Two-wheeler loan: టూ-వీలర్‌ లోన్‌ ఎంత కాలపరిమితితో తీసుకోవాలి?

కొవిడ్‌-19 మూలంగా ప్రజారవాణా వసతులను వినియోగించడానికి ప్రజలు వెనుకాడుతున్నారు. వీలైనంత వరకు వ్యక్తిగత వాహనాలపై ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు....

Updated : 30 Oct 2021 12:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 మూలంగా ప్రజారవాణా వసతులను వినియోగించుకోవడానికి ప్రజలు వెనుకాడుతున్నారు. వీలైనంత వరకు వ్యక్తిగత వాహనాలపై ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు బస్సులు, ఆటోల్లో ప్రయాణించిన మధ్యతరగతి ప్రజలు సొంత వాహనాలు కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలకు డిమాండ్‌ పెరిగింది.

రోజువారీ ప్రయాణాలకు ద్విచక్రవాహనం ఉపయోగకరంగా ఉంటుంది. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువ. ట్రాఫిక్‌లోనూ రయ్‌మంటూ దూసుకెళ్లొచ్చు. పైగా ధర కూడా అందుబాటులో ఉంటుంది. లోన్‌ తీసుకుంటే ఇంకా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అయితే, లోన్ తీసుకునే ముందు ఈఎంఐ, కాలపరిమితి, వడ్డీరేటు అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇందులో కాలపరిమితి చాలా ముఖ్యం. చాలా తెలివిగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

కాలపరిమితి ఎందుకు ముఖ్యమంటే..

తీసుకున్న లోన్‌ను తిరిగి చెల్లించేందుకు కావాల్సిన సమయాన్నే కాలపరిమితి అంటాం. సాధారణంగా ఇది సంవత్సరాల్లో ఉంటుంది. వడ్డీరేటును నిర్ణయించడంలో కూడా కాలపరిమితి ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలా మంది, ఈఎంఐ మొత్తం, వడ్డీరేటుకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. కాలపరిమితిని పెద్దగా పట్టించుకోరు.

కాలపరిమితిని ఎలా ఎంచుకోవాలంటే..

ఏడాది కాలపరిమితి: ఎక్కువ ఈఎంఐ చెల్లించే సామర్థ్యం ఉండి.. తక్కువ వడ్డీరేటు కావాలనుకునే వినియోగదారులకు ఏడాది కాలపరిమితి సరిగ్గా సరిపోతుంది. స్థిర ఆదాయం ఉండి తక్కువ సమయంలో వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారు ఏడాది కాలపరిమితి ఎంచుకోవచ్చు.

రెండేళ్ల కాలపరిమితి: దీన్ని బ్యాలెన్స్‌డ్‌ కాలపరిమితిగా పేర్కొంటుంటారు. మధ్యాదాయ వర్గంలోకి వచ్చే వారికి ఈ కాలపరిమితి సరిపోతుంది. మూడు, నాలుగేళ్ల కాలపరిమితితో పోలిస్తే.. రెండేళ్ల కాలపరిమితికి వర్తించే ఈఎంఐ మొత్తం, వడ్డీరేటు వాహన కొనుగోలుదారులకు అనువుగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతుంటారు. చాలా బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు తమ కస్టమర్లకు రెండేళ్ల కాలపరిమితినే సూచిస్తుంటాయి.

మూడేళ్ల కాలపరిమితి: నెలనెలా వచ్చే ఆదాయాన్ని వివిధ రకాల ఖర్చులకు కేటాయించి.. డబ్బును పొదుపుగా వాడాలనుకునే వారికి ఈ కాలపరిమితి ఉపయోగపడుతుంది. కానీ, తిరిగి చెల్లించే సమయం పెరిగితే.. వడ్డీరేటు కూడా పెరుతుంది.

ఉదాహరణకు.. రూ.లక్ష విలువ చేసే ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశారనుకుందాం! వడ్డీరేటు 12 శాతంగా నిర్ణయించారు. కాలపరిమితి ఏడాది అయితే, నెలకు రూ.9,334 చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా రూ.12,008 వడ్డీ చెల్లిస్తారు. రెండేళ్ల కాలపరిమితితో నెలకు రూ.5,167 చొప్పున రూ.24,008 వడ్డీ, మూడేళ్ల కాలపరిమితితో నెలకు రూ.3,778 రూ.36,008 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాలపరిమితి పెరిగిన కొద్దీ ఈఎంఐ తగ్గుతుంది. కానీ, చెల్లించాల్సిన వడ్డీ మాత్రం పెరుగుతూ పోతుంది. పైగా మనం ఈ ఉదాహరణలో అన్ని కాలపరిమితులకు స్థిరమైన వడ్డీరేటును పరిగణనలోకి తీసుకున్నాం. వాస్తవానికి ఎక్కువ కాలపరిమితికి ఎక్కువ వడ్డీరేటు వర్తిస్తుంది. అలాంటప్పుడు చెల్లించాల్సిన వడ్డీ మరింత పెరుగుతుంది. భవిష్యత్తులో అస్థిర పరిస్థితులు రావొచ్చనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే.. కాలపరిమితి పెరిగిన కొద్దీ వడ్డీరేటును సైతం పెంచుతారు.

వాయిదాల పద్ధతి ఎందుకు?

సులభ వాయిదాల పద్ధతి(ఈఎంఐ) వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాహన ధర మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. వీలును బట్టి ప్రతినెలా కొంత మొత్తం చెల్లిస్తూ వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా చెల్లింపుల వల్ల క్రెడిట్‌ చరిత్ర సైతం మెరుగవుతుంది. దీని వల్ల వ్యక్తిగత రుణాలు, గృహరుణాలు తీసుకోవడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో ద్విచక్రవాహనంపై రుణం తీసుకునేవారికి ఏ కాలపరిమితి సరిగ్గా సరిపోతుందనేది వ్యక్తుల అవసరాలు బట్టి మారుతూ ఉంటుంది. ఇదే సరైన కాలపరిమితి అని నిర్ధారించలేం. అలాగే వడ్డీరేటు, ప్రాసెసింగ్‌ ఫీజు, క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్‌ వంటి వాటిని కూడా రుణం తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని