EXPLAINED: 2G, 3G, 4G, 5G.. ఏమిటివి? స్పెక్ట్రమ్‌కి వేలం ఎందుకు?

what is spectrum auction explained in telugu: ఏమిటీ స్పెక్ట్రమ్‌? ప్రభుత్వం ఎందుకు దీన్ని విక్రయిస్తుంది? 2జీ, 3జీ, 4జీ, 5జీ సాంకేతికల్లో తేడాలేమిటి?

Published : 20 Jul 2022 10:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతిక విప్లవంలో భారత్‌ మరికొద్ది రోజుల్లో కీలక ముందడుగు వేయబోతోంది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే 5జీ టెక్నాలజీలోకి అడుగిడబోతోంది. దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ జులై 26న ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన కొన్ని నెలల్లోనే దేశంలో అత్యంత వేగవంతమైన టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సాంకేతికంగా దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు సంభవించబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ స్పెక్ట్రమ్‌? ప్రభుత్వం ఎందుకు దీన్ని విక్రయిస్తుంది? 2జీ, 3జీ, 4జీ, 5జీ సాంకేతికల్లో తేడాలేమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..

స్పెక్ట్రమ్‌ అంటే?

సెల్‌ఫోన్లు, రేడియోలు వంటి వైర్‌లెస్‌ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార బట్వాడాకు విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్‌ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్‌ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్‌లుగా వర్గీకరించారు. 5జీ కోసం ప్రస్తుతం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్‌ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచనున్నారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz , 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు వేలం నిర్వహించనున్నారు.

వేలం దేనికి?

రేడియో తరంగాలు మన చుట్టూనే ఉంటాయి. దేన్నుంచైనా దూసుకెళుతుంటాయి. ఎవరి ఇష్టారీతిన వారు నచ్చిన ఫ్రీక్వెన్సీలో ఈ తరంగాలను వినియోగిస్తే గందరగోళం ఏర్పడుతుంది. పైగా ఇవి పరిమితమైన ప్రక్రియ వనరు. కాబట్టి వీటికి నియంత్రణ అవసరం. సులువుగా చెప్పాలంటే.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ గ్రీన్‌లో ఉన్నప్పుడు ఆ వైపు వాహనాలు మాత్రమే వెళతాయి. మిగిలివన్నీ ఆగి ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో ట్రాఫిక్‌ సిగ్నల్‌ మరమ్మతుకు గురై, ట్రాఫిక్‌ను నియంత్రించేవారెవరూ లేకపోతే వాహనాలన్నీ ఇష్టారీతిన వెళతాయి. ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అదే తరహాలో నిర్దేశిత ఫ్రీక్వెన్సీలో రేడియో తరంగాలను ప్రసారం చేయడం అవసరం. అందుకే అన్ని దేశాల ప్రభుత్వాలు తమ భూభాగం పరిధిలోని స్పెక్ట్రమ్‌ను నియంత్రిస్తుంటాయి. మన దేశంలోనూ స్పెక్ట్రమ్‌ను కేంద్రం నియంత్రణలో ఉంటుంది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ స్పెక్ట్రమ్‌ను ఆయా కంపెనీలకు వేలం ద్వారా కేటాయిస్తుంది. సాధారణంగా 20 ఏళ్ల లీజుకు ఈ స్పెక్ట్రాన్ని టెలికాం కంపెనీలు పొందుతాయి. నిర్ణీత సమయం తర్వాత మళ్లీ పొందిన స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.

2జీ, 3జీ, 4జీ, 5జీ మాటేంటి?

మొదట్లో సెల్‌ఫోన్ బరువు కేజీ ఉండేది. తర్వాత కీ ప్యాడ్‌ ఫోన్‌ వచ్చింది. తర్వాత మడత పెట్టే ఫోన్లూ వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో ఫోన్లు స్మార్ట్‌గా మారిపోయాయి. ఒకప్పుడు ఫోన్లు కేవలం కాల్స్‌ మాట్లాడడానికి మాత్రమే.. కానీ ఇప్పటి స్మార్ట్‌ఫోన్లతో దాదాపు అన్ని రకాల పనులూ చక్కెబెట్టేయొచ్చు. అలాగే టెలికాం కమ్యూనికేషన్‌ రంగంలోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. అలా తొలి తరం నెట్‌వర్క్‌ను 1జీ అనే వారు. ఇక్కడ G అంటే జనరేషన్‌ అని అర్థం. ఈ నెట్‌వర్క్‌లో కేవలం ఫోన్లు మాట్లాడడానికి మాత్రమే పరిమితం. ఆ తర్వాత తరాన్ని బట్టి ఇంటర్నెట్‌ అందించే వేగంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం 4జీ విస్తృత వినియోగంలో ఉంది.

ఏ తరం దేనికి?

  • 1G: 1970ల్లో జపాన్‌లో తొలి తరం మొబైల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ తరంలో కేవలం ఫోన్లు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేది. సౌండ్‌ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే. 
  • 2G: టెలికాం రంగంలో చెప్పుకోదగ్గ మార్పు ఉన్న నెట్‌వర్క్‌ 2జీ. 1991లో ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. తొలిసారి ఎస్సెమ్మెస్‌, ఎంఎంఎస్‌ అనేవి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. డేటా వేగం గరిష్ఠంగా 50 కేబీపీఎస్‌ మాత్రమే.
  • 3G: 2001లో ఈ సాంకేతికత పరిచయం అయ్యింది. మనం ఇప్పుడు వాడుతున్న చాలా సదుపాయాలు ఈ సాంకేతిక నుంచి మొదలైనవే. వేగవంతమైన మొబైల్‌ ఇంటర్నెట్‌, వీడియో కాలింగ్‌, వెబ్‌ బ్రౌజింగ్‌ వంటి సదుపాయాలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి.
  • 4G: దేశంలో చాలా వరకు వాడుకలో ఉన్న నెట్‌వర్క్‌ ఇదే. వేగవంతమైన డేటా, వీడియో స్ట్రీమింగ్‌, వీడియో కాలింగ్‌ వంటి సదుపాయాలు ఈ నెట్‌ వర్క్‌ సొంతం. ముఖ్యంగా జియో రాకతో చాలా వరకు 2జీ, 3జీ దాదాపు కనుమరుగైనప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఈ నెట్‌వర్క్‌ వాడుతున్నారు.
  • 5G: భవిష్యత్‌లో దేశంలో రాబోయే సాంకేతిక పరిజ్ఞానం. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్‌లోడ్‌ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్‌, ఏఆర్‌ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్‌ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్‌ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది. రిమోట్‌ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని