Health Insurance: సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎలాంటి ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేయాలి?

అనేక సీనియ‌ర్ సిటిజ‌న్ మెడిక్లెయిమ్ పాల‌సీలు ప‌రిమితులు, ఉప ప‌రిమితులతో వ‌స్తాయి.

Updated : 03 Aug 2022 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృద్ధుల‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బందులు పెడుతుంటాయి. వారు ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌డం అనేది ఖ‌ర్చుతో కూడిన వ్య‌వ‌హారం. కానీ సంపాదించ‌లేని వ‌య‌సులో వైద్య ఖ‌ర్చులు పెర‌గ‌డానికి దారితీసే అనేక ఆరోగ్య సంబంధిత స‌వాళ్ల‌ను వీరు ఎదుర్కొంటారు. కాబట్టి ప్ర‌తి సంవ‌త్స‌రం వైద్య ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతున్నందున స‌రైన ఆరోగ్య బీమా పాల‌సీ వృద్ధుల‌కెంతో అవ‌స‌రం.

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 2 ర‌కాల ఆరోగ్య బీమా పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. 65 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో కూడా పాల‌సీని తీసుకోవ‌చ్చు. ఇది ఖ‌రీదైన‌ది కానీ విస్తృత ఆరోగ్య బీమా క‌వ‌రేజీని అందిస్తుంది. రెండోది సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కి ఇచ్చే నిర్దిష్ట పాల‌సీలు. ఈ పాల‌సీలలో ప్ర‌యోజ‌నాలు త‌క్కువే ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేసే ముందు సీనియ‌ర్ సిటిజ‌న్లు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్య‌మైన జాగ్ర‌త్త‌లు చూద్దాం..

బీమాలో ప్ర‌వేశం: కొన్ని బీమా కంపెనీలు ఆరోగ్య పాల‌సీలో ప్ర‌వేశం, పున‌రుద్ధర‌ణ కోసం గ‌రిష్ఠ వ‌య‌స్సుపై ప‌రిమితిని విధించాయి. కాబ‌ట్టి ఇప్ప‌టికే ఉన్న బీమాని స‌కాలంలో పున‌రుద్ధరించ‌డమే కాకుండా జీవిత కాల పున‌రుద్ధ‌ర‌ణ అవ‌కాశ‌ముండే పాల‌సీని తీసుకుంటే మంచిది. అయితే, పాల‌సీ ప్రీమియం ఎక్కువే ఉంటుంది.

నిరీక్ష‌ణ వ్య‌వ‌ధి: ఆరోగ్య బీమా కంపెనీలు నిర్దిష్ట కాల వ్య‌వ‌ధికి నిర్దిష్ట వ్యాధుల‌కు క‌వ‌ర్‌ని ప‌రిమితం చేస్తాయి. ఇది సాధార‌ణంగా 2 నుంచి 4 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు నిరీక్ష‌ణ వ్య‌వ‌ధి జాబితాలో త‌క్కువ సంఖ్య‌లో అనారోగ్యాలు ఉన్న‌, త‌క్కువ నిరీక్ష‌ణ వ్య‌వ‌ధితో వైద్యాన్ని అందించే బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేయాలి.

స‌హ‌-చెల్లింపు: ఈ నిబంధ‌న ప్ర‌కారం క్లెయిమ్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌లో కొంత శాతాన్ని బీమా చేసిన వ్య‌క్తి భ‌రించాలి. పాల‌సీని కొనుగోలు చేసే స‌మ‌యంలోనే స‌హ‌-చెల్లింపు ఎంత ఉంటుంద‌నేది నిర్ణ‌యిస్తారు. ఆమోదించిన‌ క్లెయిమ్ మొత్తంలో 20-50% కూడా స‌హ‌-చెల్లింపు ఉండ‌వ‌చ్చు. కాబ‌ట్టి, క‌నీస లేదా స‌హ‌-చెల్లింపులు లేని బీమా క‌వ‌రేజీని తీసుకోవ‌డం మంచిది.

మిన‌హాయింపుల జాబితా: శాశ్వ‌త మిన‌హాయింపుల జాబితాలో పేర్కొన్న వ్యాధులకు చికిత్స స‌మ‌యంలో చేసే నిర్దిష్ట ఖ‌ర్చుల కోసం బీమా కంపెనీలు క్లెయిమ్‌ను అంగీక‌రించ‌వు. కాబ‌ట్టి, పాల‌సీ తీసుకునేట‌ప్పుడే ఏయే వ్యాధులు మిన‌హాయించారో పాల‌సీ డాక్యుమెంట్‌లో చూడండి. మిన‌హాయిపులు లేని (లేక‌) అతి త‌క్కువ సంఖ్య‌లో మిన‌హాయింపులు ఉన్న బీమా పాల‌సీని తీసుకోండి. 

క్లెయిమ్ ప‌రిమితులు: ఆరోగ్య బీమా సంస్థ.. బీమా చేసిన వ్య‌క్తి తీసుకున్న నిర్దిష్ట గ‌ది అద్దెపై ప‌రిమితిని విధించ‌వ‌చ్చు. దీంతో బీమా చేసినవారు త‌ప్ప‌నిస‌రిగా ఆ ప‌రిమితి మేర అద‌న‌పు ఖ‌ర్చును భ‌రించాలి. అనేక సీనియ‌ర్ సిటిజ‌న్ మెడిక్లెయిమ్ పాల‌సీలు ప‌రిమితులు, ఉప ప‌రిమితులతో వ‌స్తాయి. బీమా కంపెనీ బీమా హామీతో సంబంధం లేకుండా ఆసుపత్రి గ‌ది అద్దెకు రోజుకు 1% చొప్పున పరిమితి విధించవచ్చు. ఉదా: రూ.5 ల‌క్ష‌ల హామీతో బీమా పాల‌సీ ఉంద‌నుకుంటే, గ‌ది అద్దెకి రోజుకు రూ.5 వేలే (1%) బీమా కంపెనీ చెల్లిస్తుంది. అంత‌క‌న్నా ఎక్కువైతే పాల‌సీదారుడే భ‌రించాలి. ఇలాంటి ప‌రిమితులు లేని బీమా పాల‌సీని క‌లిగి ఉండ‌టం మేలు.

పున‌రుద్ధర‌ణ ప్ర‌యోజ‌నం: సీనియ‌ర్ సిటిజ‌న్లు ఒక్కోసారి ఒకే సంవ‌త్స‌రంలో అనేక సార్లు ఆసుప్ర‌తుల‌లో చేరే అవ‌స‌రం ఉండొచ్చు. అటువంట‌ప్పుడు మొదటి సారికే పాలసీ మొత్తం అయిపోవచ్చు. పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌యోజ‌నం ఉన్న పాల‌సీ క‌లిగి ఉంటే పాల‌సీ మొత్తానిక‌న్నా అద‌న‌పు క్లెయిమ్‌కి అర్హ‌త ఉంటుంది. ఉదా: ఒక వ్యక్తి రూ.5 లక్షల బీమా హామీతో పాలసీ తీసుకున్నాడనుకుందాం. ఒక ఏడాదిలో మొద‌టి క్లెయిమ్‌లో రూ.5 ల‌క్ష‌ల మూల బీమా మొత్తాన్ని పూర్తి చేసిన‌ట్ల‌యితే, అదే సంవ‌త్స‌రంలో 2వ క్లెయిమ్‌ అవసరం పడితే, రూ.5 ల‌క్ష‌ల‌ మొత్తాన్ని మళ్లీ పునరుద్ధరిస్తారు. ఇటువంటి పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌యోజ‌న‌మున్న పాల‌సీ తీసుకోవ‌డం మంచిది.

ఆరోగ్య ప‌రీక్ష‌లు: వృద్ధాప్య రోగుల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా ఆరోగ్య ప‌రీక్ష‌లు అవ‌స‌రం. కానీ, కొన్ని బీమా కంపెనీలు ఈ ప‌రీక్ష‌ల‌కు సీలింగ్/నిబంధ‌న‌లు విధిస్తాయి. ఆరోగ్య ప‌రీక్ష‌ల ఖ‌ర్చుల‌ను పాల‌సీదారుడే భ‌రించాల‌ని నిబంధ‌న విధిస్తాయి. అందుచేత ఆరోగ్య ప‌రీక్ష‌ల‌ ఖ‌ర్చుల‌ను పూర్తిగా భ‌రించే ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవాలి.

ప్రీ-పోస్ట్‌ ఖ‌ర్చులు : ఆసుప‌త్రిలో చేరే ముందు, ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన త‌ర్వాత ఖ‌ర్చులకు ప‌రిమితులు ఉంటాయి. సాధార‌ణంగా ప్రీ-హాస్పిట‌లైజేష‌న్ అర్హ‌త 30-45 రోజులు, పోస్ట్‌-హాస్పిట‌లైజేష‌న్ కోసం 60-90 రోజులు అయ్యే మెడిక‌ల్ ఖ‌ర్చుల‌ను బీమా కంపెనీయే భ‌రించేట‌ట్లుగా ఉండే పాల‌సీ సీనియ‌ర్ సిటిజ‌న్లు తీసుకోవాలి.

డే-కేర్ క్లెయిమ్‌ల సంఖ్య: కొన్ని అనారోగ్యాల సేవ‌లు ఆసుప‌త్రిలో 24 గంట‌ల‌లోపు పూర్త‌వుతాయి. ఆసుప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అయితే, కొన్ని బీమా కంపెనీలు ఈ సేవ‌ల‌ను త‌క్కువ సంఖ్య‌కు ప‌రిమితం చేస్తాయి. పాల‌సీ తీసుకునేట‌ప్పుడే అందుబాటులో ఉన్న డే-కేర్ సౌక‌ర్యాల సంఖ్య‌ను తెలుసుకోండి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని