Home Loan: గృహ రుణం వేగంగా మంజూరవ్వాలా? ఇలా చేయండి..

వ్యక్తిగత రుణాలతో పోల్చుకుంటే, గృహ రుణ మంజూరుకు అధిక సమయం పడుతుంది. దీన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలంటే రుణగ్రహీతలు ఏం చేయాలో ఇక్కడ ఉంది.

Published : 31 May 2023 15:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇళ్ల ధరలు లక్షల నుంచి కోట్లకు ఎగబాకడంతో గృహ రుణ సాయం లేకుండా ఈ రోజుల్లో ఇంటిని కొనుగోలు చేయడం దాదాపుగా అసాధ్యం. గృహ రుణాల వడ్డీ రేట్లు చాలా వరకు అందుబాటులో ఉన్నప్పటికీ.. అన్ని గృహ రుణ దరఖాస్తులు మంజూరుకు నోచుకోవు. ఒకవేళ మంజూరైనా కూడా బాగా ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఒక్కోసారి సాధారణ పొరపాటు వల్ల కూడా గృహ రుణ దరఖాస్తు తిరస్కారానికి గురి కావచ్చు. రుణ దరఖాస్తు ప్రాసెస్‌ అయ్యి మంజూరు కావడానికి 3-4 వారాలు పడుతుంది. రుణ మంజూరుకు ఈ అధిక కాలవ్యవధిని తగ్గించుకోవడానికి, తప్పనిసరిగా రుణం మంజూరు అవ్వడానికి రుణగ్రహీతలకు కొన్ని చిట్కాలు లేకపోలేవు. అవేంటో ఇక్కడ చూద్దాం..

క్రెడిట్‌ స్కోరు

ఏ రుణ దరఖాస్తు అయినా రుణ సంస్థలు ముందుగా చూసేది రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరునే. 750+ క్రెడిట్‌ స్కోరు కలిగి ఉంటే రుణ అర్హత మెరుగుపడుతుంది. తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించడమే కాకుండా.. అగ్రశ్రేణి రుణ సంస్థల నుంచి బహుళ రుణ ఆఫర్‌లను పొందడంలో సహాయపడుతుంది. అయితే, ఒక్క రోజులోనే మీ క్రెడిట్‌ స్కోరును నిర్మించడం సాధ్యం కాదని గుర్తుంచుకోండి. మీ ప్రస్తుత స్కోరు స్థాయిలను బట్టి, క్రెడిట్‌ స్కోరును పెంచడానికి 3 నుంచి 24 నెలల వరకు సమయం పడుతుంది. కాబట్టి, మీరు వచ్చే సంవత్సరంలో గృహ రుణాన్ని తీసుకోవాలని ప్లాన్‌ చేస్తే.. ఇప్పటి నుంచే మీ క్రెడిట్‌ స్కోరును పెంచుకోవడానికి కృషిచేయాలి. కనీసం ప్రతి 3-6 నెలలకు ఒకసారి మీ క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేసుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీ క్రెడిట్‌ కార్డు బిల్లులు, ఈఎంఐలను ఎప్పుడూ మిస్ చేయకూడదు. మీ క్రెడిట్‌ కార్డు వినియోగ నిష్పత్తిని 30-40% మించి దాటనీయొద్దు. గృహ రుణం లాంటి పెద్ద మొత్త రుణాలను తీసుకునే ముందు చిన్న రుణాలను పూర్తిగా తీర్చివేయండి.

జాయింట్‌ హోమ్‌ లోన్‌

గృహ రుణాన్ని ఒక్కరుగా కాకుండా ఉమ్మడిగా (సంపాదిస్తున్న జీవిత భాగస్వామి లేదా కుటుంబంలోని ఇతర సంపాదన సభ్యుడితో) దరఖాస్తు చేయడం వల్ల రుణం వేగంగా, ఎక్కువగా కూడా పొందే అవకాశం ఉంది. రెండు ఆదాయాలు ఉన్నందున, రుణ చెల్లింపులు డిఫాల్ట్‌ లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో బ్యాంకులు సాధారణంగా ఉమ్మడి గృహ రుణాలను త్వరగా ఆమోదిస్తాయి. అంతేకాకుండా, ఒక మహిళను సహ-దరఖాస్తుదారుగా చేర్చుకోవడం వల్ల మీరు వడ్డీ రేటుపై రాయితీ పొందొచ్చు.

సుదీర్ఘ కాలవ్యవధి

గృహ రుణం పెద్ద మొత్తంలో ఉండడం వల్ల చెల్లించే ఈఎంఐలు కూడా అధిక మొత్తంలోనే ఉంటాయి. రుణగ్రహీతలు సుదీర్ఘ కాలవ్యవధి (25-30 సంవత్సరాలు)తో గృహ రుణాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల నెలవారీ ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. తద్వారా నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి తగ్గిపోతుంది. బ్యాంకులు కూడా దీర్ఘకాల గృహ రుణ దరఖాస్తులపై ఆసక్తి చూపుతాయి. దీనివల్ల నెలవారీ ఈఎంఐలు డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని బ్యాంకుల అభిప్రాయం. అయితే మొదట్లో ఎక్కువ కాల వ్యవధి కోసం దరఖాస్తు చేసుకున్నా.. మధ్యలో మిగులు నిధులు ఉన్నప్పుడు అదనంగా కొంత బకాయిని ముందే చెల్లించొచ్చు. దీనివల్ల గడువు కన్నా ముందే రుణాన్ని మూసివేయొచ్చు, తద్వారా రుణంపై చెల్లించే వడ్డీని ఆదా చేయొచ్చు. కాలవ్యవధి పెరిగే కొద్దీ చెల్లించే వడ్డీ మొత్తం కూడా పెరుగుతుందని గమనించాలి.

డాక్యుమెంట్స్‌

గృహ రుణం వేగంగా మంజూరు కాకపోవడానికి లేదా తిరస్కరణకు ప్రధాన కారణాలలో అవసరమైన పత్రాలు లేకపోవడం ఒకటి. కాబట్టి, రుణగ్రహీతలు, బ్యాంకుల వెబ్‌సైట్‌ను తనిఖీ చేసి, అన్ని డాక్యుమెంట్‌లను సిద్ధం చేసుకోవాలి. జీతం ఉన్న ఉద్యోగుల విషయంలో పత్రాల జాబితా చాలా సులభం. ఇందులో ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌, జీతం స్లిప్‌లు, గత కొన్ని సంవత్సరాల ఐటీఆర్, బ్యాంకు స్టేట్‌మెంట్‌లు అందజేయాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి పొందేవారైతే వ్యాపారానికి సంబంధించిన పత్రాలు అందజేయాలి. వ్యాపార యాజమాన్య రుజువు, జీఎస్‌టీ స్టేట్‌మెంట్స్‌, ఐటీ రిటర్న్‌లు, రాబడి వివరాలు మొదలైనవి అందించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ పత్రాలను రుణ దరఖాస్తుకు ముందే సిద్ధం చేసుకోవాలి.

‘FOIR’

FOIR (ఫిక్స్‌డ్‌ ఆబ్లిగేషన్‌ టు ఇన్‌కమ్‌ రేషియో) అనేది మీ గృహ రుణ దరఖాస్తును మూల్యాంకనం చేసేటప్పుడు బ్యాంకులు పరిగణించే కీలకమైన అంశం. ఇది మీ నికర నెలవారీ ఆదాయం, నెల మొత్తం రుణ చెల్లింపుల నిష్పత్తి. ఉదా: మీరు నెలకు రూ.1 లక్ష సంపాదించేవారైనప్పుడు, (అన్ని)ఈఎంఐలకు రూ.50 వేలు చెల్లిస్తే.. అప్పుడు మీ ‘FOIR’ 50 అవుతుంది. మీ గృహ రుణ దరఖాస్తుకు 50 లేదా అంతకంటే ఎక్కువ ‘FOIR’ అనుకూలమైనది కాదు. కాబట్టి, మీరు గృహ రుణం కోసం దరఖాస్తు చేసే ముందు ‘FOIR’ను తగ్గించడానికి, అప్పటికే కొనసాగుతున్న చిన్న రుణాలను తీర్చేసి, ఆ రుణ ఖాతాలను మూసివేయడం మంచిది.

ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ను ఎంచుకోండి

బ్యాంకులు, పేరున్న విశ్వసనీయ ప్రాపర్టీ డెవలపర్‌లను ఇష్టపడతాయి. ఎందుకంటే వీరి ప్రాజెక్ట్‌లు సకాలంలో ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా పూర్తయ్యే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. అలాగే, చాలా బ్యాంకులు ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌లతో టై-అప్‌లను కలిగి ఉంటున్నాయి. బ్యాంకు ఆమోదించిన డెవలపర్‌ను ఎంచుకోవడం వల్ల మీరు గృహ రుణాన్ని త్వరగా, అవాంతరాలు లేకుండా పొందే అవకాశం ఉంటుంది.

ప్రీ-అప్రూవ్డ్‌ హోమ్‌ లోన్‌

మీ రీపేమెంట్‌ సామర్థ్యం, ఆదాయం, క్రెడిట్‌ స్కోరు ఆధారంగా బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్‌ హోమ్‌ లోన్‌లు అందిస్తాయి. బ్యాంకు వద్ద అందుబాటులో ఉన్న మీ ప్రస్తుత ఆర్థిక రికార్డుల ఆధారంగా గృహ రుణం మొత్తం నిర్ణయిస్తుంది. మీరు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను అందించిన తర్వాత 1-2 రోజుల్లోపు రుణం మంజూరు అవుతుంది. మీ హోమ్‌ లోన్‌ దరఖాస్తు త్వరగా మంజూరు చేయడానికి ఉత్తమ మార్గాల్లో ఇది ఒకటి.

డౌన్‌ పేమెంట్‌ను పెంచండి

బ్యాంకులు, ఆస్తి ధరలో 80-90% వరకు మాత్రమే రుణంగా ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని సొంతంగా భరించాలి. ఈ మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ అంటారు. అవసరమైన దానికంటే కాస్త ఎక్కువ డౌన్‌ పేమెంట్‌ను చెల్లించి బ్యాంకు నమ్మకాన్ని మెరుగుపర్చుకోవచ్చు. తద్వారా గృహ రుణ ఆమోద ప్రక్రియ వేగవంతం అవుతుంది.

ఇప్పటికే సంబంధం ఉన్న బ్యాంకుతో..

మీ జీతం ఖాతాను కలిగి ఉన్న బ్యాంకును, రుణాలు తీసుకుని సకాలంలో తీర్చివేసిన బ్యాంకును గృహ రుణానికి ఎంపిక చేసుకోండి. మీ ఆర్థిక చరిత్ర ఆ బ్యాంకుకు పూర్తిగా తెలిసి ఉంటుంది. దీనివల్ల వేగంగా రుణం పొందే అవకాశం ఉంటుంది. ఇంకా వివాదస్పద క్రెడిట్‌ కార్డు ఛార్జీలు వంటివేవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని