Personal Loan: వ్యక్తిగత రుణాన్ని ఎప్పుడు తీసుకోవాలి?

ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో వ్యక్తిగత రుణం తీసుకునే ఉంటారు. అయితే ఈ రుణాన్ని ఏ సందర్భంలో తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు అనేది ఇక్కడ తెలుసుకొందాం.

Published : 01 Dec 2022 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరికైనా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండడం సహజమే. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డులు అందజేసే రుణాలు ఉపయోగపడతాయి. మీ రోజువారీ ఖర్చులు ఆదాయానికి మించి పెరిగినప్పుడు, ఊహించని ఖర్చులను ఎరుర్కొన్నప్పుడు, వ్యయ-సంబంధిత సమస్యలను అధిగమించడానికి, మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి వ్యక్తిగత రుణాలు ఎంతగానో సాయపడతాయి.  ఇతర రుణాల మాదిరిగా వ్యక్తిగత రుణాలను కూడా బ్యాంకులు ఈ మధ్య విరివిగా ఇస్తున్నాయి. అయితే, ఈ రుణం  ఏ సందర్భంలో తీసుకోవాలి? ఎలాంటప్పుడు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

వ్యక్తిగత రుణం

ఈ రుణాలు అసురక్షితమైనవి. వీటికి తాకట్టు అవసరం లేదు. వీటిని డిజిటల్‌ రూపంలో సులువుగా తీసుకోవచ్చు. ఈ రుణాలకు కాస్త ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నా.. మంచి క్రెడిట్‌ స్కోరు, తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నవారికి బ్యాంకులు త్వరగానే మంజూరు చేస్తున్నాయి. బ్యాంకులే కాకుండా NBFCలు కూడా రుణాలు ఇస్తాయి. ఈ రుణాలను వస్తువుల కొనుగోళ్లకు, ఇంటి మరమ్మతులకు, కారు రుణాల డౌన్‌పేమెంట్‌లు వంటి చెల్లింపులకు, ఇతర ఏ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఉపయోగించవచ్చు. రుణ పరిమితి రూ. 2-5 లక్షలు. తీసుకున్న రుణాన్ని నెలవారీ వాయిదాలుగా తిరిగి చెల్లించవచ్చు.

ఏయే పరిస్థితుల్లో ఉపయోగం?

వ్యక్తిగత రుణాలు అసురక్షితమైనవి కాబట్టి ఈ రుణాలను ఏ ప్రయోజనం కోసం తీసుకుంటున్నారో తెలుసుకోవాలి.

రోజువారీ ఖర్చులకు: నెల మధ్యలో జీతం ఖర్చయిపోయి, ఇంకా నగదు అవసరం పడినప్పుడు, ఇంకా ఆ నెలలో నగదు అవసరాలు అదనంగా ఉన్నప్పుడు.. వ్యక్తిగత రుణాలు ఉపయోగపడతాయి.

అత్యవసర పరిస్థితులు: అనారోగ్య పరిస్థితులు, ఏమైనా అనుకోని దుర్ఘటనల వల్ల ప్రమాదాలు ఏ కుటుంబానికైనా అకస్మాత్తుగా వస్తుంటాయి. ఇటువంటి మెడికల్‌ ఎమర్జెన్సీల వంటి పరిస్థితులు ఊహించలేనివి. ఇటువంటి సమయాల్లో వ్యక్తిగత రుణాలే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కాపాడతాయి.

చిన్న రుణాలు తీర్చేయడం: ఏదైనా కారణంతో ఎవరినుంచైనా చేతి రుణం తీసుకున్నప్పుడు.. దానికి అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగత రుణాన్ని ఏ బ్యాంకునుంచైనా తీసుకుని రుణం తీర్చివేయొచ్చు.

పండుగలు, కుటుంబ కార్యక్రమాలు: సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే మన దేశంలో పండగలు, వివాహాలు, ఇతర వేడుకలకు భారీ ఖర్చులు ఉండడం సహజమే. ఈ ఖర్చులను నెలవారీ జీతంతో భరించడం కష్టం. వ్యక్తిగత రుణంతో ఈ ఖర్చులను కవర్‌ చేయొచ్చు.

ట్యూషన్‌ ఫీజులు: పిల్లలు ఎదిగేకొద్దీ స్కూలు, కళాశాల ట్యూషన్‌ ఫీజులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి జీతంతోనే ఈ ఖర్చులను నిర్వహించేలేకపోవచ్చు. విద్యా సంవత్సరం మొదలైనప్పుడు ఈ ఖర్చులు ప్రతి కుటుంబానికీ అదనపు ఖర్చులాగే ఉంటుంది. ఈ ఖర్చులను తట్టుకోవడానికి వ్యక్తిగత రుణం తీసుకోవడం కూడా ఒక ఆప్షన్‌.

ఈ రుణాలు అనేక కారణాల వల్ల ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. తక్షణ వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలి.

ఈ రుణం ఎప్పుడు తీసుకోకూడదు?

పొదుపు కోసం సరికాదు: ఊహించని అప్పులను తీర్చివేయడానికి, మీ తదుపరి జీతం వరకు ఖర్చులను నిర్వహించడానికి స్వల్పకాలిక వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు గానీ, సాధారణ పొదుపునకు ప్రత్యామ్నాయంగా ఈ రుణాలు సరికావు. వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఇతర రుణాల వడ్డీ రేట్ల కంటే అధికంగా ఉంటాయి. ఈ అప్పులను సకాలంలో క్లియర్‌ చేయడానికి మీకు క్రమశిక్షణ లేకపోతే తిరిగి చెల్లించడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.

స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడికి: కొంతమంది అప్పులు చేసి మరీ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంటారు. ఈ అప్పుల్లో వ్యక్తిగత రుణాలు కూడా ఉండొచ్చు. షేర్ మార్కెట్లో స్వల్పకాలంలో ఒడుదొడుకులు ఉంటాయి కాబట్టి రిస్క్ ఎక్కువ. అప్పులు చేసి స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడాన్ని ఆలోచనలేని చర్యగా చెప్పొచ్చు.

చివరిగా: బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అందించే వ్యక్తిగత రుణాల గురించి తెలుసుకోవడం మంచిది. కొన్ని ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు తక్షణ నగదు, క్రెడిట్‌ లైన్‌ను అందిస్తాయి. వ్యక్తిగత ఖర్చులకు దీన్ని ఉపయోగించవచ్చు. అయితే, వ్యక్తిగత రుణాలను అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోండి. వాటిని సరిగ్గా నిర్వహించకపోతే ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని