Foreign Investors: భారత్‌పై విదేశీ మదుపర్ల ఆసక్తికి కారణాలివేనా?

2021 అక్టోబరు - 2022 జూన్‌ మధ్య విదేశీ మదుపర్లు (FII) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అయితే, జులై నుంచి పరిస్థితి మారింది. పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కారణాలేంటో తెలుసుకుందాం..

Published : 22 Aug 2022 13:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2021 అక్టోబరు - 2022 జూన్‌ మధ్య విదేశీ మదుపర్లు (FII) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాదాపు 30 బిలియన్‌ డాలర్ల నిధుల్ని వెనక్కి తీసుకున్నారు. జులై నుంచి పరిస్థితులు మారాయి. జులైలో నికరంగా దాదాపు రూ.5,000 కోట్లు భారత మార్కెట్లలోకి తరలించగా.. ఆగస్టులో అది మరింత జోరందుకుంది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.44,500 కోట్లు మన దేశ ఈక్విటీల్లోకి మళ్లించారు. 

2022 ఆరంభం నుంచి చూసుకుంటే.. తైవాన్‌ తర్వాత అత్యధికంగా విదేశీ పెట్టుబడులు తరలివెళ్లింది భారత్‌ నుంచే. అదే బ్రెజిల్‌ మార్కెట్‌లలోకి మాత్రం 10 బిలియన్‌ డాలర్ల నిధులు వచ్చి చేరాయి. మరి ఇలా ఒక్కసారిగా భారత మార్కెట్లపై విదేశీ మదుపర్లకు మక్కువ పెరగడానికి కారణమేంటి? అనే దానిపై పలువురు ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేయనున్న భారత్‌లో అవకాశాలను చేజార్చుకుంటున్నామనే అభిప్రాయం విదేశీ మదుపర్లలో కలిగి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో 2021లో భారీగా పెరిగిన సూచీలు ఈ మధ్య కాలంలో దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో భారత స్టాక్స్‌ ధరలు ఆకర్షణీయంగా మారాయని కూడా ఎఫ్‌ఐఐలు భావించి ఉండొచ్చని మరో విశ్లేషణ.

అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండడంతో రానున్న నెలల్లో రేట్ల పెంపు వేగాన్ని తగ్గించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విదేశీ మదుపర్ల వైఖరిని మార్చిందని నిపుణులు చెబుతున్నారు. వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసే అవకాశం ఉండడం; కమొడిటీ, చమురు ధరలు దిగిరావడం; వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా ఉండడం కూడా విదేశీ పెట్టుబడులు తిరిగి భారత్‌లోకి రావడానికి కారణమని బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ తమ నివేదికలో తెలిపింది. 

ఈ పరిణామాలకు దేశీయ సంస్థాగత మదుపర్లు, రిటైల్‌ మదుపర్ల కొనుగోళ్లు జత కావడం నిఫ్టీ, సెన్సెక్స్‌ సూచీల రాణింపునకు ప్రధాన కారణమని బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ పేర్కొంది. జులై ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఈ రెండు ప్రధాన సూచీలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఇక నుంచి విదేశీ మదుపర్ల భారీ అమ్మకాలు ఉండకపోవచ్చునని బీఓఎఫ్‌ఏ తెలిపింది. అయితే, మధ్యలో స్వల్ప దిద్దుబాటు మాత్రం ఎదురయ్యే అవకాశం ఉందని మరికొంత మంది మార్కట్‌ విశ్లేషకులు వెల్లడించారు. దాన్ని కొనుగోళ్లకు అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. తైవాన్‌-చైనా ఉద్రిక్తతలు, అంచనాలకు భిన్నంగా రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వు దూకుడుగా వ్యవహరించడం సూచీలకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని