Updated : 18 Feb 2022 17:48 IST

Explained: ఏబీజీ షిప్‌ యార్డ్‌.. బిగ్‌ బ్యాంకింగ్‌ స్కామ్‌! ఏంటీ మోసం? పొలిటికల్‌ వార్‌ దేనికి?

ABG Shipyard scam: మొన్న విజయ్‌ మాల్యా... నిన్న నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ.. ఇప్పటి వరకు వీళ్లు చేసినవే అతిపెద్ద బ్యాంకింగ్‌ మోసాలుగా పేరొందాయి. తాజాగా ఏబీజీ షిప్‌ యార్డ్‌ (ABG Shipyard Scam) ఆ జాబితాలో చేరింది. దేశ బ్యాంకింగ్‌ చరిత్రలో అతిపెద్ద మోసంగా నిలిచింది. బ్యాంకులను ఏకంగా దాదాపు రూ.23 వేల కోట్ల (23,000 Crores Scam) మేర మోసగించిన కేసులో సీబీఐ (CBI) తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై కాంగ్రెస్‌, భాజపా పొలిటికల్‌ వార్‌కు దిగాయి. ఇంతకీ ఏమిటీ కంపెనీ..? బ్యాంకులను ఎలా మోసం చేసింది..? రాజకీయ రగడ దేనికి..?

గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అతిపెద్ద షిప్పుల తయారీ సంస్థ. రిపేర్‌ వ్యవహారాలనూ చూస్తుంది. అహ్మదాబాద్‌లో 1985లో తొలుత మగ్దల్లా షిప్‌యార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా ఏర్పాటైంది. 1995 మే నెలలో ఏబీజీ షిప్‌యార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మారింది. 1990లో తొలి షిప్‌ను రూపొందించిన ఈ కంపెనీ.. 2013 నాటికి 165 షిప్పులను తయారు చేసింది. ఇందులో సింహభాగం ఆర్డర్లు విదేశాల నుంచే కావడం గమనార్హం. 2000 సంవత్సరంలో తొలిసారి భారత ప్రభుత్వం నుంచి ఇండియన్‌ కోస్ట్‌ గార్డు కోసం రెండు ఇంటర్‌సెప్టర్‌ బోట్స్‌ తయారీ ఆర్డర్‌ పొందింది. 2011లో యుద్ధనౌకలు, జలాంతర్గాముల తయారీకి లైసెన్స్‌లు సాధించింది. సూరత్‌, దహేజ్‌లో షిప్‌యార్డులు ఉన్నాయి. ఈ రంగంలో ఏబీజీదే పైచేయి. 2012 ఫిబ్రవరి నాటికి కంపెనీ చేతిలో రూ.16,600 కోట్లు విలువైన ఆర్డర్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.

2008 ఆర్థిక సంక్షోభం దెబ్బకు..

2007-08 ఆర్థిక సంక్షోభం ప్రభావం ఈ కంపెనీపై తీవ్రంగా పడింది. ఆ సంక్షోభం తర్వాత నుంచి 2012 నాటికి కంపెనీ వద్ద ఉన్న నిధులు మొత్తం హరించుకుపోయాయి. ఈ క్రమంలోనే భారీగా రుణాలు తీసుకొంది. దీనికి తోడు షిప్‌ బిల్డింగ్‌ సబ్సిడీ స్కీమ్‌ 2007తో ముగిసిపోవడమూ కంపెనీపై ప్రభావం పడింది.

ఇంతకీ ఏంటీ కేసు..?

ఏబీజీ షిప్‌యార్డ్‌, కంపెనీ డైరెక్టర్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని 28 బ్యాంకుల కన్షార్టియంను రూ.23వేల కోట్ల మేర మోసగించారన్నది కేసు. 2005 నుంచి ఈ కంపెనీ రుణాలు పొంది తిరిగి చెల్లించలేదు. దీంతో 2013లో ఈ రుణాలను నిరర్ధక ఆస్తులుగా గుర్తించారు. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ 2019లో తన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో కీలక విషయాలు బయటపెట్టింది. రుణాలుగా తీసుకున్న మొత్తాలను.. విదేశాల్లోని తన అనుబంధం సంస్థలకు, విదేశాల్లోని పలు ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. ఈ తతంగం మొత్తం 2012-2017 మధ్యలో జరిగినట్లు గుర్తించారు.

దీనిపై 2019 నవంబరు 8న ఎస్‌బీఐ తొలుత ఫిర్యాదు చేయగా 2020 మార్చి 12న సీబీఐ దీనిపై మరిన్ని వివరాలు కోరింది. తిరిగి అదే ఏడాది ఆగస్టులో బ్యాంకు ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై దాదాపు ఏడాదిన్నర పాటు పరిశీలన జరిపిన సీబీఐ తాజాగా ఫిబ్రవరి 7న కేసు నమోదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (ఏబీజీఎస్‌ఎల్‌), ఆ సంస్థ మాజీ ఛైర్మన్‌, ఎండీ రిషీ కమలేశ్‌ అగర్వాల్‌తో పాటు నాటి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శంతనం ముత్తుస్వామి, డైరెక్టర్లు అశ్వినీ కుమార్‌, సుశీల్‌ కుమార్‌ అగర్వాల్‌, రవి విమల్‌ నెవేతియా, మరో కంపెనీ ఏబీజీ ఇంటర్నేషనల్‌ ప్రై.లిమిటెడ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఏ బ్యాంక్‌ ఎంత...?

ఏబీజీ షిప్‌యార్డ్‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్షార్టియానికి ఎస్‌బీఐ నేతృత్వం వహించింది. ఎస్‌బీఐ రూ.2,925 కోట్లు రుణంగా ఇచ్చింది. ఇక ఐసీఐసీఐ రూ.7,089 కోట్లు, ఐడీబీఐ రూ.3,634 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.1,614 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.1,244 కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ రూ.1,288 కోట్లు చొప్పున రుణాలు మంజూరు చేసినట్లు ఎస్‌బీఐ తన ఫిర్యాదులో పేర్కొంది.

అతిపెద్ద మోసం ఇదే.. 

దేశంలో ఇప్పటి వరకు బ్యాంకులను మోసగించిన పారిపోయిన పేరు అనగానే ప్రధానంగా వినిపించేది విజయ్‌ మాల్యాదే. రూ.9,900 కోట్ల మేర మోసగించి అతడు  విదేశాలకు పారిపోయాడు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన మామ మెహుల్‌ ఛోక్సీ సైతం బ్యాంకులను రూ.14వేల కోట్ల మేర టోకరా వేసి విదేశాల్లో తలదాచుకుంటున్నారు. వీరిని దేశానికి రప్పించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతుండగానే.. ఏబీజీ షిప్‌యార్డ్‌ రూపంలో మరో బ్యాంక్‌ మోసం వెలుగుచూసింది. మొత్తం రూ.22,800 కోట్లు మేర కంపెనీ మోసగించిదనేది అభియోగం. దేశంలో వెలుగుచూసిన అతిపెద్ద బ్యాంకింగ్‌ మోసాల్లో ఇదే ఇప్పటి వరకు పెద్దది!!


నువ్వంటే.. నువ్వు!

ఏబీజీ స్కామ్‌ వెలుగుచూడగానే దీనిపై రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్‌, భాజపా మాటల యుద్ధానికి దిగాయి. మోదీ ప్రభుత్వం బ్యాంకులను మోసగించిన వారి కోసం ‘దోచుకో- పారిపో’ పథకం ప్రవేశపెట్టిందంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా విమర్శించారు. నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ, లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా, జతిన్‌ మెహతా, చేతన్‌, నితిన్‌ సందేసరా.. వీరంతా బ్యాంకులను మోసగించి మోదీ హయాంలోనే విదేశాలకు పారిపోయారని విమర్శించారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వ సహకారంతో అతిపెద్ద మోసానికి ఏబీజీ గ్రూప్‌ పాల్పడిందని ఆరోపించారు. కంపెనీ లిక్విడేషన్‌ ప్రక్రియను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) 2017లోనే మొదలు పెట్టిందని, ఐదేళ్లయినా ఈ ప్రక్రియ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. 2018లోనే ఏబీజీ షిప్‌యార్డ్‌ స్కామ్‌ గురించి కాంగ్రెస్‌ లేవనెత్తిందని గుర్తుచేశారు. 2019లోనే మోసాన్ని గుర్తించినా ఎందుకు ఎఫ్‌ఐఆర్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రెండు దఫాలు ఎస్‌బీఐ ఫిర్యాదు చేశాక.. సీబీఐ ఇప్పుడు మేల్కొందని ఆరోపించారు. 2007లో గుజరాత్‌లోని భాజపా ప్రభుత్వం అదే కంపెనీకి 1.21 లక్షల చదరపు మీటర్ల భూమిని ఇచ్చిందని సూర్జేవాలా ఆరోపించారు.

కాంగ్రెస్‌ చేసిన ఈ విమర్శలను భాజపా తిప్పికొట్టింది. ‘దొంగే దొంగ’ అని అన్న చందంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని భాజపా అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సయ్యద్‌ జఫర్‌ ఇస్లామ్‌ విమర్శించారు. 2014లో భాజపా అధికారంలోకి రాకముందే ఆ రుణాలను నిరర్ధక ఆస్తులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. భాజపా హయాంలోనే మోసాన్ని గుర్తించామని చెప్పారు. అయినా ప్రమోటర్ల నుంచి కమీషన్లు తీసుకుని బ్యాంకులపై ఒత్తిడి తెచ్చి రుణాలు మంజూరు చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందంటూ ప్రత్యారోపణలు చేశారు. అప్పట్లో జరిగిన మోసాలను తమ ప్రభుత్వం వెలుగులోకి తెస్తోందన్నారు. బ్యాంకు రుణాల మంజూరులో మోదీ ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఎగవేత దారుల నుంచి వసూళ్లు జరుగుతున్నాయని, బ్యాంకులు లాభాల్లో పయనిస్తున్నాయని ఇస్లామ్‌ వివరించారు.

ఇదీ దేశంలోనే అతి పెద్ద స్కామ్‌ కథ!!

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని