Unit Based Insurance Policy: యులిప్‌.. ఎప్పుడు తీసుకోవాలంటే..

బీమా.. పెట్టుబడి కలిసి ఉండే యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ(యులిప్‌)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని బీమా సంస్థలు పెట్టుబడి పథకాలుగానే చెబుతూ పాలసీదారులకు విక్రయించేవి.

Published : 05 Jul 2024 00:39 IST

బీమా.. పెట్టుబడి కలిసి ఉండే యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ(యులిప్‌)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని బీమా సంస్థలు పెట్టుబడి పథకాలుగానే చెబుతూ పాలసీదారులకు విక్రయించేవి. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) వీటిని పెట్టుబడి పథకాలుగా ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ఇవి మళ్లీ చర్చల్లోకి వచ్చాయి. వీటిని ఎంచుకోవడం మంచిదేనా? వివరాలు చూద్దాం.

చాలామంది యులిప్‌లు అంటే మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలే అని అనుకుంటారు. దీనికి కారణం లేకపోలేదు. బీమా సంస్థలు ఈ పాలసీలకు చెల్లించిన ప్రీమియంలో మోర్టాలిటీ ఛార్జీలను మినహాయించి, మిగతా మొత్తాన్ని ఫండ్లలో మదుపు చేస్తుంటాయి. దీంతో ఒక విధంగా వీటినీ ఫండ్లతోనే పోలుస్తుంటాయి. కొత్తగా వచ్చిన నిబంధనతో బీమా సంస్థలు యులిప్‌లను బీమా పాలసీలుగానే ప్రచారం చేయాలి. దీనివల్ల పాలసీదారులకు మరింత స్పష్టత వస్తుంది. పెట్టుబడిగా చూడకుండా.. యులిప్‌లను తీసుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని అంశాలను తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుంది.

అయిదేళ్ల లాకిన్‌..

యులిప్‌లు తీసుకున్నప్పుడు వాటిల్లో కనీసం అయిదేళ్లపాటు కొనసాగాలి. కాబట్టి, దీర్ఘకాలిక లక్ష్యాలున్న వారు వీటిని ఎంచుకోవడం మంచిది. వీటికి చెల్లించిన ప్రీమియం ఏడాదికి రూ.2.5లక్షల లోపు ఉంటే, వ్యవధి తీరిన తర్వాత వచ్చిన మొత్తంపై పన్ను వర్తించదు. పిల్లల చదువులు, వారి వివాహంలాంటి ఖర్చులకు ఉపయోగపడేలా వీటిని ఎంచుకోవచ్చు. ఇందులో ప్రీమియం వైవర్‌ రైడర్‌ ఉంటుంది. పాలసీదారుడికి ఏదైనా జరిగితే, పాలసీ వ్యవధి తీరేవరకూ అది కొనసాగేందుకు ఇది తోడ్పడుతుంది. కాబట్టి, ఆర్థిక రక్షణ, లక్ష్యాల సాధన కోసం దీన్ని ఎంచుకోవచ్చు.

వెంటనే నగదుగా..

యులిప్‌లు దీర్ఘకాలిక అవసరాల కోసమే. అత్యవసరాల్లో పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. మరోవైపు యులిప్‌లు విధించే మోర్టాలిటీ ఛార్జీలు టర్మ్‌ బీమా ప్రీమియం కన్నా అధికంగానే ఉండే అవకాశం ఉంది. టర్మ్‌ పాలసీ తీసుకొని, మిగతా మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసినప్పుడు బీమా రక్షణ అధికంగా లభించడంతోపాటు, పెట్టుబడులపై రాబడీ కాస్త ఎక్కువగానే అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

రెండు రకాలుగా..

యులిప్‌లు తీసుకున్నప్పుడు పరిశీలించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు నామినీకి పరిహారం ఎలా ఇస్తారన్నది చూసుకోవడం. కొన్ని పాలసీ విలువ, పెట్టుబడి విలువలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తం అందిస్తాయి. కొన్ని రకాల పాలసీలు.. పాలసీ మొత్తంతోపాటు, యూనిట్ల విలువనూ కలిపి చెల్లిస్తాయి. మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలను బట్టి, ఈ రెండింటిలో ఏ రకం ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.

ఎవరు తీసుకోవచ్చు..

  • క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ, ఆర్థిక క్రమశిక్షణ కావాలని కోరుకునేవారు.
  • మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తూ, హెచ్చుతగ్గులకు ఆందోళన చెందే వారికి.
  • 10 ఏళ్లకు మించి పెట్టుబడులు కొనసాగించాలని అనుకునేవారు. 
  • ప్రీమియం వైవర్‌ ప్రయోజనం పొందాలనుకునే వారు

అవసరమైనప్పుడు వెంటనే పెట్టుబడులు ఉపసంహరించుకోవాలనే ఆలోచన ఉన్నవారు, క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించడం సాధ్యం కాని వారు వీటిని తీసుకోకపోవడమే మంచిది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని