సైబర్‌ నేరస్థులు మీ గుర్తింపును తస్కరిస్తే

గతంలో సంతకాలు ఫోర్జరీ చేసేవారు. సాంకేతిక యుగంలో దొంగలు తెలివి మీరారు. మన గుర్తింపు ధ్రువీకరణలను దొంగిలించి, ఖాతాల నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారు. మనకు తెలియకుండానే మన పేరుతో రుణాలు తీసుకుంటున్నారు.

Updated : 18 Mar 2024 15:45 IST

గతంలో సంతకాలు ఫోర్జరీ చేసేవారు. సాంకేతిక యుగంలో దొంగలు తెలివి మీరారు. మన గుర్తింపు ధ్రువీకరణలను దొంగిలించి, ఖాతాల నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారు. మనకు తెలియకుండానే మన పేరుతో రుణాలు తీసుకుంటున్నారు. అందుకే పాన్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతా, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో, ఫోన్‌ల ద్వారా మనల్ని సంప్రదించే వారిని అస్సలు నమ్మొద్దు.

గుర్తింపు ధ్రువీకరణ అంటే ఏదో ఒక పత్రం కాదిప్పుడు. ఆర్థికంగా మిమ్మల్ని మోసం చేయడానికి దొంగలకు ఒక ఆయుధంలాంటిది. ఎవరికి వారే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. అప్పుడే మోసానికి గురవ్వకుండా కాపాడుకోగలం.

నివేదికలను చూసుకోండి..

మన పేరుమీద ఎన్ని ఖాతాలున్నాయి? రుణాలు, కార్డులు ఎన్ని ఉన్నాయనే సంగతులను సులభంగా తెలుసుకోవాలంటే.. క్రెడిట్‌ నివేదికలు తోడ్పడతాయి. మన దేశంలో ప్రధానంగా మూడు క్రెడిట్‌ బ్యూరోలున్నాయి. అవి సిబిల్‌, ఎక్స్‌పీరియన్‌, ఈక్విఫాక్స్‌. ఏడాదికోసారైనా ప్రతి క్రెడిట్‌ బ్యూరో వద్ద మీ క్రెడిట్‌ నివేదికలను తీసుకోండి. వాటిని విశ్లేషించి, ఏమైనా అనధికార ఖాతాలున్నాయా చూసుకోండి. ఒకవేళ అలాంటివి కనిపిస్తే వెంటనే క్రెడిట్‌ బ్యూరోలకు ఫిర్యాదు చేయండి. దర్యాప్తు చేసి, మీ నివేదికల్లో ఆ వివాదాస్పద అంశాలు తొలగిస్తారు.

సందేశం వచ్చేలా..

మూడు క్రెడిట్‌ బ్యూరోల్లోనూ ఫ్రాడ్‌ అలర్ట్‌ పెట్టుకోవచ్చు. మీ గుర్తింపు వివరాలను వాడి, మీ పేరుమీద ఏదైనా రుణ దరఖాస్తు వచ్చినా, ఎవరైనా ఖాతా ప్రారంభించేందుకు ప్రయత్నించినా మీకు సందేశం వస్తుంది. దీనివల్ల మోసపోకుండా రక్షణ లభిస్తుంది.

సాధారణంగా మీ గుర్తింపు వివరాలను తస్కరించిన సైబర్‌ నేరస్థులు వెంటనే మీ సమాచారాన్ని వినియోగించరు. కొన్నిరోజులు, నెలలు వేచి చూస్తారు. ఆ తర్వాతే వారి పని కానిస్తారు. కాబట్టి, ఎప్పటికప్పుడు మీ క్రెడిట్‌ నివేదికలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

భద్రంగా ఉంచుకోండి..

ఆన్‌లైన్‌లోనూ, సామాజిక వేదికల ద్వారా పాన్‌, ఆధార్‌ను పంపించడం చాలా సర్వసాధారణం. దీన్ని అరికట్టాలి. మరీ అత్యవసరం ఉన్నప్పుడు, తెలిసిన వ్యక్తులకు మాత్రమే ఈ వివరాలు పంపించాలి. బ్యాంకు ఆన్‌లైన్‌ ఖాతాలకు సంఖ్యలు, గుర్తులతో బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోండి. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ మీ లాగిన్‌ సమాచారం, కార్డు సీవీవీ, ఓటీపీలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అడగదు. ఇ-మెయిల్స్‌లో వచ్చిన లింకులపై క్లిక్‌ చేయొద్దు. సమాచారం కోరుతూ బ్యాంకు నుంచి ఎలాంటి ఇ-మెయిళ్లూ రావు. సునిశిత సమాచారం ఎప్పుడూ మీ దగ్గర్నుంచి చేజారకుండా చూసుకోండి. మీ వ్యక్తిగత వివరాలున్న పత్రాలను కనిపించనంతగా చించేశాకే పారేయాలి. అప్పుడే గుర్తింపు వివరాలు తస్కరణకు గురి కాకుండా చూసుకోవచ్చు.


ఇలా చేయండి...

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మీ గుర్తింపు వివరాలు దొంగల చేతికి చేరితే..

పోలీసులకు ఫిర్యాదు: మీ సమీప పోలీస్‌ స్టేషనుకు వెళ్లండి. వివరాలను చెప్పి ఎఫ్‌ఐఆర్‌ (ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌) నమోదు చేయించండి. పోలీసులు దర్యాప్తు మొదలుపెడతారు.

క్రెడిట్‌ ఫ్రీజ్‌: ప్రధాన మూడు క్రెడిట్‌ బ్యూరోలను సంప్రదించడం ద్వారా క్రెడిట్‌ ఫ్రీజ్‌ చేయొచ్చు. దీనివల్ల మీ క్రెడిట్‌ నివేదికను మీ అనుమతి లేకుండా ఎవరూ చూడలేరు. ఇదీ మీ పేరిట దొంగలు ఖాతా   తెరవకుండా ఉపకరిస్తుంది.

బ్యాంకులను సంప్రదించండి: మీ గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్‌) జరిగిందన్న విషయాన్ని మీ ఖాతా ఉన్న బ్యాంకులకు తెలపండి. అపుడు ఏవైనా మోసపూరిత ఖాతాలుంటే రద్దు చేస్తారు. మీ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలేమైనా జరుగుతున్నాయోమో గమనించి చర్యలు తీసుకుంటారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని