పింక్ ట్యాక్స్ గురించి విన్నారా? 

మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా డిజైన్, ప్యాకేజీ చేసిన ఉత్ప‌త్తుల‌కు మాత్ర‌మే వ‌ర్తించే ఎవ‌రికీ క‌నిపించ‌ని ప‌న్ను ఈ పింక్ ట్యాక్స్‌. 

Updated : 17 Dec 2021 16:54 IST

ప్ర‌త్యేకించి మ‌హిళ‌లు ఉప‌యోగించే వ‌స్తువులు, సేవ‌ల‌పై విధించే ప‌న్నునే పింక్ ట్యాక్స్ అంటారు. కొన్ని చోట్ల మ‌హిళ‌లు పురుషుల‌తో స‌మానంగా ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ, పురుషుల‌తో పోలిస్తే వారికి వేత‌నాలు త‌క్కువ‌గా ఉంటాయి. అయితే మ‌హిళ‌లు ఉప‌యోగించే వ‌స్తువుల‌కు మాత్రం ఎక్కువ ధ‌ర చెల్లించాల్సి వ‌స్తుంది. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం న్యూయార్క్ సిటీ డిపార్మెంట్ ఆఫ్ కన్స్యూమర్‌ ఎఫైర్స్ క్రాడ‌ల్ టు కేన్ పేరుతో జ‌రిపిన‌ పరిశోధనలో మ‌హిళ‌ల కోసం ఉత్ప‌త్తి  చేసిన వ‌స్తువుల ధ‌ర‌లు, పురుషుల కోసం ఉత్ప‌త్తి చేసే వ‌స్తువుల ధ‌ర‌ల కంటే అధికంగా ఉంటున్నాయ‌ని వెల్ల‌డ‌య్యింది. ఈ ప‌రిశోధ‌న కోసం వారు మార్కెట్లో ల‌భ్య‌మయ్యే 800 వ‌స్తువుల‌ను పోల్చి చూసిన‌ప్పుడు, మ‌హిళ‌లు, పురుషుల‌కోసం త‌యార‌య్యే ఒకే రకమైన వ‌స్తువులు మార్కెట్లోకి వ‌చ్చేస‌రికి ధ‌ర‌ల్లో అధిక వ్య‌త్యాసం క‌నిపిస్తుంద‌ని మ‌హిళ‌లకు సంబంధించిన వ‌స్తువుల‌ ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంద‌ని నివేదిక వెల్ల‌డించింది. 

మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా డిజైన్, ప్యాకేజీ చేసిన ఉత్ప‌త్తుల‌కు మాత్ర‌మే వ‌ర్తించే ఎవ‌రికీ క‌నిపించ‌ని ప‌న్ను ఈ పింక్ ట్యాక్స్‌. అయితే సాధార‌ణ లేదా పురుషుల కోసం ఉత్ప‌త్తి చేసిన వస్తువులు మార్కెట్లో త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉంటున్నాయి. ఈ విధానం ఒక్క న్యూయార్క్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు.  భార‌త‌దేశంతో స‌హా అన్ని ప్ర‌పంచ దేశాల‌లో మ‌హిళలు పింక్ ట్యాక్స్‌ను చాలా ఉత్ప‌త్తుల‌కు, సేవ‌ల‌కు చెల్లిస్తున్నారు. 

సెలూన్స్‌లో పురుషుల హెయిర్ క‌ట్‌కు అయ్యే ఖ‌ర్చుకంటే మ‌హిళ‌ల హెయిర్ క‌ట్ ఖ‌ర్చు 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉంటుంది. అయితే ఇక్క‌డ మ‌హిళ‌ల హెయిర్ కట్ చేయ‌డం సుల‌భం పైగా స‌మ‌యం కూడా త‌క్కువ. కొన్ని ఉత్ప‌త్తులు మ‌హిళ‌ల‌కు, పురుషుల‌కు ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే ప్యాకేజీలో మాత్రం వ్య‌త్యాసం ఉంటుంది. అటువంటి వ‌స్తువుల ధ‌ర‌ల‌లో కూడా అధిక వ్యత్యాసం క‌నిపిస్తూ ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక బ్రాండెడ్ సంస్థ‌ పురుషుల కోసం ఉత్ప‌త్తి చేసే డిస్‌పోజ‌బుల్ రేజ‌ర్‌ను రూ. 20కి విక్ర‌యిస్తే అదే కంపెనీ మ‌హిళ‌ల కోసం ఉత్ప‌త్తి అదే డిస్‌పోజ‌బుల్ రేజ‌ర్‌ను రూ. 55 కు విక్రయిస్తుంది. ఇరువురి రేజ‌ర్‌ల త‌యారీకి ఒకే విధంగా ఖ‌ర్చ‌యినా మ‌హిళ‌ల రేజ‌ర్ ప్యాకేజీలో ప్ర‌త్యేక‌త చూపించి అధిక ధ‌ర వ‌సూలు చేస్తున్నారు. 

మ‌రి పింక్ ట్యాక్స్ నుంచి ఏవిధంగా బ‌య‌ట‌ప‌డాలి?
పింక్ షేడ్‌లో ఆక‌ర్ష‌ణీయంగా ప్యాక్ చేసిన ఉత్ప‌త్తులతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. వీటి బ‌దులు సాధార‌ణంగా ఉండే వ‌స్తువుల‌ను కొనుగోలు చేయాలి. ప్ర‌త్యేకించి ప్ర‌యోజ‌నాల‌లో పెద్ద‌గా వ్య‌త్యాసం లేనప్పుడు, వ‌స్తువుల‌ను జాగ్రత్తగా పరిశీలించి ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని