WhatsApp: వాట్సాప్‌లో కాల్ షెడ్యూల్‌.. ఎలా చేసుకోవచ్చంటే?

వాట్సాప్‌ (WhatsApp) వేదికగా ఆన్‌లైన్‌ సమావేశాలు (Online Meetings) నిర్వహించే వారి కోసం త్వరలో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను ముందుగా బీటా యూజర్లకు, తర్వాత సాధారణ యూజర్లకు అందుబాటులోకి రానుంది. 

Published : 08 Feb 2023 21:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు వాట్సాప్‌ ద్వారా చేసే ఆడియో/వీడియో కాల్స్‌ను షెడ్యూల్‌ (Schedule Calls) చేయొచ్చు. గూగుల్ మీట్‌ (Google Meet), మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ (Microsoft Teams) తరహాలోనే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. వాట్సాప్‌ వేదికగా ఆన్‌లైన్‌ సమావేశాలు (Online Meetings) నిర్వహించే వారికి ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరం. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ముందుగా బీటా యూజర్లకు, తర్వాత సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 

వాట్సాప్‌ గ్రూప్‌ చాట్‌లో వీడియో/ఆడియో కాల్‌ ఐకాన్‌లపై క్లిక్ చేస్తే షెడ్యూల్‌ కాల్ అని పాప్‌-అప్‌ విండో కనిపిస్తుంది. అందులో సమావేశం పేరు, తేదీ, టైం వంటి వివరాలను ఎంటర్‌ చేసి క్రియేట్‌పై క్లిక్ చేస్తే కాల్‌ షెడ్యూల్‌ అవుతుంది. కాల్ ప్రారంభమైన వెంటనే గ్రూప్‌ సభ్యులందరికీ అలర్ట్ నోటిఫికేషన్‌ వెళుతుంది. దీంతోపాటు ట్రాన్స్‌క్రైబ్‌ వాయిస్‌ మెసేజెస్‌ (Transcribe Voice Messages) పేరుతో మరో ఫీచర్‌ను కూడా వాట్సాప్ పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్లు వాయిస్‌ మెసేజ్‌లను టెక్స్ట్‌ రూపంలో చదవచ్చు. దీంతో యూజర్లు వాయిస్‌ మెసేజ్‌ వినలేని పరిస్థితుల్లో ఆడియో ప్లే చేస్తే అందులోని సమాచారం టెక్స్ట్‌ రూపంలో స్క్రీన్‌పై కనిపిస్తుంది. త్వరలోనే ఈ రెండు ఫీచర్లను వాట్సాప్‌ సాధారణ యూజర్లకు పరిచయం చేయనుంది. 

ఇటీవలే వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్‌కు సంబంధించి కొత్తగా ఐదు ఫీచర్లను పరిచయం చేసింది. అవి వాయిస్‌ స్టేటస్‌ (Voice Satus), ప్రైవేట్‌ ఆడియన్స్ సెలెక్టర్‌ (Private Audience Selector), స్టేటస్‌ రియాక్షన్స్ (Status Reactions), స్టేటస్‌ ప్రొఫైల్ రింగ్స్‌ (Status Profile Rings), లింక్‌ ప్రివ్యూ (Link Preview). వీటిలో వాయిస్‌ స్టేటస్‌తో ఆడియోను స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ప్రైవేట్‌ ఆడియన్స్ సెలెక్టర్‌తో యూజర్‌ తనకు నచ్చిన వ్యక్తులను మాత్రమే స్టేటస్‌ చూసేలా కాంటాక్ట్స్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేటస్‌ రియాక్షన్స్‌తో  ఎమోజీలతో స్టేటస్‌పై స్పందన తెలియజేయవచ్చు. స్టేటస్‌ ప్రొఫైల్ రింగ్స్‌తో ఇతరులు స్టేటస్‌ అప్‌డేట్‌ చేసిన వెంటనే అలర్ట్ నోటిఫికేషన్‌ వస్తుంది. లింక్‌ ప్రివ్యూతో స్టేటస్‌లో పెట్టే వెబ్‌ లింక్‌ల ఫొటో, ఇతర వివరాలు కనిపిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు