Joint Home Loans: ఉమ్మ‌డి గృహ రుణానికి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

సాధార‌ణంగా ఉమ్మ‌డి రుణాలు ఎక్కువుగా భార్య‌భ‌ర్త‌లు క‌లిపి తీసుకుంటారు.

Updated : 29 Aug 2022 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంపాద‌న మొద‌లైన త‌ర్వాత ఎవ‌రైనా వాళ్ల‌కుండే మిగులు ఆదాయాన్ని బ‌ట్టి ఇంటి కొనుగోలుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఆ మిగులు ఆదాయం ఈఎంఐకి చెల్లించ‌డానికి కచ్చితంగా స‌రిపోతుంద‌ని చెప్ప‌లేం. అంతేకాకుండా ఒక ఇంటిని ఒక్క‌రే కొనుగోలు చేయాల‌నేం లేదు. ఇంటిలో ఒక‌రు క‌న్నా ఎక్కువ మంది సంపాద‌న ప‌రులున్న‌ప్పుడు ఉమ్మ‌డి గృహ రుణాల‌ను ఎంచుకోవచ్చు.

ఉమ్మ‌డి రుణంతో ఉప‌యోగాలు

ఒక‌రి క్రెడిట్ స్కోరు త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదా రుణ అర్హ‌త త‌క్కువ‌గా ఉన్న సంద‌ర్భాల్లో కూడా ఉమ్మ‌డి గృహ రుణాన్ని బ్యాంకులు త్వ‌ర‌గా మంజూరు చేస్తాయి. సాధార‌ణంగా ఉమ్మ‌డి రుణాలు ఎక్కువగా భార్యాభ‌ర్త‌లు క‌లిపి తీసుకుంటారు. ఈ ఇద్ద‌రి ఆదాయాలు క‌ల‌వ‌డం వ‌ల్ల అధిక రుణాన్ని పొందొచ్చు.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలుంటాయి

మీరు స‌హ‌-రుణ గ్ర‌హీత‌, ఆస్తి ఉమ్మ‌డి య‌జ‌మాని అయితే మీరు గృహ రుణంపై వివిధ ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. ఆస్తికి స‌హ‌-య‌జ‌మాని అయిన ప్ర‌తి స‌హ‌-రుణ‌గ్ర‌హీత‌, అర్హ‌త ఉన్న ఆర్థిక సంవ‌త్స‌రంలో గృహ రుణ వ‌డ్డీ చెల్లింపునకు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 24 కింద రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం పొందొచ్చు. రుణ‌గ్ర‌హీత‌లిద్ద‌రూ కలిపి రూ. 5 ల‌క్ష‌ల వార్షిక వ‌డ్డీ చెల్లిస్తే.. ఒక్కొక్క‌రికి రూ. 2 ల‌క్ష‌ల ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం ఉంటుంది. 

మీ స‌హ‌-రుణ గ్ర‌హీత‌ను ఎలా ఎన్నుకోవాలి?

ద‌గ్గ‌రి బంధువులు, కుటుంబ స‌భ్యులు గృహ రుణంలో మీతో స‌హ‌-రుణ‌గ్ర‌హీత‌గా ఉండ‌వ‌చ్చు. జీవిత భాగ‌స్వామి, కొడుకు, తండ్రి, సోద‌రులు.. ఇంకా తండ్రి/త‌ల్లితో పెళ్లికాని కుమార్తెలు స‌హ‌-గృహ రుణాన్ని తీసుకోవ‌చ్చు. అయితే సోద‌రీమ‌ణులు, స్నేహితులు, దూర‌పు బంధువులు స‌హ‌-రుణ‌గ్ర‌హీత‌గా అనుమ‌తి ఉండ‌దు.

ఉమ్మ‌డి రుణంతో ఇబ్బందులుంటాయా?

చెల్లింపుల సమయంలో ఏ ఒక్కరికి అత్యవసర పరిస్థితి వల్ల ఈఎంఐ చెల్లింపుల్లో ఆలస్యం అయినా లేక చెల్లింపు చేయలేకపోయినా ఇద్ద‌రి క్రెడిట్ స్కోరుకు భ‌విష్య‌త్తులో ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా, స‌హ‌-రుణ‌గ్ర‌హీత‌లైన‌ త‌ల్లిదండ్రులు, సోద‌రుల‌తో వివాదాలు జ‌ర‌గ‌వ‌చ్చు. అందుచేత మీ స‌హ‌-రుణ‌గ్ర‌హీత‌ను వివేకంతో ఎంచుకోవాలి.

జీవిత భాగ‌స్వామి విడాకులు, మ‌ర‌ణం

ఉమ్మ‌డి గృహ రుణం పొందిన త‌ర్వాత భ‌విష్య‌త్‌లో భాగ‌స్వామితో విడిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటే రుణాన్ని తిరిగి చెల్లించ‌డం స‌మ‌స్య‌గా మారుతుంది. ఎందుకంటే రుణ ద‌ర‌ఖాస్తుదారులంద‌రికీ బ‌కాయి ఉన్న మొత్తాన్ని చెల్లించ‌డానికి స‌మానంగా బాధ్య‌త ఉంటుంది. విడాకుల త‌ర్వాత జీవిత భాగ‌స్వాముల్లో ఒక‌రు ఈఎంఐలు చెల్లించ‌డం ఆపివేస్తే, తిరిగి చెల్లించే భారం ఇత‌ర ద‌ర‌ఖాస్తుదారుపై ప‌డుతుంది. ద‌ర‌ఖాస్తుదారు మొత్తం ఆస్తిపై యాజ‌మాన్యాన్ని పొంద‌కుండానే ఈఎంఐలను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రుణం చెల్లించ‌డంలో ఇబ్బందుంటే రుణ‌గ్ర‌హీత‌లిద్ద‌రికీ చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అందువ‌ల్ల భార్యాభ‌ర్త‌లు ఉమ్మ‌డిగా ఇంటిని కొనుగోలు చేసే ముందు నిపుణుల సాయం తీసుకుంటే మంచిది.

ఇంటిని విక్ర‌యించేట‌ప్పుడు ఇబ్బంది

ఉమ్మ‌డి రుణం విష‌యంలో ఈఎంఐలను ఎవ‌రు చెల్లించార‌నే దానితో సంబంధం లేకుండా ఇంటి యాజ‌మాన్యం స‌మానంగా ఉంటుంది. అలాగే, ఒక‌రి క‌న్నా ఎక్కువ య‌జ‌మానులు ఉన్న‌ప్పుడు, స‌హ‌-య‌జ‌మానులు ఇద్ద‌రూ విక్ర‌యించ‌డానికి అంగీక‌రించే వ‌ర‌కు ఇంటి ఆస్తిని విక్ర‌యించ‌డం క‌ష్టం.

రుణ బీమా క‌వ‌ర్ తీసుకోవాలి

స‌హ‌-రుణ‌గ్ర‌హీత‌తో గృహ రుణం తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌లో ముఖ్య‌మైన‌ది ఈఎంఐ పంచుకోవడం. అయితే, స‌హ‌-రుణ‌గ్ర‌హీత ఆర్థిక లేదా ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి కార‌ణంగా చెల్లించ‌లేక‌పోయినా, అలాగే స‌హ‌-రుణ‌గ్ర‌హీత‌ల‌లో ఒక‌రు ముంద‌స్తుగా మ‌ర‌ణించిన సంద‌ర్భంలో మొత్తం చెల్లింపు బాధ్య‌త మిగిలిన స‌హ‌-రుణ‌గ్ర‌హీత‌కు బ‌దిలీ చేస్తారు. రుణ‌గ్ర‌హీత‌ల జీవితాల‌కు బీమా చేయ‌డం ద్వారా మీరు అలాంటి సమస్యలను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని