IT Return: ఉద్యోగులు ఐటీఆర్ - 1 ఎప్పుడు ఫైల్ చేయకూడ‌దు?

ఎటువంటి సంద‌ర్భంలో ఐటీఆర్ -1 ఫైల్ చేయ‌కూడ‌దో తెలుసుకుంటే..ఫారం ఎంపిక‌లో త‌ప్పులు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. 

Updated : 21 Jul 2022 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐటీ రిట‌ర్నులు స‌మ‌యానికి దాఖ‌లు చేసినా.. ప్రాసెసింగ్ స‌మ‌యంలో ఒక్కోసారి వాటిని ఐటీ శాఖ తిర‌స్క‌రిస్తుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉండొచ్చు. అయితే, ప్ర‌ధాన కార‌ణం ఫారం ఎంపిక‌లో చేసే పొర‌పాట్లు. సాధార‌ణంగా జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వ్య‌క్తులు ఐటీఆర్-1ని ఎంపిక చేసుకుని దాఖ‌లు చేస్తుంటారు. ఇది అన్ని సార్లూ స‌రిప‌డ‌క‌పోవ‌చ్చు. అందువ‌ల్ల ఎటువంటి సంద‌ర్భంలో ఐటీఆర్ -1 ఫైల్ చేయ‌కూడ‌దో తెలుసుకుంటే.. ఫారం ఎంపిక‌లో త‌ప్పులు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డొచ్చు.

ఐటీఆర్ -1 ఎవ‌రు ఎంపిక చేసుకోవచ్చు?
ఐటీఆర్ -1 ను స‌హ‌జ్ అని కూడా అంటారు. సాధార‌ణంగా, ఈ దిగువ తెలిపిన ఆదాయ మార్గాల ద్వారా రూ.50 ల‌క్ష‌లలోపు ఆదాయం పొందుతున్న వారు ఐటీఆర్ -1 ఫైల్ చేయ‌వ‌చ్చు.
* జీతం/పెన్ష‌న్ ద్వారా ఆదాయం పొందుతున్న వారు
* ఒక ఇంటి ద్వారా ఆదాయం పొందుతున్న వారు (ముందు సంవ‌త్స‌రాల్లో వ‌చ్చిన న‌ష్టాన్ని కొన‌సాగిస్తున్న‌ప్పుడు త‌ప్ప‌)
* ఇత‌ర ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం ఉన్న వారు (లాట‌రీ లేదా గుర్ర‌పు పందేల నుంచి వ‌చ్చిన ఆదాయం త‌ప్ప‌)
* భార్య‌, పిల్ల‌ల పేరుపై ఉన్న ఆస్తి నుంచి వ‌చ్చే ఆదాయాన్ని క‌లిపి రిట‌ర్నులు ఫైల్ చేస్తుంటే.. పైన తెలిపిన ఆదాయం మించని వారు ఐటీఆర్-1 ఫైల్ చేయ‌వ‌చ్చు. 

జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వ్య‌క్తులు ఎప్పుడు ఐటీఆర్ -1 ఎంచుకోకూడ‌దు?
1. వార్షిక ఆదాయం రూ. 50 ల‌క్ష‌లకు మించి ఉంటే..
జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వ్య‌క్తి వార్షిక ఆదాయం రూ. 50 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఉన్న‌ప్పుడు.. అత‌డు/ఆమెకు ఇత‌ర మార్గాల ద్వారా వ‌చ్చే ఆదాయం లేన‌ప్ప‌టికీ అత‌డు ఐటీఆర్-1ని దాఖ‌లు చేయ‌కూడ‌దు. ఇటువంటి సంద‌ర్భంలో ప‌న్ను చెల్లింపుదారుడు ఐటీఆర్-2 ఫారం ఎంచుకోవాలి.

2. ఒక‌టికి మించి ఇళ్లు ఉన్న‌ప్పుడు..
ఒక ఇంటి ద్వారా ఆదాయం ఉన్నప్పుడు ఉద్యోగులు ఐటీఆర్-1 దాఖ‌లు చేయ‌వ‌చ్చు. కానీ ఒక‌టి కంటే ఎక్కువ ఇంటి ఆస్తుల ద్వారా ఆదాయం పొందుతున్న‌వారికి ఇది స‌రైన ఎంపిక కాదు. 

3. వ్య‌వ‌సాయం ఆధారిత‌ ఆదాయం..
ఐటీఆర్ ఫారం-1లో వ్య‌వ‌సాయ ఆదాయానికి సంబంధించిన కాలం ఉంటుంది. అయితే, జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వారు రూ. 5000 లోపు వ్య‌వ‌సాయం ఆదాయం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఐటీఆర్‌-1 ఎంచుకోవాలి. అంత‌కు మించి ఉంటే ఐటీఆర్-2ని ఎంపిక చేసుకోవాలి. 

4. జాబితా చేయని ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు చేసి ఉంటే..
జీతం ద్వారా ఆదాయం పొందే ప‌న్ను చెల్లింపుదారులు అన్‌లిస్టెడ్ కంపెనీకి చెందిన ఈక్విటీని కలిగి ఉంటే, అటువంటి సందర్భంలో ఐటీఆర్ -1 ఫారం ఎంచుకోకూడ‌దు. 

5. ఒక సంస్థ‌కు డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటే..
ప‌న్ను చెల్లింపుదారుడు ఏదైనా సంస్థ‌కు డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తుంటే..అత‌డు/ఆమె ఐటీఆర్-1 ఫైల్ చేయ‌కూడ‌దు.

6. టీడీఎస్ చెల్లింపులు..
సెక్ష‌న్ 194ఎన్‌లో సూచించిన ప్ర‌కారం.. బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా నుంచి రూ.1 కోటి కంటే ఎక్కువ మొత్తం విత్‌డ్రా చేస్తే అటువంటి వారు ఐటీఆర్-1 ఫారం దాఖ‌లు చేయ‌కూడ‌దు.

7. షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్ మ‌దుప‌ర్లు..
ప‌న్ను చెల్లింపుదారుడు జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వ్య‌క్తి అయివుండి.. షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టి ఉంటే అటువంటి వారు ఐటీఆర్ -1 దాఖ‌లు చేయ‌వ‌చ్చు. కానీ షేర్ల‌ను విక్ర‌యించినా, మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను రీడీమ్ చేసుకున్నా ఆ ఆదాయాన్ని చూపించేందుకు ఐటీఆర్‌-1 స‌రైన ఫారం కాదు. ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-3ని ఎంచుకోవాలి.

8. హెచ్‌యూఎఫ్ కుటుంబ స‌భ్యులు..
ప‌న్ను చెల్లింపుదారుడు హిందూ అవిభాజ్య కుటుంబ స‌భ్యుడు అయితే అత‌డు/ఆమె ఐటీఆర్‌-1ని ఉప‌యోగించ‌కూడ‌దు.

9. భార‌త దేశం వెలుప‌ల ఆస్తులు ఉంటే..
ప‌న్ను చెల్లింపుదారుడు ఐటీఆర్-1కి వ‌చ్చే అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ, భార‌త‌దేశం వెలుప‌ల ఆస్తులు క‌లిగి ఉన్నా, వాటి ద్వారా వ‌చ్చే ఆదాయం ఉన్నా ఐటీఆర్-1 ఫైల్ చేయ‌కూడ‌దు. 

10. ఫ్రీలాన్సింగ్ చేస్తున్న‌ప్పుడు..
చాలా మంది సాఫ్ట‌వేర్ ఉద్యోగులు, త‌మ‌ ఉద్యోగంతో పాటు.. ఖాళీ స‌మ‌యంలో ఫ్రీలాన్స‌ర్లుగా ప‌నిచేసి అద‌న‌పు ఆదాయం ఆర్జిస్తుంటారు. ఈ ఆదాయం వృత్తి లేదా వ్యాపారం ద్వారా వ‌చ్చిన ఆదాయం కింద‌కి వ‌స్తుంది. కాబ‌ట్టి, అటువంటి సంద‌ర్భంలో ఐటీఆర్-1 ఫైల్ చేయ‌లేరు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఐటీఆర్-4 లేదా ఐటీఆర్-3ని ఎంచుకోవాలి.

ప్ర‌వాస భార‌తీయులు, గ‌త సంవ‌త్స‌రాల‌లో వ‌చ్చిన న‌ష్టాల‌ను కొన‌సాగిస్తున్న‌వారు, లాట‌రీ, గుర్ర‌పు పందేల ద్వారా ఆదాయం పొందిన వారు, వృత్తి వ్యాపారాల నుంచి ఆదాయం పొందిన వారు, ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే మూల‌ధ‌న లాభాలు ఉన్న‌వారు.. కూడా ఐటీఆర్-1ని ఎంచుకోకూడ‌దు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని