PAN Card: ఒక వ్యక్తికి రెండు పాన్‌ కార్డులుంటే..ఏం చేయాలి?

ప్రస్తుతం ఏ చిన్న ఆర్థిక లావాదేవీ చేయాలన్న పాన్‌ కార్డు (PAN) తప్పనిసరి. బ్యాంకు ఖాతా దగ్గర నుంచి ఐటీ రిట‌ర్నుల ఫైలింగ్‌ వ‌ర‌కు అన్నింటికీ పాన్ ఉండాల్సిందే.

Published : 30 Jun 2022 16:11 IST

ప్రస్తుతం ఏ చిన్న ఆర్థిక లావాదేవీ చేయాలన్న పాన్‌ కార్డు (PAN) తప్పనిసరి. బ్యాంకు ఖాతా దగ్గర నుంచి ఐటీ రిట‌ర్నుల ఫైలింగ్‌ వ‌ర‌కు అన్నింటికీ పాన్ ఉండాల్సిందే. మరి ఒక వ్యక్తి రెండు పాన్‌ కార్డులు (నంబర్లు) కలిగి ఉంటే ఏం చేయాలి..? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా..!

ఆదాయ పన్ను చట్టం-1961 సెక్షన్‌ 272B ప్రకారం ఒక వ్యక్తి రెండు పాన్‌కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఆదాయ పన్ను దర్యాప్తులో మీ వద్ద రెండు పాన్‌లు ఉన్నట్లు తేలితే భారీ జరిమానా చెల్లించక తప్పదు. అంతేకాకుండా అధికారులు మీ బ్యాంక్‌ ఖాతాను స్థంబింప చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి మీ వద్ద రెండు పాన్‌కార్టులు కలిగి ఉంటే వెంటనే వెనక్కి ఇచ్చేయండి.

రెండు పాన్‌ కార్డులు ఎలా..? 

* పాన్‌కార్డులో ఎదైనా తప్పులు (కరెక్షన్‌లు) ఉంటే దానిని సరిదిద్దుకోకుండా పలువురు కొత్త దానికి కోసం అప్లై చేస్తుంటారు. ఇది ఒకరకంగా వ్యక్తి రెండు పాన్‌ నంబర్లు కలిగి ఉండటానికి దోహదం చేస్తుంది.

* అలాగే పాన్‌ కార్డు అప్లై చేసినా పలువురికి కొన్ని సందర్భాలలో అవి వచ్చి ఉండవు. తద్వారా మళ్లీ కొత్తగా అప్లై చేస్తుంటారు. ఇలా కాకుండా కొత్త పాన్‌ అప్లై చేసే ముందు పాన్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం మంచింది. 

* మరోవైపు మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత వారి ఇంటి పేరు మార్పులో భాగంగా కొత్త పాన్‌ కోసం దరఖాస్తు చేస్తారు. అయితే, పెళ్లి చేసుకున్నాక పాన్‌కార్డులో కరెక్షన్‌లను సరిచేసుకుంటే సరిపోతుంది. తప్పితే కొత్తవి అవసరం లేదు. 

*  మరీ ముఖ్యంగా కొందరు కేటుగాళ్లు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి రెండు పాన్‌కార్టులను సృష్టించుకుంటారు. ఇలా ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ పాన్‌కార్డులను కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

ఇలా వెనక్కి ఇచ్చేయండి..

అఫ్‌లైన్‌లో..: పాన్‌కార్డు తొలగించడం కోసం ముందుగా మీరు ఫామ్‌ 49Aలో మీ సమాచారం నింపాల్సి ఉంటుంది. అనంతరం దగ్గరలోని యూటీఐ లేదా ఎన్‌సీడీసీఎల్‌ కేంద్రానికి వెళ్లి మీ వివరాలు సమర్పించాలి. 

* అక్కడ పాన్‌కార్డుతోపాటు అధికారులు అడిగిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇంతకంటే ముందుగా ఆదాయ పన్ను శాఖ సంబంధిత అధికారికి లేఖ రాయాల్సి ఉంటుంది. 

* ఆపై డూప్లికేట్‌ పాన్‌ సమర్పించినట్లు రసీదు తీసుకోండి. 

ఇక ఆన్‌లైన్‌లో అయితే మీరు పాన్‌ సర్వీసు పోర్టల్‌లోకి వెళ్లి ‘Change or Correction’పై క్లిక్‌ చేయండి. ఇక్కడ మీ పూర్తి డిటైల్స్‌ ఎంటర్‌ చేసి పాన్‌కార్డును అప్‌డేట్‌ చేసుకోండి. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు