EPS: ఈపీఎస్ స్కీమ్ స‌ర్టిఫికెట్ అంటే ఏమిటి?

ఈపీఎఫ్ఓ కింద స‌బ్‌స్క్రైబ్‌ చేసుకున్న ప్ర‌తీ ఉద్యోగి ఈపీఎస్ స‌ర్టిఫికెట్ పొంద‌చ్చు

Updated : 09 Dec 2021 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత నెల‌వారీ పెన్ష‌న్ పొందేందుకు ఈపీఎస్‌ (ఉద్యోగుల పింఛ‌ను ప‌థ‌కం)ను ఏర్పాటు చేసింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ). అయితే, పెన్ష‌న్ పొందేందుకు ఈపీఎస్‌కు నిధుల‌ను ఉద్యోగులు త‌మ వేత‌నం నుంచి కాంట్రిబ్యూష‌న్ చెయ్య‌రు. మ‌రి ఎవ‌రు కాంట్రిబ్యూట్ చేస్తారు? అస‌లు ఈపీఎస్ స‌ర్టిఫికెట్‌ అంటే ఏంటి?ఎలా ప‌నిచేస్తుంది? పెన్ష‌న్ క్లెయిమ్ చేసుకునేందుకు స‌ర్టిఫికెట్ ఎలా పొందాలి? త‌దిత‌ర విష‌యాల‌ను ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ఈపీఎస్ స్కీమ్ అంటే ఏంటి?
ఈపీఎస్ అనేది ఈపీఎఫ్‌లో ఒక భాగం. ఈపీఎఫ్‌లో స‌భ్యులైన‌ ఉద్యోగుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత నెలవారీ పింఛను పొందొచ్చు. ఉద్యోగి మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా నామినీ ఈ పెన్ష‌న్ పొందొచ్చు. ఉద్యోగి, సంస్థ 12 శాతం చొప్పున‌ ఉద్యోగి వేతనానికి స‌మాన‌మైన మొత్తాన్ని ప్ర‌తి నెలా ఈపీఎఫ్‌లో జ‌మ‌చేస్తారు. సంస్థ వాటా అయిన 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌కి చెందుతుంది. మిగ‌తా 3.67 శాతం ఈపీఎఫ్‌కి చేరుతుంది. అంటే, ఈపీఎస్ కోసం ఉద్యోగి ప‌నిచేసే సంస్థ కాంట్రిబ్యూట్ చేస్తుంది.

ఈపీఎస్ ఫీచ‌ర్లు..
* పెన్ష‌న్ నెల‌కు క‌నీసం రూ. 1000 ల‌భిస్తుంది. గ‌రిష్ఠంగా రూ.7500 పొందే వీలుంది.
* ఉద్యోగి 58 సంవ‌త్స‌రాల త‌ర్వాత లేదా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న్‌ను పొందొచ్చు.
* ఉద్యోగి తన ఈపీఎస్‌ను 60 సంవత్సరాల వయస్సు వరకు వాయిదా వేయవచ్చు. వాయిదా వేసిన‌ ప్రతి సంవత్సరానికి ఈపీఎస్ బ్యాలెన్స‌పై 4% ఎక్కువ పొందుతారు.
* భార్య లేదా భ‌ర్త చ‌నిపోయిన‌వారికి, పిల్ల‌ల‌కు (25 సంవ‌త్స‌రాల లోపు) పెన్ష‌న్ ల‌భిస్తుంది.
* భార్య లేదా భ‌ర్తను కోల్పోయిన‌వారు తిరిగి పెళ్లి చేసుకుంటే కేవ‌లం పిల్ల‌లు మాత్ర‌మే 25 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు పెన్ష‌న్ ప్ర‌యోజ‌నాలు పొందుతారు.
* పిల్ల‌ల‌కు వైక‌ల్యం ఉంటే జీవితాంతం పెన్ష‌న్ పొందేందుకు వీలుంటుంది.
* పెన్ష‌న్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో నుంచి పెన్ష‌న్ స‌ర్టిఫికెట్ పొంద‌డం అవ‌స‌రం.

ఈపీఎస్ స‌ర్టిఫికెట్ ఎవ‌రికి ల‌భిస్తుంది..?
ఈపీఎఫ్ఓ కింద స‌బ్‌స్క్రైబ్‌ చేసుకున్న ప్ర‌తి ఉద్యోగీ ఈపీఎస్ స‌ర్టిఫికెట్ పొందొచ్చు. దీంతో పెన్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఉద్యోగి స‌ర్వీస్, వ‌య‌సు ఆధారంగా ఈపీఎస్ బ్యాలెన్స్ ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత విత్‌డ్రా చేసుకోవ‌చ్చు లేదా ఈపీఎస్ స‌ర్టిఫికెట్‌తో పెన్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఒక ఉద్యోగి ఆరు నెల‌ల కంటే ఎక్కువ కాలం ప‌నిచేస్తే దానిని ఏడాదిగా ప‌రిగ‌ణిస్తారు.
* ఒక వ్య‌క్తి 9 సంవ‌త్స‌రాల 6 నెల‌లు ఉద్యోగం చేస్తే దాన్ని 10 సంవ‌త్స‌రాలుగా లెక్కిస్తారు. అయితే 58 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌ప్పుడు స్కీమ్ స‌ర్టిఫికెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి లేదా ఈపీఎస్ నుంచి న‌గ‌దును విత్‌డ్రా చేసుకోవచ్చు.
* ఒక వ్య‌క్తి వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు కానీ ఉద్యోగంలో చేరి 7 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే పూర్తి అయితే స్కీమ్ స‌ర్టిఫెకెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం లేదా ఈపీఎస్ విత్‌డ్రా చేసుకోవాలి.
* ప‌దేళ్ల కంటే ఎక్కువ కాలం స‌ర్వీస్‌లో ఉన్న‌వారు త‌ప్ప‌కుండా ఈపీఎస్ స‌ర్టిఫికెట్ తీసుకోవాలి. వారు ఈపీఎస్ నుంచి న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండ‌దు.

ఈపీఎస్ స‌ర్టిఫికెట్ ఏం తెలుపుతుంది?
ఈపీఎస్ స‌ర్టిఫికెట్‌ను ఈపీఎఫ్ఓ, కార్మిక శాఖ‌, ప్ర‌భుత్వం జారీ చేస్తాయి. ఈపీఎఫ్ స‌భ్యుడిగా ఎన్ని రోజులు ప‌నిచేశారో ఈ స‌ర్టిఫికెట్ తెలుపుతుంది. ఎన్ని సంవ‌త్స‌రాలు ఉద్యోగం చేశారు, కుటుంబ స‌భ్యుల‌ వివ‌రాలు అంటే ఒక‌వేళ ఉద్యోగి మ‌ర‌ణిస్తే పెన్ష‌న్ పొందేందుకు అర్హ‌త ఉన్న‌వారు ఎవ‌రు అనేది తెలుపుతుంది. దీనిని అధికారిక రికార్డుగా ప‌రిగ‌ణిస్తారు.

ఈపీఎస్ స‌ర్టిఫికెట్ కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేస్తుకోవాలి?
ఉద్యోగం మానేస్తున్న‌ప్పుడు ఫారం 10సి పూరించాల్సి ఉంటుంది. అందులో ఈపీఎస్ స‌ర్టిఫికెట్ కోసం అప్లికేష‌న్ పెట్టుకుంటారా లేదా న‌గ‌దు విత్‌డ్రా చేసుకుంటారా అనే ఆప్ష‌న్ ఉంటుంది. ఈపీఎస్ స‌ర్టిఫికెట్ ఆప్ష‌న్ ఎంచుకున్న‌ప్పుడు మీ సంస్థ ఈపీఎఫ్ఓకి దీనిని చేర‌వేస్తుంది. అప్పుడు ఈపీఎఫ్ఓ.. ఈపీఎస్ స‌ర్టిఫికెట్ జారీచేస్తుంది. స‌రైన వివ‌రాలు అందిస్తే ఒక నెల‌లోపు ఈపీఎస్ స‌ర్టిఫికెట్ పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని