Union Budget 2022: ‘కవచ్‌’.. పట్టాలపై 10వేల ఏళ్ల రక్షణ

రైళ్లలో భద్రత, వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత ‘కవచ్ (Kawach)‌’ పరిధిలోకి 2,000 కి.మీ.ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Updated : 02 Feb 2022 15:01 IST

రైల్వే ప్రమాదాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికత

ఇంటర్నెట్‌డెస్క్‌: రైళ్లలో భద్రత, వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత ‘కవచ్ (Kawach)‌’ పరిధిలోకి 2,000 కి.మీ.ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సాంకేతికతతో 10వేల ఏళ్లలో ఒక తప్పిదం మాత్రమే జరిగే అవకాశముందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు దేశీయంగా ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించేందుకు ఈ ‘కవచ్‌’ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. మరి ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది..? అసలు ‘కవచ్‌’ అంటే ఏంటీ..? 

రైళ్ల రాకపోకలకు నియంత్రించేందుకు భారత రైల్వే గత కొన్నేళ్లుగా విదేశీ సాంకేతికతపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేసి రైల్వేలో స్వావలంబన సాధించాలని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే రీసర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్ (RSDO).. మేధా సర్వో డ్రైవ్స్‌, కెర్నెక్స్‌ మైక్రో సిస్టమ్స్‌తో కలిసి ‘ట్రైన్‌ కొలిజన్‌ అవైడెన్స్‌ సిస్టమ్‌ (TCAS)’ అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనిని భారతీయ రైల్వే ఆమోదించింది. దీన్నే ఆటోమెటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ (ATP) సిస్టమ్‌, కవచ్‌ (Kawach) గా పిలుస్తున్నారు. 

పనిచేస్తుందిలా..

రైల్వేల్లో ‘సున్నా ప్రమాదాలే’ లక్ష్యంగా ఈ కవచ్‌ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు. ప్రమాదం ఎదురైనప్పుడు రైలు దానంతటే అదే ఆగిపోయేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. ఉదాహరణకు ఒక రైలు వెళ్తోన్న మార్గంలోనే కొంత దూరంలో మరో రైలు కూడా ప్రయాణిస్తున్నప్పుడు.. ఈ ‘కవచ్‌’ టెక్నాలజీ వెంటనే సెన్సర్లతో గుర్తిస్తుంది. దీంతో రైలు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అంతేగాక, పట్టాలపై సమస్యలు, ఇతర సాంకేతిక సమస్యలు, మానవ తప్పిదాలను కూడా ఈ టెక్నాలజీ గుర్తించి వెంటనే రైలును ఆపేస్తుంది.

పరిధిలోకి 2వేల కిలోమీటర్లు..

ప్రస్తుతం ఈ టెక్నాలజీని పైలట్‌ ప్రాజెక్టు కింద దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయోగిస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో దాదాపు 600 కిలోమీటర్ల మార్గంలో కవచ్‌ సాంకేతికతను ఇన్‌స్టాల్‌ చేశారు. అయితే ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో.. ‘కవచ్‌’ పరిధిలోకి 2,000 కి.మీ.ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. 2024 నాటికి 4500 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను దీని పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని