Stock Market: కాగితంపై లాభాలు జేబులోకి రావాలంటే..

మార్కెట్లో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి

Updated : 07 Jul 2021 13:33 IST

షేర్లను ఎప్పుడు అమ్మాలి? ఎప్పుడు నిలిపి ఉంచాలి?

పెట్టుబడి ప్రధాన ఉద్దేశం లాభార్జన. మార్కెట్లో మదుపు చేసేది కూడా అందుకే. కానీ, క్షణ క్షణం మారే మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే ఎన్నో వ్యూహాలు ఉండాలి. అదును చూసి షేర్లను అమ్మి, లాభాలను పొందే నేర్పు ఉండాలి. అందుకోసం ఏం చేయాలి?

కష్టార్జితాన్ని సరైన చోటు పెట్టుబడి పెట్టడమే కాదు.. దాన్ని సరైన సమయంలో వెనక్కి తీసుకోవడం కూడా తెలిసినప్పుడే సంపదను సృష్టించుకోగలం. ఒక లక్ష్యాన్ని సాధించేందుకు చేసే మదుపును నిర్ణీత కాలం తరువాత తీయక తప్పదు. ఉదాహరణకు పిల్లల విద్యాభ్యాసం, పెళ్లిళ్లు, ఇల్లు కొనడం లాంటి సందర్భాల్లో మన సొమ్మును వెనక్కి తీసుకుంటాం. ఇవన్నీ కూడా వ్యక్తిగత ఆర్థిక కారణాలు. ఇవి కాకుండా.. సాధారణంగా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పతనం అవుతున్నప్పుడు మంచి షేర్లను కూడా చాలా మంది అమ్మేస్తుంటారు. ఇలాంటప్పుడు వాటిని కొనుగోలు చేయాలి. వృద్ధి పథంలో ఉన్నప్పుడు చాలా మంది కొనడానికి ముందుకు వస్తారు. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న షేర్లను మంచి ధరకి అమ్మేయాలి. మార్కెట్లో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అలంటి సందర్భాల్లో షేర్లను అమ్మి సొమ్ము తీసేసుకోవడమో లేదా మంచి షేర్లకు మారడమో చేయాలి. అప్పుడే మార్కెట్లో విజయవంతమైన మదుపరిగా మిగులుతాం.

మార్కెట్లో ఆశించిన రాబడి రాకుండా.. ఏదో నామమాత్రంగా వచ్చినప్పుడు ఆ షేర్ల నుంచి బయటకు రావడమే మేలు. లేకపోతె పెట్టుబడి నష్టపోవడంతో పాటు మళ్లీ ఆ సొమ్మును వేరే చోట మదుపు చేసే అవకాశాన్నీ కోల్పోతాం. మరి ఇలాంటివి జరగకూడదనుకుంటే మదుపరి తన వద్ద ఉన్న షేర్లను ఎప్పుడు అమ్మాలంటే...

గుర్తించిన వెంటనే..

కొన్ని సార్లు ఒక కంపెనీ మీద విపరీతమైన నమ్మకంతో షేర్లు కొంటాం. కానీ, ఎన్నేళ్లు గడిచినా ఆ కంపెనీలో ఎలాంటి వృద్ధి కనిపించదు. ఆ విషయాన్ని గుర్తించిన వెంటనే దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించాలి. సాధారణంగా మనం ఎంచుకున్న షేర్ మంచిదనే భావనతోనే ఉంటాం. కంపెనీ ఎంపికలో తప్పు చేశామనే ఆలోచన వచ్చినా.. దాన్ని అంగీకరించడానికి మాత్రం అహం అడ్డొస్తుంటుంది. ఇలాంటి భావోద్వేగాలను అదుపులో పెట్టుకున్నప్పుడే మార్కెట్లో ఆశించిన ఫలితాలు సాధించగలుగుతాం.

పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేప్పుడు తప్పులు చేయడం సాధారణం. కానీ, దాన్ని వీలైనంత త్వరగా గుర్తించి సరిదిద్దుకున్నప్పుడే మంచి మదుపరి అవుతాడు. ఒక చెడ్డ షేరు కొన్నామని తెలిశాక కూడా దాని మీద మమకారం పెంచుకుని, అది ఎప్పటికైనా పెరగకపోతుందా అనే ఆశాభావంతో ఉంటారు. ఇలాంటి విధానాలు పెట్టుబడి మొత్తాన్ని హరించడంతో పాటు, ఇతర పెట్టుబడి అవకాశాలను కూడా దూరం చేస్తాయి. విజయవంతమైన మదుపరి తన తప్పుని తెలుసుకోగానే ఆ షేరు నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడు. ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటాడు.

ఇతర వ్యాపారాల వైపు దృష్టి సారిస్తే.. జాగ్రత్త!

సాధారణంగా ఓ కంపెనీ షేర్లలో మదుపు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, కొన్ని సార్లు మనం ఆశించిన విధంగా కంపెనీ పనితీరు ఉండకపోవచ్చు. కంపెనీ నిర్వహణలో తేడాల వల్ల నష్టాలు రావచ్చు. భవిష్యత్తు కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ కంపెనీ నుంచి వీలైనంత తొందరగా బయట పడాలి. అలాగే కంపెనీ తమ అసలు వ్యాపారం కాకుండా ఇతర వ్యాపారాల వైపు దృష్టి సారిస్తున్నప్పుడు మదుపర్లు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. వాళ్లు పెట్టుబడి పెట్టే రంగాలు అంత లాభసాటిగా లేకపోవచ్చనే సూచనలు ఉంటే.. ఆ షేరు నుంచి వైదొలగండి.

గరిష్ఠ ధరకు చేరితే..

కొన్ని సందర్భాల్లో షేర్ల ధరలు అమాంతం ఎగబాకుతాయి. పెరిగినంత వేగంగా పడిపోవడానికీ ఆస్కారం ఉందన్నది గమనించాలి. ఇలాంటి సందర్భాల్లో ఆ షేర్లను అమ్మేయడమే ఉత్తమం. అయితే, ఆ షేర్లు మరింత వృద్ధి సాధిస్తే ఎలా? అనే అనుమానం రావచ్చు. దాన్ని నివారించడానికి ఉన్న షేర్లన్నింటినీ ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా అమ్మేయడం మేలు. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు. దాన్ని వదులుకుంటే తర్వాత చిక్కుల్లో పడతాం. ఒకసారి గరిష్ఠ ధరకి వెళ్లిన తర్వాత.. పతనమై మళ్లీ ఆ స్థాయికి చేరడం అంత త్వరగా వీలు కాకపోవచ్చు. ఉదాహరణకు 2007-08 ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల షేర్లు బాగా పెరిగిపోయాయి. ఒకసారి దిద్దుబాటు వచ్చాక ఎన్నో ఏళ్ల వరకు ఆ ధరలకు చేరుకోలేకపోయాయి.

మంచి అవకాశాలొస్తే..

మీరు ఇప్పటికే కొన్ని షేర్లలో పెట్టుబడి కొనసాగిస్తున్నారనుకుందాం. వాటిలో వృద్ధి పర్వాలేదన్నట్టు ఉందనుకోండి. అంతకన్నా మంచి కంపెనీ షేర్లకు ఆ పెట్టుబడి మొత్తాన్ని మళ్లించడం వల్ల అధిక రాబడిని సొంతం చేసుకోవచ్చు. ఉదాహరణకు 2008లో విద్యుత్, స్థిరాస్తి రంగంలో షేర్లను కొని, అట్టిపెట్టుకున్న వారి కన్నా ఫార్మా, వినియోగ వస్తువుల కంపెనీల షేర్లకు మారిన వారు ఎక్కువగా లాభపడ్డారు.

ఆర్థిక ప్రణాళికలో..

వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక కూడా షేర్లను ఎప్పుడు అమ్మాలో అన్న అంశాన్ని నిర్ధారిస్తుంది. మన పోర్ట్‌ఫోలియోలో 40 లేదా 50 శాతం ఈక్విటీ (ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు, షేర్లలో), మిగతాది డెట్లో ఉందనుకుంటే.. మార్కెట్లో మంచి లాభాలు వచ్చి షేర్ ధరలు పెరిగినప్పుడు కొంత మేరకు షేర్లను అమ్మి వచ్చిన మొత్తాన్ని తిరిగి సురక్షితమైన(డెట్) పెట్టుబడుల్లో పెట్టడం మంచిది. దీని వల్ల నష్టభయం పరిమితమవుతుంది.

స్టాక్ మార్కెట్ లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. మంచి షేరును మంచి ధరకు కొనడం ఎంత ముఖ్యమో..దాన్ని సరైన ధర వద్ద అమ్మి లాభాన్ని స్వీకరించడమూ అంతే ప్రధానం. అప్పుడే కాగితం మీద ఉన్న లాభాలు నగదుగా మారి మన జేబులోకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని