WhastApp: త్వరలో వాట్సాప్‌ యాప్‌లో ట్రూకాలర్‌ సేవలు!

కాలర్‌ ఐడెంటిఫికేషన్ యాప్‌ ట్రూకాలర్‌ (Truecaller) త్వరలో తన సేవలను మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp)లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

Published : 09 May 2023 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp)లో వచ్చే స్పామ్‌/స్కామ్‌ కాల్స్‌ను సులువుగా గుర్తించేందుకు వీలుగా త్వరలో మరో అదనపు సర్వీస్‌ యాప్‌లో అందుబాటులోకి రానుంది. కాలర్‌ ఐడెంటిఫికేషన్ యాప్‌ ట్రూకాలర్‌ (Truecaller) తన సేవలను వాట్సాప్‌ యాప్‌లో కూడా పరిచయం చేయనుంది. ఈ మేరకు ట్రూకాలర్‌ సీఈవో అలన్‌ మమేది (Alan Mamedi) వెల్లడించారు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను మే తర్వాత ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

2021 ఏడాదికి సంబంధించి ట్రూకాలర్‌ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్‌ వంటి దేశాల్లో సగటున ఒక యూజర్‌కు రోజులో 17 టెలిమార్కెటింగ్ , స్కామింగ్ కాల్స్‌ వస్తున్నట్లు పేర్కొంది. వీటిని అడ్డుకునేందుకు మే 1 నుంచి టెలికాం నెట్‌వర్క్‌ ఆపరేటర్లు (AIrtel, Jio, Vodafone Idea, BSNL) ఫోన్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్ సేవల్లో కృత్రిమ మేధ (AI) ఆధారిత స్పామ్‌ ఫిల్టర్స్‌ను ఉపయోగించాలని ట్రాయ్‌ (TRAI) సూచించింది. ఈ ఏఐ ఆధారిత ఫిల్టర్స్‌ వేర్వేరు వ్యక్తులు లేదా సంస్థల నుంచి వచ్చే నకిలీ, మార్కెటింగ్‌ కాల్స్‌తోపాటు మెస్సేజ్‌లను గుర్తించి అడ్డుకుంటాయి. దీంతో టెలీ మార్కెటింగ్ సంస్థలు వాట్సాప్‌ ద్వారా యూజర్లకు కాల్స్‌ చేయడం ప్రారంభించాయి. గత రెండు వారాలుగా దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు ట్రూకాలర్‌ సేవలను వాట్సాప్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అలన్‌ మమేది తెలిపారు. దీనికి సంబంధించి టెలికాం ఆపరేటర్లతో ట్రూకాలర్‌ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. 

వాట్సాప్‌ యాప్‌కు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. ఈ యాప్‌ యూజర్లు తమకు తెలియని నంబర్ల నుంచి అభ్యంతరకర మెసేజ్‌లు, కాల్స్‌ వస్తే వాట్సాప్‌కు ఫిర్యాదు చేయొచ్చు. అనంతరం సదరు ఖాతాలపై వాట్సాప్‌ చర్యలు తీసుకుంటుంది. అలా ప్రతి నెలా యూజర్ల ఫిర్యాదు, ఏఐ స్పామ్‌ ఫిల్టర్ల ద్వారా వేల సంఖ్యలో ఖాతాలపై వాట్సాప్‌ నిషేధిస్తుంది. ట్రూకాలర్‌కు భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌. ఈ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్‌ యూజర్లు ఉంటే.. వారిలో 250 మిలియన్‌ యూజర్లు భారత్‌లోనే ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని