UPI Now- Pay Later: బ్యాంకు ఖాతాలో డబ్బులేవా..? అయినా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు

UPI Now- Pay Later: ‘బై నౌ పే లేటర్‌’ లానే ‘యూపీఐ నౌ పే లేటర్‌’ సదుపాయాన్ని ఆర్‌బీఐ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి.

Updated : 14 Sep 2023 15:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా యూపీఐ (UPI) చెల్లింపులు చేయాలంటే కచ్చితంగా బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండాల్సిందే.  ఖాతాలో తగినంత డబ్బు లేకపోయినా యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేయొచ్చా? అంటే అవుననే చెప్పాలి. ఇందుకోసం యూపీఐ నౌ పే లేటర్ (UPI Now- Pay Later) సౌకర్యాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకొచ్చింది. దీంతో బ్యాంకులు ముందుగా మంజూరు చేసిన క్రెడిట్‌ లైన్‌ నుంచి డబ్బు ఖర్చు చేయొచ్చు.  ఇప్పటి వరకూ డెబిట్‌ కార్డు ద్వారా బ్యాంకు ఖాతాను యూపీఐ యాప్‌లకు అనుసంధానం చేసి లావాదేవీలు నిర్వహించేందుకు వీలయ్యేది. దీని ప్రకారం ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌ని కూడా యూపీఐకి జత చేసుకునే వీలుంది. అసలు ప్రీ- అప్రూవ్డ్‌ క్రెడిట్‌ లైన్‌ అంటే ఏంటి? దీన్ని వినియోగిస్తే వడ్డీ కట్టాలా..? ఈ సదుపాయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం...

ప్రీ- అప్రూవ్డ్‌ క్రెడిట్‌ లైన్‌ అంటే ఏంటి?

బ్యాంకులు ముందుగా మంజూరు చేసిన  రుణ సౌకర్యాన్ని ప్రీ- అప్రూవ్డ్‌ క్రెడిట్‌ లైన్‌ అంటారు. దీన్నే ప్రీ శాంక్షన్డ్‌ రుణాలు అని పిలుస్తారు. అచ్చం ఇది ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం లాంటిదే. గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm), మొబిక్విక్‌ (MobiKwik), మొబైల్ బ్యాంకింగ్‌ యూపీఐ అప్లికేషన్ల వంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించొచ్చు. ఈ క్రెడిట్‌ లైన్‌ను అందించటానికి బ్యాంకులు ముందుగా మీ అనుమతి తీసుకుంటాయి. బ్యాంకులు ఆమోదించిన తర్వాత UPI ద్వారా ఆ డబ్బును ఖర్చు చేయొచ్చు. ఈ డబ్బు వినియోగంపై నిర్దిష్ట పరిమితి ఉంటుంది. అలాగే గడువు తేదీలోగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ లైన్‌ సదుపాయాన్ని కొన్ని బ్యాంకులు ఉచితంగా డబ్బును అందిస్తే.. మరికొన్ని మాత్రం వడ్డీని వసూలు చేస్తాయి. అందిరికీ సుపరచితమైన ‘బై నౌ పే లేటర్‌ (buy now and pay later) సదుపాయంలా ఇది పనిచేస్తుంది.

రుణం చెల్లించిన 30 రోజుల్లోగా ఆస్తి పత్రాలు వెనక్కి ఇవ్వండి

ఛార్జీలు ఉంటాయా..?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తాజా ప్రకటన తర్వాత చాలా బ్యాంకులు తమ యూజర్లకు క్రెడిట్‌ లైన్‌ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. క్రెడిట్ పరిమితి, క్రెడిట్‌ వ్యవధి, వడ్డీ రేటు వంటి బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్‌ ఖర్చు చేసిన క్రెడిట్ మొత్తంపై వడ్డీని వసూలు చేస్తుంది. అదే ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్‌ అయితే నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ డబ్బును వాడితే దానిపై సర్వీస్‌ ఛార్జీ విధిస్తుంది.

ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తమ కస్టమర్‌కు రూ.50వేల క్రెడిట్ పరిమితిని అందిస్తోందనుకుందాం. సదరు కస్టమర్‌ క్రెడిట్ లైన్ నుంచి 10 రోజులకు గాను రూ.5వేలు ఖర్చు చేశారనుకుందాం. తీసుకున్న ఆ సొమ్ముకు గానూ బ్యాంకు సాధారణ వడ్డీ వసూలు చేస్తుంది. తీసుకున్న రోజులకు గానూ వడ్డీని లెక్కించి ప్రీ-అప్రూవ్డ్‌ ఖాతా నుంచి తీసుకుంటుంది. అలా తీసుకున్న మొత్తం, వడ్డీ మొత్తాన్ని నెలాఖరులో చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణం చేత గడువు ముగిసిన మూడు రోజుల్లోపు వడ్డీని చెల్లించకపోతే సదరు బ్యాంకు మీ సేవింగ్స్‌/ కరెంట్‌  ఖాతా నుంచి డబ్బులు తీసుకుంటుంది.

ప్రస్తుతం ఉన్న బై నౌ పే లేటర్‌ ఆప్షన్‌తో ఫిన్‌టెక్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలే గుత్తాధిపత్యం కలిగివున్నాయి. ఆర్‌బీఐ తీసుకొచ్చిన ఈ విధానంతో కమర్షియల్‌ బ్యాంకులు కూడా సులువుగా రుణ సదుపాయాన్ని కస్టమర్లకు అందించేందుకు వీలుంటుంది. ప్రస్తుతానికి మర్చంట్‌ చెల్లింపులకే  బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. త్వరలో వ్యక్తులకు పంపించే సదుపాయాన్నీ బ్యాంకులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాంకులు  కస్టమర్‌కు రుణ పరిమితిని అందిస్తాయి. క్రెడిట్‌ కార్డు అందుకోలేని వారికి  ఈ సదుపాయం ప్రయోజనకరంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని