ఎల్‌ఓసీ..ఈ రుణ సదుపాయం గురించి తెలుసా?

ఎప్పుడైనా మనకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే వెంటనే బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలను ఆశ్రయిస్తాం. రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటాం. సంస్థలు మన అర్హతలను.......

Updated : 16 Mar 2021 11:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడైనా మనకు అత్యవసరంగా డబ్బు కావాల్సివస్తే వెంటనే బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలను ఆశ్రయిస్తాం. రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటాం. సంస్థలు మన అర్హతలను బట్టి నిర్ధారిత వడ్డీరేటుతో రుణం మంజూరు చేస్తుంది. అయితే, సాధారణ రుణాల విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. బ్యాంకుల్లో కనీస మొత్తం నిబంధన ఉంటుంది. మనకు అవసరం లేకున్నా వారు ఇచ్చే మొత్తాన్ని తీసుకోవాల్సి వస్తుంటుంది. ఇక మరికొన్ని సందర్భాల్లో మనకు ఒక నిర్ధారిత సమయం పాటు రెగ్యులర్‌ ఇంటర్వెల్స్‌లో డబ్బు అవసరం ఉంటుంది. తరచూ బ్యాంకుల వద్దకు రుణాలకు వెళ్లడం కుదరదు. అలా ఒకేసారి మొత్తం తీసుకొని ఖాతాలో ఉంచితే.. వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే బ్యాంకులు అందించే లైన్‌ ఆఫ్‌ క్రెడిట్(ఎల్‌ఓసీ)‌. దీన్నే క్రెడిట్‌ లైన్‌ అని కూడా అంటారు.

లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ అంటే...

క్రమం తప్పకుండా ఓ నిర్ధారిత సమయం పాటు ఆర్థిక సాయం అవసరమైన వారికి ‘లైన్ ఆఫ్ క్రెడిట్ ఒక వరం’ లాంటిదనే చెప్పాలి. ఈ విధానంలో రుణగ్రహీత బ్యాంకు నుండి ఒక నిర్దిష్ట రుణ మొత్తానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఆ మొత్తాన్ని ఒకేసారి వినియోగించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత అవసరానికి కొంత మొత్తాన్ని తీసుకొని మిగిలిన సొమ్మును ఖాతాలోనే ఉంచవచ్చు. ఖాతా నుంచి తీసిన మొత్తంపై మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు. అలాగే ఈ విధానంలో, సంప్రదాయ రుణంతో పోలిస్తే చాలా సంస్థలు తక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుంటాయి. ఇది ఒక రకంగా క్రెడిట్ కార్డ్ లాంటిదే. మీ అర్హతలను బట్టి బ్యాంక్ మీకు రూ.50 వేలు మంజూరు చేసిందని అనుకుందాం. మీ అవసరం నిమిత్తం మీరు రూ.10,000 తీసుకున్నారు. అటువంటి సందర్భంలో, మీరు వడ్డీ మొత్తాన్ని రూ.10,000 మాత్రమే చెల్లించాలి.

రెండు రకాల ఎల్‌ఓసీలు...

సెక్యూర్డ్‌: ఈ ఎల్‌ఓసీ విధానంలో బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడ మీకు సంబంధించిన కొన్ని విలువైన ఆస్తుల్ని తనఖా పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ విధానంతో రుణగ్రహీత ఆదాయం, క్రెడిట్‌ స్కోర్‌ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

అన్‌సెక్యూర్డ్‌: సెక్యూర్డ్‌తో పోలిస్తే ఈ విధానంతో మంజూరు చేసే రుణానికి కాస్త ఎక్కువ మొత్తంలో వడ్డీరేటు నిర్ణయిస్తారు. ఎలాంటి తనఖా పెట్టాల్సిన అసవరం లేదు. ఈ నేపథ్యంలో రుణదాతలు కాస్త రిస్క్‌ తీసుకుంటున్న కారణంగా వడ్డీరేటును అధికంగా నిర్ణయిస్తుంటారు.

* సాధారణంగా వ్యక్తిగత రుణం తీసుకునే పద్ధతిలోనే దీన్నీ మంజూరు చేస్తారు. దీనికి ప్రత్యేకమైన డాక్యుమెంట్లేమీ అవసరం ఉండదు. దాదాపు వ్యక్తిగత రుణానికి అర్హులైనవారందరూ లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌కి కూడా అర్హులే.

* ఇక ఈ రుణాన్ని తిరిగి చెల్లించే పద్ధతులు కూడా సంస్థను బట్టి మారుతుంటుంది. అయితే, చాలా సంస్థలు క్రెడిట్‌ కార్డు తరహాలోనే వినియోగించుకున్న మొత్తాన్ని ఈఎంఐ కింద మార్చుకునే అవకాశం ఇస్తాయి. లేదా వడ్డీ మాత్రమే కట్టుకొని అసలు చెల్లింపును వాయిదా వేసుకోవచ్చు. అసలు కూడా వీలును బట్టి మనకు సర్దుబాటైనంత వరకు చెల్లించేయొచ్చు. అయితే, దీనికి ఒక కాలపరిమితిని నిర్ధారిస్తారు. ఆ సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

* పెళ్లి ఖర్చుల కోసం రుణం తీసుకునే వారు, అంకుర సంస్థలు స్థాపించాలనుకునే వారికి ఎల్‌ఓసీ ఒక ఉపయోగకరమైన సాధనం. అయితే, క్రెడిట్‌ కార్డ్‌ తరహాలోనే దీన్ని కూడా జాగ్రత్తగా వాడుకుంటే ప్రయోజనాలు ఉంటాయి. లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. ఎప్పటిలాగే ఇక్కడా షరతులు వర్తిస్తాయి. సంస్థను బట్టి నియమాలు మారుతుంటాయి. మీ వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, మీ ఆదాయం, విశ్వాసం వంటి ఇతరత్రా అంశాలు కూడా ఎల్‌ఓసీలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

* లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సదుపాయాన్ని ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, ప్రభుత్వాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉపయోగించుకుంటుంటాయి. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో భాగంగా ఇటీవల శ్రీలంక, ఇండోనేసియా వంటి దేశాలకు భారత్‌ లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కింద రుణాన్ని మంజూరు చేసేందుకు అంగీకరించింది. వ్యక్తిగత ఎల్‌ఓసీలు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. బ్యాంకులు, సదరు వ్యక్తుల మధ్య సంబంధాలు, అర్హతలు, నమ్మకం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.

ఇవీ చదవండి...

రుణరేట్లు తగ్గించిన బ్యాంకులు

ఏప్రిల్ 1 నుంచి 5 కొత్త ఆదాయపు పన్ను నియమాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని