New Year 2022: కొత్త ఏడాది మీ ఆర్థిక తీర్మానాలేంటి? ఇవి ప్రయత్నిస్తున్నారా?

 ఇప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్య, ట‌ర్మ్ బీమా లేక‌పోయినా, త‌గినంత క‌వ‌రేజ్ లేక‌పోయినా ఈ  కొత్త ఏడాదిలో వీటిపై దృష్టిపెట్టండి.

Published : 02 Jan 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చేసింది. ఈ ఏడాదిలో ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? అనే దానిపై అంద‌రూ కొన్ని తీర్మానాలు (రిజల్యూషన్స్‌) తీసుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం చేయడం, డైట్ పాటించ‌డం, కుటుంబంతో స‌మ‌యం గ‌డ‌ప‌డం.. ఇలా ఎవ‌రి వ్య‌క్తిగ‌త జీవ‌నానికి త‌గిన‌ట్లు వారు కొత్త నిర్ణ‌యాలు తీసుకుని కొత్త సంవ‌త్స‌రంతో పాటు మంచి అల‌వాట్ల‌ను కూడా జీవితంలోకి ఆహ్వానిస్తుంటారు. ఇదేవిధంగా ఆర్థికంగానూ కొన్ని నిర్ణ‌యాలు తీసుకోవాలి. చాలామంది ఆర్థిక విష‌యాల గురించి పెద్దగా ఆలోచించ‌రు. వారికి వ‌చ్చే డ‌బ్బు పొదుపు చేసుకునేంత‌గా లేద‌నేది వారి భావన. తక్కువ ఆదాయం పొందుతున్న‌ప్పుడు త‌క్కువ మొత్తంలో మ‌దుపు చేసినా సరిపోతుంది. ఆదాయానికి త‌గిన‌ట్లుగా ఈ కొత్త ఏడాదిలో కొన్ని కొత్త నిర్ణ‌యాలు తీసుకోండి.

మిమ్మ‌ల్ని మీరే ప్ర‌శ్నించుకోండి: గ‌డిచిన కాలం మ‌న‌కు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. గతంలో చూసిన అనుభ‌వాలు, నేర్చుకున్న పాఠాలను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటే.. భ‌విష్య‌త్‌కు త‌గిన‌ ప్ర‌ణాళిక రూపొందించుకోగ‌ల‌మ‌ని అంటుంటారు ఆర్థిక నిపుణులు. గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో (2020, 2021) ఎన్న‌డూ లేనివిధంగా కరోనా పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ  సమయంలో మీకు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? కొవిడ్‌-19 ప్ర‌భావం మీ ఆర్థిక ల‌క్ష్యాల‌పై ఎంత వ‌ర‌కు ప్ర‌భావం చూపించింది? ఆదాయం, ఖ‌ర్చులు పెరిగియా? త‌గ్గాయా? అని మిమ్మల్ని మీరే ప్ర‌శ్నించుకోండి. అప్పుడే కొత్త ఏడాదిలో సాధించ‌గ‌లిగే వాస్త‌విక‌ తీర్మానాలు చేయ‌గ‌ల‌రు.

బీమా: కొవిడ్‌-19 ఆరోగ్య బీమా ప్రాముఖ్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసింది. ఈ స‌మయంలో ఆరోగ్య బీమా లేనివారు ఆసుప‌త్రి ఖ‌ర్చుల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా కొవిడ్‌-19 భయాలు వదల్లేదు. కొత్తగా ఒమిక్రాన్‌ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ దీన్ని ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య బీమా విషయంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కుటుంబ ఆరోగ్య అవ‌స‌రాల‌కు స‌రిపోయే క‌వ‌రేజ్‌తో ఆరోగ్య బీమాను తీసుకోవాలి. ఇటువంటి అనిశ్చితి ప‌రిస్థితుల్లో ట‌ర్మ్ బీమా కూడా త‌ప్ప‌క తీసుకోవాలి. సంపాదించిన వ్య‌క్తి అనుకోకుండా మ‌ర‌ణిస్తే కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక మంచి టర్మ్ పాలసీ ఉన్నట్టయితే ఇది కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుంది. అందువ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్య, ట‌ర్మ్ బీమా లేక‌పోయినా, త‌గినంత క‌వ‌రేజ్ లేక‌పోయినా ఈ కొత్త ఏడాదిలో వీటిపై దృష్టిపెట్టండి.

అత్య‌వ‌స‌ర నిధి: అనుకోకుండా సంపాద‌న ఆగిపోయినా.. ఏ కారణం చేత‌నైనా సంపాద‌న త‌గ్గినా కుటుంబ ఖ‌ర్చుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాల్సిన బాధ్యత సంపాదించే వ్య‌క్తిపైనే ఉంటుంది. అందువ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేయ‌క‌పోతే ఈ తీర్మానం తీసుకోండి. ఇందుకోసం డ‌బ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టొచ్చు. మీ వ‌ద్ద‌ కనీసం ఆరు నెలల కుటుంబ ఖ‌ర్చుల‌కు స‌రిపోయే నగదు నిల్వ ఉండాలి.

అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు క‌త్తెర‌: అత్య‌వ‌స‌ర నిధి ఏర్ప‌రుచుకునేందుకు కొత్త‌గా డ‌బ్బు ఎక్క‌డ్నుంచి వ‌స్తుంద‌ని అనుకుంటున్నారా? అయితే మీ అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించుకోండి. జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోండి. అప్పుడు పొదుపు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్‌లు, హోట‌ళ్ల‌లో భోజనం, విదేశీ ప‌ర్య‌ట‌న‌లు, సినిమాలు, విందు, వినోదాలు వంటివి అవ‌స‌ర‌మైన మేర‌కు త‌గ్గించుకుంటే అత్య‌స‌ర నిధి ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే కేవ‌లం అవ‌స‌ర‌మైన మేర‌కు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టి, అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించుకుంటే మంచిద‌ని విశ్లేష‌కుల భావ‌న‌. ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయినీ లెక్కించుకోవాలి. అవ‌స‌రమైన‌, అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌ను జాబితా వేసుకోవాలి. చిన్న చిన్న ఖ‌ర్చులు త‌గ్గించుకుంటే ఎంత ఆదా అవుతుందో తెలుసుకంటే మీరే ఆశ్చ‌ర్య‌పోతారు. కాబ‌ట్టి అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు క‌త్తెర వేసి పొదుపుతో కొత్త సంవ‌త్స‌రాన్ని ఆహ్వానించండి. ప్రతి ఖర్చునీ ఒక పుస్తకంలో తెలపడం మంచి పధ్ధతి. ప్రతి నెలా ఖర్చులను పరిశీలిస్తే ఎక్కడ ఎక్కువగా ఖర్చు పెడుతున్నారో అర్థం అవుతుంది.

అప్పుల జోలికి పోవ‌ద్దు: ఆర్థిక జీవ‌నానికి అప్పులు అంత మంచివి కావు. కానీ వ్య‌క్తులు వారి ఇష్టాల‌ను, ఆస‌క్తుల‌ను నెరవేర్చుకోవ‌డానికి అప్పులు చేయ‌డం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. జీరో వ‌డ్డీ రేట్లు, క్రెడిట్ కార్డులు పెర‌గ‌డంతో సుల‌భంగా అప్పు తీసుకొని నెల‌వారీగా చెల్లిస్తున్నారు. ఒక్కోసారి ఇవి న‌ష్టాల‌కు దారితీయొచ్చు. ఈ కొత్త సంవ‌త్స‌రంలో రుణాలు తీసుకోవ‌ద్ద‌ని తీర్మానించుకోండి. అయితే ఇప్ప‌టికే ఉన్న రుణాల‌కు ఈఎమ్ఐ చెల్లిస్తుంటే వాటిని పూర్తి చేయ‌డ‌మే ఒక తీర్మానంగా పెట్టుకోండి. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో రుణాలు తీసుకుంటే ఫ‌ర్వాలేదు. కానీ ల‌గ్జ‌రీల కోసం రుణం తీసుకోవ‌ద్ద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉన్న రుణాల‌ను ముందుగా చెల్లించండి. క్రెడిట్ కార్డు రుణాల‌పై వార్షికంగా 36-48 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ప‌డుతుంది. వ్య‌క్తిగ‌త రుణాల‌పై 12-24 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఈ రుణాలు ఉంటే వీలైనంత త్వ‌ర‌గా చెల్లించాలి. క్రెడిట్ కార్డు లేదా వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఈఎమ్ఐ రూపంలో చెల్లిస్తూ డ‌బ్బును పెట్టుబ‌డుల‌కు ఉప‌యోగించ‌డం అంత తెలివైన ఆలోచ‌న కాదు. ఎందుకంటే రుణాల‌కు చెల్లించే వ‌డ్డీ మొత్తం పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డి కంటే ఎక్కువ‌గా ఉంటుంది. క్రెడిట్ కార్డుల‌పై చెల్లించాల్సిన మొత్తం మీ ఒక నెల ఆదాయం కంటే ఎక్కువ‌గా ఉంటే మీ పెట్టుబ‌డుల నుంచి కొంత ఉప‌సంహ‌రించుకొని చెల్లించ‌డం మంచిది.

స‌మీక్షించండి: కొత్త ఏడాదిలో ఒక‌సారి మీ పోర్ట్‌ఫోలియో స‌మీక్షించండి. గ‌త ఏడాదిలో ఐపీఓలు, ఎన్ఎఫ్ఓల హ‌వా న‌డిచింది. దీంతో చాలా మంది కొత్త స్టాక్స్‌ని కొనుగోలు చేశారు. ఫోర్ట్‌ఫోలియో అస్త‌వ్య‌స్తం కాకుండా స‌మీక్షించండి. పెట్టుబ‌డులు పెట్టేవారు ద్రవ్యోల్బణాన్ని మించి రాబ‌డులు ఉండేలా చూసుకోవాలి. మ‌దుపు చేసేముందు ఆర్థిక నిపుణ‌ల‌ను సంప్ర‌దించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని