Step up home loan: స్టెప్‌- అప్‌ హోమ్‌లోన్‌ గురించి తెలుసా? ఎవరికి ప్రయోజనకరం?

Step- up home loan: హోమ్‌లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా? ఇంతకీ స్టెప్‌- అప్‌ హోమ్‌లోన్‌ గురించి తెలుసా?

Published : 09 Jul 2024 10:05 IST

Step- up home loan | ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతింటి (Home) కల నెరవేర్చుకోవడం అంత సులువు కాదు. చాలా మంది సొంతిల్లు కొందామని ప్రయత్నించి.. ఈఎంఐ (EMI) భారం గురించి ఆలోచించి తమ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. ఈలోగా ఇళ్ల ధరలు పెరిగిపోతుంటాయి. దీంతో సొంతింటి కల కలగానే మిగిలిపోతుంటుంది. ముఖ్యంగా కెరీర్‌ ఆరంభంలో ఉండేవారికి ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. భవిష్యత్‌లో వేతనం పెరుగుతుందన్న నమ్మకం ఉన్నా.. అప్పటి వరకు వేచి చూస్తే ఇళ్ల ధరలు అంతకుమించి పెరిగిపోతుంటాయి. అలాంటి వారి కోసమే ఉన్న రుణ సదుపాయం.. స్టెప్‌- అప్‌ హోమ్‌లోన్‌ (Step- up home loan).

సాధారణంగా ఓ 25 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే.. మొత్తాన్ని బట్టి నెల నెలా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తొలినాళ్లలో ఈఎంఐలో వడ్డీ భాగం అధికంగా, అసలు భాగం తక్కువగా ఉంటుంది. ఏళ్లు గడిచేకొద్దీ చెల్లించే మొత్తంలో ప్రిన్సిపల్‌ అమౌంట్ పెరుగుతుంటుంది. ఈఎంఐలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. స్టెప్‌- అప్‌ హోమ్‌లోన్‌ విషయంలో ఆరంభంలో ఈఎంఐ మొత్తం తక్కువగా ఉంటుంది. కాలక్రమేణా ఆ మొత్తం పెరుగుతుంటుంది. ఎవరికైనా కెరీర్‌ ప్రారంభంలో వేతనాలు తక్కువగా ఉంటాయి. తర్వాత పెరుగుతుంటాయి. అలాంటి వారికి ఈ తరహా రుణ విధానం ప్రయోజనకంగా ఉంటుంది. వివిధ బ్యాంకులు ఈ తరహా రుణాలను అందిస్తున్నాయి.

రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?

లాభనష్టాలు..

స్టెప్‌ హోమ్‌లోన్‌ విధానంలో ఈఎంఐ తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ రుణ మొత్తంలో పొందేందుకూ వీలుంటుంది. తక్కువ వయసులోనే గృహ రుణాన్ని పొందొచ్చు. దీర్ఘకాలం పాటు చెల్లించే వెసులుబాటు లభిస్తుంది. కెరీర్‌ ఆరంభంలోనే ఆదాయపు పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. అదే సమయంలో సాధారణ గృహ రుణంతో పోలిస్తే స్టెప్‌-హోమ్‌ లోన్‌ విషయంలో ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు. మీ వేతనంలో ఊహించినంత పెరుగుదల లేకపోతే భవిష్యత్‌లో ఈఎంఐ చెల్లించడంలో భారం కావొచ్చు.

మరో ఆప్షన్‌ స్టెప్‌- డౌన్‌

ఈ తరహా హోమ్‌లోన్‌ విధానంలో కాలక్రమేణ ఈఎంఐ మొత్తం తగ్గుతుంటుంది. కెరీర్‌లో మంచి పొజిషన్‌లో ఉండి ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తూ.. భవిష్యత్‌లో ఈఎంఐ భారం తగ్గించుకోవాలనుకునే వారికి ఈ తరహా హోమ్‌లోన్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు ఎవరైతే రిటర్మైంట్‌కు మరికొన్నేళ్ల దూరంలో ఉంటారో వారు ఈ ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. ఆరంభంలో ఎక్కువ మొత్తంలో ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందనేది గుర్తుంచుకోవాలి.

చివరిగా: గృహ రుణం తీసుకునేటప్పుడు వయసును బట్టి స్టెప్‌- అప్‌ లేదా స్టెప్‌ - డౌన్‌ రుణాలను పరిశీలించొచ్చు. సాధారణ రుణంతో పోలిస్తే ఎంతవరకు ప్రయోజనం అనేది బేరీజు వేసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని