ‘డాక్సింగ్‌’ మాట.. ఇంతకీ ఏమిటీ రూల్‌?

Doxxing In telugu: డాక్సింగ్‌ రూల్‌ను ఉల్లంఘించారంటూ కొన్ని ట్విటర్‌ ఖాతాలపై ట్విటర్‌ వేటు వేసింది. ఇంతకీ డాక్సింగ్‌ అంటే ఏమిటి? ఆ ఖాతాలను మస్క్‌ ఎందుకు సస్పెండ్‌ చేశారు?

Published : 17 Dec 2022 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon musk) ఏది చేసిన సంచలనమే. ట్విటర్‌ను కొంటానంటాడు.. అంతలోనే కొనబోనని ప్రకటిస్తాడు. వాక్‌ స్వాతంత్య్రానికి పెద్దపీట వేస్తానని చెప్తూనే.. మరోవైపు కొందరి ఖాతాలను నిలిపివేస్తాడు. ఈ క్రమంలోనే కొందరి జర్నలిస్టుల ఖాతాలనూ సస్పెండ్‌ చేయడం చర్చనీయాంశమైంది. ఇందుకు గానూ ఆయన ఆయన వాడిన పదమే.. డాక్సింగ్ (Doxxing)‌. దీంతో ఈ పదం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంతకీ డాక్సింగ్‌ అంటే?

డ్రాపింగ్‌ డాక్స్‌ (dropping dox)ను సంక్షిప్తంగా డాక్సింగ్‌గా (Doxxing) పేర్కొంటారు. సింపుల్‌గా చెప్పాలంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం అన్నమాట. ఒక వ్యక్తికి సంబంధించి సమాచారాన్ని అతడి అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయడాన్ని డాక్సింగ్‌గా వ్యవహరిస్తారు. పేరు, అడ్రస్‌, చిరునామా, ఫోన్‌ నంబర్‌, ఇ-మెయిల్‌ అడ్రస్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని డాక్సింగ్‌గా పేర్కొంటారు.

ఈ రూల్‌ను మస్క్‌ ఎందుకు తీసుకొచ్చాడు?

  • మస్క్‌కు ఇటీవల వ్యక్తిగతంగా ఎదురైన రెండు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ట్విటర్‌లో డాక్సింగ్‌ రూల్‌ను తీసుకొచ్చారు. ఇటీవల ఎలాన్‌ మస్క్‌కు సంబంధించిన ప్రైవేట్‌ జెట్‌ విమానం రియల్‌టైమ్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తున్న ‘ఎలాన్‌జెట్‌’ అనే ఖాతాను ట్విటర్‌ సస్పెండ్‌ చేసింది. లొకేషన్‌ వివరాలను జాక్‌ స్వీనీ అనే యువకుడు పోస్ట్‌ చేస్తుండడంపై మస్క్‌ వారించినప్పటికీ వినకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • అలాగే తన తన రెండేళ్ల కుమారుడుతో కారులో వెళుతుండగా.. ఓ వ్యక్తి కారును వెంబడించినట్లు మస్క్‌ గుర్తించాడు. సంబంధిత వీడియోను మస్క్‌ పోస్ట్‌ చేస్తూ.. ముసుగు వేసుకున్న అపరిచితుడిని గుర్తించాలంటూ కోరాడు. ఈ నేపథ్యంలోనే ఎలాన్‌ మస్క్‌ డాక్సింగ్‌ నిబంధన గురించి ట్వీట్‌ చేశాడు. ఏదైనా ఖాతా వ్యక్తుల రియల్‌ టైమ్‌ డేటాను షేర్‌ చేస్తే అలాంటి ఖాతాలను ట్విటర్‌ నిలిపివేస్తుందని తెలిపారు.

ట్విటర్‌ కొత్త రూల్స్‌ ఏం చెబుతున్నాయ్‌?

ఎవరైనా వ్యక్తి ప్రైవేట్‌ లేదా లైవ్‌ లొకేషన్‌ సమాచారం షేర్‌ చేస్తే అలాంటి ఖాతాలను కంటెంట్‌ తొలగించమని ట్విటర్‌ సదరు యూజర్‌ను కోరుతుంది. అదే సమయంలో తాత్కాలికంగా ఆ ఖాతాను నిలిపివేస్తుంది. అదే తప్పును మళ్లీ చేస్తే పూర్తిగా ఆ ఖాతాను నిలిపివేస్తుంది. ఎవరైనా వ్యక్తికి సంబంధించిన లొకేషన్‌ షేర్‌ చేస్తే ఆటోమేటిక్‌గా సస్పెండ్‌ అవుతుందని ట్విటర్‌ తెలిపింది. అలాగే వ్యక్తుల ప్రైవేట్‌ మీడియాను వారి అనుమతి లేకుండా షేర్‌ చేస్తే సంబంధిత కంటెంట్‌ తొలగించమని చెప్పడంతో పాటు తాత్కాలికంగా ఆ ఖాతా నిలిపివేయనున్నట్లు ట్విటర్‌ తన కొత్త నిబంధనల్లో పేర్కొంది.

మరి మస్క్‌పై విమర్శలెందుకు?

డాక్సింగ్‌ రూల్స్‌ పేరిట తాత్కాలికంగా నిలిపివేసిన ఖాతాల్లో కొందరు జర్నలిస్టుల ఖాతాలు కూడా ఉన్నాయి. అందులో సీఎన్‌ఎన్‌, ది టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌కు చెందిన జర్నలిస్టులు ఉన్నారు. మస్క్‌ను విమర్శించినందుకే వారి ఖాతాలపై నిషేధం విధించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తన నిర్ణయాన్ని మస్క్‌ సమర్థించుకున్నారు. డాక్సింగ్‌ నిబంధనలు జర్నలిస్టులు సహా అందరికీ వర్తిస్తాయని పేర్కొన్న మస్క్‌.. తాజాగా ఆ ఖాతాలపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని