NPS చందాదారులు పెన్షన్‌ ఎప్పటి నుంచి పొందొచ్చు..?

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఏక‌మొత్తంలో డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. యాన్యుటీ ప‌థ‌కాల‌ను కొనుగోలు చేయ‌డం ద్వారా పెన్ష‌న్ కూడా పొంద‌వ‌చ్చు.

Updated : 08 Aug 2022 17:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పెట్టుబడిదారులు ఎక్కువగా ఇష్టపడే పెట్టుబడి సాధనాల్లో నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్‌పీఎస్) ఒక‌టి. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఏక‌మొత్తంలో డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయ‌డం ద్వారా పెన్ష‌న్ కూడా పొందొచ్చు. ఎన్‌పీఎస్‌లో 5 సంవ‌త్స‌రాల లాక్ - ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. చందాదారుడు ప‌ద‌వీ విర‌మ‌ణ కంటే ముందు కూడా ప‌థ‌కం నుంచి నిష్క్రమించొచ్చు.

ఎన్‌పీఎస్ నుంచి వైదొలిగిన‌ప్పుడు (ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత గానీ, ముందుగానీ) యాన్యుటీని కొనుగోలు చేయాలి. ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత ఎన్‌పీఎస్ నుంచి వైదొలిగే వారు మెచ్యూరిటీ మొత్తం నుంచి 60 శాతం మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మిగిలిన 40 శాతం మొత్తంతో యాన్యుటీ ప‌థ‌కాల‌ను త‌ప్ప‌నిస‌రిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ మెచ్యూరిటీ మొత్తం రూ. 5 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే త‌క్కువ‌గా ఉంటే యాన్యుటీలు కొనుగోలు చేయన‌వ‌స‌రం లేకుండా పూర్తి మొత్తం విత్‌డ్రా (లాక్ - పిరియ‌డ్ ముగిసి ఉండాలి) చేసుకోవ‌చ్చు.

ఒక‌వేళ‌ ప‌ద‌వీవిర‌మ‌ణ‌కు ముందే, అంటే 60 ఏళ్ల‌కు ముందే ఎన్‌పీఎస్ నుంచి నిష్క్రమిస్తుంటే.. 80 శాతం మొత్తాన్ని యాన్యుటీకి కేటాయించాలి. మిగిలిన 20 శాతం ఏక మొత్తంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఇటువంటి సంద‌ర్భంలో కార్ప‌స్ మొత్తం రూ.2.50 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే త‌క్కువ‌గా ఉంటే యాన్యుటీలు కొనుగోలు చేయన‌వ‌స‌రం లేకుండా పూర్తి మొత్తం విత్‌డ్రా (లాక్ - పిరియ‌డ్ ముగిసి ఉండాలి) చేసుకోవ‌చ్చు. 

చందాదారులు త‌మ‌కు నచ్చిన‌ యాన్యుటీ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ (ఏఎస్‌పీ) ద్వారా యాన్యూటీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు పెన్ష‌న్ నిధి నియంత్ర‌ణ సంస్థ‌ (పీఎఫ్ఆర్‌డీఏ) నియంత్ర‌ణ‌లో ప‌నిచేస్తాయి. చందాదారుడు ఎంచుకున్న యాన్యూటీ ప‌థ‌కం ఆధారంగా క్ర‌మ‌మైన వ్య‌వ‌ధిలో స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు పెన్ష‌న్ చెల్లిస్తాయి. 

పీఎఫ్ఆర్‌డీఏ తో క‌లిసి ప‌నిచేస్తున్న 11 ఏఎస్‌పీలు..
*
బ‌జాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సురెన్స్ కో లిమిటెడ్‌
* కెన‌రా హెచ్ఎస్‌బీసీ ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్ లైఫ్ ఇన్సురెన్స్ కో లిమిటిడ్‌
* హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సురెన్స్ కో లిమిటెడ్‌
* ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సురెన్స్ కో లిమిటెడ్‌
* ఇండియా ఫ‌స్ట్ లైఫ్ ఇన్సురెన్స్ కో లిమిటెడ్‌
* కొటాక్ మ‌హీంద్రా లైఫ్ ఇన్సురెన్స్ కో లిమిటెడ్‌
* లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా
* మ్యాక్స్ లైప్ ఇన్సురెన్స్‌ కో లిమిటెడ్‌
* ఎస్‌బీఐ లైఫ్ ఇన్సురెన్స్ కో లిమిటెడ్‌
* స్టార్ యూనియన్ డై-ఇచి లైఫ్ ఇన్సురెన్స్ కో లిమిటెడ్‌
* టాటా ఏఐఏ లైఫ్ ఇన్సెరెన్స్ కో లిమిటెడ్‌

యాన్యుటీల గురించిన ఇత‌ర స‌మాచారం.. 
చందాదారుడు జీవించి ఉన్నంత‌కాలం ఒకే రేటుతో యాన్యుటీని పొందొచ్చు. అలాగే, చందాదారుడు జీవితాంతం లేదా 5, 10, 15, 20.. ఇలా నిర్దిష్ట సంవ‌త్స‌రాల పాటు లేదా జీవించినంత కాలం యాన్యుటీ పొందేలా ప్లాన్లు ఎంచుకోవచ్చు. చందాదారుడు చ‌నిపోతే అత‌డు/ఆమె జీవిత‌భాగ‌స్వామి యాన్యుటీని పొందేలా ప్లాన్ ఎంచుకోవ‌చ్చు. చందాదారుడు మ‌ర‌ణానంత‌రం అత‌డు/ఆమె జీవిత‌ భాగ‌స్వామికి 50 శాతం, 100 శాతం యాన్యుటీ అందేలా ప్లాన్ చేసుకోవ‌చ్చు. యాన్యుటీ రాబ‌డుల‌పై ప‌న్ను వ‌ర్తిస్తుంది. ప్ర‌స్తుతం వివిధ‌ ర‌కాల యాన్యుటీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 

1. చందాదారునికి జీవితాంతం యాన్యుటీ అందించేవి. 
2. చందాదారుడు జీవించి ఉన్నంత కాలం చందాదారునికి యాన్యుటీని అందిస్తూ, అత‌డు/ఆమె మ‌ర‌ణాంత‌రం జీవిత భాగ‌స్వామికి యాన్యుటీని అందించేవి. 
3. చందాదారుడు జీవితాంతం యాన్యుటీ అందించే.. అత‌డు/ఆమె మ‌ర‌ణాంత‌రం కొనుగోలు ధ‌ర‌ను తిరిగి చెల్లించేవి.
4. చందాదారుడు, అత‌డు/ఆమె జీవిత భాగ‌స్వామి జీవించి ఉన్నంత‌కాలం యాన్యుటీని అందించి వారి మ‌ర‌ణాంత‌రం కొనుగోలు ధ‌ర‌ను చెల్లించేవి.
5. చందాదారుడు జీవించి ఉన్నంత కాలం అత‌డు/ఆమెకు యాన్యుటీని అందిస్తూ మ‌ర‌ణాంత‌రం భార్య‌, ఆధారిత త‌ల్లి లేదా తండ్రికి యాన్యుటీని అందించి ఆ తర్వాత కొనుగోలు ధ‌ర‌ను చందాదారుని నామినీ లేదా పిల్ల‌ల‌కు అందించేది.

వీటిలో మీ వీలు, అవసరం ప్రకారం తగిన ప్లాన్ ఎంచుకోవచ్చు. ప్లాన్‌ను బట్టి పెన్షన్ మొత్తం మారుతుందని గమనించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని