Home loan: గృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయాలి?

ఇంటిని ఎప్పుడు కొనుగోలు చేయాలి - సంపాద‌న ప్రారంభ‌మైన తొలి రోజుల్లోనా? 

Updated : 08 Feb 2022 16:58 IST

 

సొంతిల్లు చాలా మంది క‌ల‌. ఈ క‌ల‌ను గృహ రుణం(Home loan) సాయంతో నెర‌వేర్చుకోవ‌చ్చు. నిర్దిష్ట ఆదాయం ఉన్న‌వారికి బ్యాంకులు గృహ రుణాన్ని తేలిక‌గానే మంజూరు చేస్తున్నాయి. అయితే అస‌లు ఇంటిని ఎప్పుడు కొనుగోలు చేయాలి? సంపాద‌న ప్రారంభ‌మైన తొలి రోజుల్లోనా? సంపాద‌న చివ‌రి రోజుల్లోనా?అనేది చాలా మంది సందేహం. అయితే, ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం అంత సుల‌భమేమీ కాదు. ఆర్థిక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా సంపాదనా సామర్థ్యాన్ని మెరుగుప‌రుచుకునే నైపుణ్యం, మంచి చ‌దువు, ఉద్యోగం ఉన్న వారు ప్రారంభ రోజుల్లోనే ఆస్తిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. సంపాద‌నా సామ‌ర్థ్యాన్ని, నైపుణ్యాన్ని వారి అనుభవంతో పెంచుకునే వారు ఆల‌స్యంగా కొనుగోలు చేయ‌డం ద్వారా మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. భ‌విష్య‌త్తు నిర్దిష్టంగా ఉండ‌దు కాబ‌ట్టి ప్రారంభ‌రోజుల్లోనే గృహం కొనుగోలు చేయ‌డం మంచిద‌ని కొంద‌రి వాద‌న‌. ఏది ఏమైన‌ప్ప‌టికీ దీర్ఘ‌కాల ల‌క్ష్యాల‌పై అధిక ఈఎమ్ఐ చూపించే ప్ర‌భావాన్ని అర్థం చేసుకుని గృహ రుణం తీసుకోవ‌డం మంచిది.

ప్రారంభంలో కొనుగోలు చేయ‌డం వ‌ల్ల లాభాలు

* ఉద్యోగి స‌ర్వీసు ఎక్కువ కాలం ఉంటుంది. కాబ‌ట్టి రుణ చెల్లించేందుకు ఎక్కువ స‌మ‌యం ఉంటుంది. దీంతో బ్యాంకులు రుణాన్ని సుల‌భంగా మంజూరు చేస్తాయి.

* రుణం త్వ‌ర‌గా చెల్లించ‌వ‌చ్చు. ఉద్యోగంలో చేరిన కొత్త‌లో బాధ్య‌త‌లు త‌క్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి ఈఎమ్ఐ కోసం ఎక్కువ మొత్తాన్ని కేటాయించి వీలైనంత త్వ‌ర‌గా రుణాన్ని క్లియ‌ర్ చేసుకోవ‌చ్చు.

* సొంత ఇంటిలోనే సౌక‌ర్య‌వంతంగా నివ‌సించ‌వ‌చ్చు.

* రుణాన్ని స‌మ‌యానికి చెల్లించే అవ‌కాశం ఉంటుంది.

ప్రారంభంలో కొనుగోలు చేయ‌డం వ‌ల్ల న‌ష్టాలు

* డౌన్‌పేమెంట్‌కు కావాల్సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోవ‌డం కష్టం. అందువ‌ల్ల ఆస్తి విలువ‌లో అధిక భాగం రుణం తీసుకోవాల్సి వ‌స్తుంది.

* ఆరంభంలో జీతం తక్కువగా ఉంటుంది కాబట్టి రుణ మొత్తం కూడా ఎక్కువ మంజూరు కాకపోవచ్చు.

* త‌గినంత‌ పెట్టుబ‌డులు పెట్ట‌లేక‌పోవ‌డం వ‌ల్ల ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌కు, ఇత‌ర లక్ష్యాలకు ప్రారంభంలోనే ఆటంకం ఏర్ప‌డవ‌చ్చు.

* ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి ఇల్లు పాత‌బ‌డ‌టం వ‌ల్ల ఇంటి ధ‌ర త‌గ్గే అవ‌కాశం ఉంది. అలాగే ఆధునీకీకరణ కోసం మ‌రికొంత పెట్టుబ‌డి పెట్టాల్సి రావ‌చ్చు.

* ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్ర‌దేశాల‌కు బ‌దిలీ అయ్యే వారైతే సొంతిల్లు ఉన్నా అద్దె ఇంటిలో ఉండ‌క త‌ప్ప‌దు.

* ఆదాయం గ‌ణ‌నీయంగా పెరగ‌కపోతే ప‌ద‌వీవిర‌మ‌ణ నిధిని స‌మ‌కూర్చుకోవ‌డం క‌ష్టం కావ‌చ్చు.

ఆల‌స్యంగా కొనుగోలు చేయ‌డం వ‌ల్ల లాభాలు:

* డౌన్‌పేమెంట్ కోసం డ‌బ్బు ఆదా చేసేందుకు స‌మ‌యం ఉంటుంది. డౌన్‌పేమెంట్ ఎక్కువ చెల్లిస్తే రుణం త‌క్కువ ఉంటుంది కాబ‌ట్టి తేలిక‌గా ఈఎమ్‌లు చెల్లించ‌వ‌చ్చు.

* ప‌ద‌వీవిర‌మ‌ణపై స్ప‌ష్ట‌త ఉంటుంది. కావాల్సిన నిధిని స‌మ‌కూర్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

* స‌రైన పెట్టుబ‌డులతో, ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌చ్చు.

* ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యానికి ఆస్తి విలువ‌లో పెద్ద‌గా తేడా ఉండ‌దు. ఇల్లు కొని ఎక్కువ సంవ‌త్స‌రాలు అయి ఉండ‌దు కాబ‌ట్టి ఆధునికీకర‌ణ ప‌నులు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

ఆలస్యంగా కొనుగోలు చేయ‌డం వ‌ల్ల న‌ష్టాలు:

* జీవిత‌పు మ‌ధ్య వ‌య‌స్సులో భాద్య‌త‌లు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ స‌మ‌యంలో రుణం భారం కావ‌చ్చు.

* ఒక‌వేళ ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి రుణం పూర్తికాక‌పోతే ఆదాయం లేనందున ఈఎమ్ఐలు చెల్లించ‌డం క‌ష్టం అవుతుంది.

* పదవీ విరమణ దగ్గర పడుతున్నందున బ్యాంకులు ఎక్కువ కాల పరిమితితో రుణం అందించకపోవచ్చు. కాబట్టి, ఈఎంఐ మొత్తం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

* తొంద‌ర‌గా ప‌ద‌వీవిర‌మ‌ణ చేయ‌డం సాధ్యం కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని