Home insurance policies: ఇంటికి ఇద్దాం.. బీమా రక్ష

కలల ఇంటిని కష్టపడి నిర్మించుకుంటాం. ఇది మనకు అతి పెద్ద పెట్టుబడి. ఇల్లు, ఇంట్లో ఉండే మనం, వస్తువులు సురక్షితంగా ఉండేలా అన్ని భద్రతా చర్యలూ తీసుకుంటాం.

Updated : 14 Jun 2024 00:38 IST

కలల ఇంటిని కష్టపడి నిర్మించుకుంటాం. ఇది మనకు అతి పెద్ద పెట్టుబడి. ఇల్లు, ఇంట్లో ఉండే మనం, వస్తువులు సురక్షితంగా ఉండేలా అన్ని భద్రతా చర్యలూ తీసుకుంటాం. కానీ, అనుకోనిది జరిగి, ఏదైనా నష్టపోయినప్పుడు దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి? ఇందుకోసమే గృహ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

ఇంటి యజమాని లేదా అద్దెకు ఉన్న వారైనా సరే గృహ బీమా పాలసీని కొనుగోలు చేయొచ్చు. నిర్మాణం, వస్తువులు, ఆభరణాలు, కళాకృతుల కోసం అగ్ని, ఇతర ప్రమాదాలు, దొంగతనం తదితర సంఘటనల్లో జరిగిన నష్టానికి పరిహారం అందించేలా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇల్లు లేదా ఆస్తిని అద్దెకు ఇచ్చినప్పుడూ యజమాని గృహ బీమా తీసుకోవచ్చు. ఏదైనా ప్రమాదం వల్ల ఆస్తి ధ్వంసమైనప్పుడు, లేదా అద్దెకు ఉన్న వారు దానిని ఖాళీ చేసినప్పుడు ఆదాయ నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి వాటికీ గృహ బీమా పాలసీలు ఉంటాయి. ఒక రోజు వ్యవధి నుంచి 5 ఏళ్ల సుదీర్ఘకాలం వరకూ ఈ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి.

అవసరమేమిటి?

ప్రకృతి వైపరీత్యాలు: ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల ఇంటికి  నష్టం వాటిల్లినప్పుడు గృహ బీమా పరిహారం అందిస్తుంది. ముఖ్యంగా వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో గృహ బీమా పాలసీ తీసుకోవడం మంచిదనే చెప్పాలి. నిర్మాణానికే కాకుండా, ఇంట్లోని వస్తువులకూ ఆర్థిక భద్రత లభిస్తుంది. 

ఇంట్లోని వస్తువులు: ఫర్నిచర్, దుస్తులు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు తదితర గృహోపకరణాలను గృహ బీమాలో భాగం చేయొచ్చు. విలువైన ఆభరణాలూ ఈ బీమా పరిధిలోకి వస్తాయి. మీరు ఇంట్లోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడూ మీరు ధరించిన ఆభరణాలకూ బీమా వర్తించేలా చూసుకోవచ్చు. 

అగ్నిప్రమాదం-దొంగతనం: అగ్నిప్రమాదం వంటి సంఘటనలప్పుడు పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం నిర్మాణ వ్యయాన్ని భరిస్తుంది. కొన్నాళ్లపాటు పునరావాసం కోసం అవసరమైన ఖర్చులనూ చెల్లించేలా యాడ్‌ ఆన్‌ పాలసీలు ఉంటాయి. బీమా చేసిన ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు... పోయిన వస్తువుల విలువనూ పాలసీ చెల్లిస్తుంది. 

ఇతరులకు నష్టం: కొన్నిసార్లు ఇంటికి చేస్తున్న మరమ్మతులు, సిలిండర్‌ పేలుడు తదితరాల వల్ల ఇంటి పక్క వారికి, ఇతరులకు నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. ఇలాంటి సందర్భాల్లో థర్డ్‌ పార్టీకి పాలసీ పరిహారం అందిస్తుంది. దీనికోసం పబ్లిక్‌ లయబిలిటీ కవరేజీని ఎంచుకోవాల్సి ఉంటుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని